న్యూఢిల్లీ: అయోధ్య భూవివాద కేసును మధ్యవర్తికి అప్పగించే విషయంలో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. సమస్య పరిష్కారానికి అర్హులైన మధ్యవర్తుల పేర్లు సూచించాలని కక్షిదారుల్ని కోరింది. ఈ వ్యవహారంలో త్వరలోనే ఆదేశాలు జారీచేస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్‌ల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం తెలిపింది.
వివాద స్వభావం దృష్ట్యా మధ్యవర్తిత్వ మార్గం ఎంచుకోవడం సరైనది కాదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. సమస్య సద్దుమణిగేందుకు అవకాశం ఉన్నప్పుడే ఈ దిశగా యోచించాలని పేర్కొన్నారు. గతంలోనూ మధ్యవర్తిత్వంతో సమస్య పరిష్కారానికి చాలాసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని కక్షిదారు రామ్‌లల్లా విరాజ్‌మాన్ తరఫు లాయర్ సీఎస్ వైద్యనాథన్ గుర్తుచేశారు. రాముడు అయోధ్యలోనే జన్మించాడన్న విషయంలో ఎలాంటి వివాదం లేదని, కాబట్టి ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం అక్కర్లేదని అన్నారు.
అయోధ్యలో వివాదాస్పద భూమి ప్రభుత్వానికే చెందుతుందని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి అన్నారు. ఆ స్థలంలో ఆలయం ఉండేదని గుర్తిస్తే, రామాలయ నిర్మాణానికి భూమి కేటాయిస్తామని 1994లో పీవీ ప్రభుత్వం కోర్టుకు మాట ఇచ్చిన సంగతిని ప్రస్తావించారు. వివాదం ఆస్తికే సంబంధించికాదని, సెంటిమెంట్లు, విశ్వాసాలతోముడిపడి ఉందని వ్యాఖ్యానించింది. మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవాలన్న కోర్టు సూచనకు ముస్లిం సంస్థలు అంగీకరించగా, హిందూ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment