నేలపాడులో సీజేఐ జస్టిస్ గొగొయ్ ప్రారంభించనున్న హైకోర్టు తాత్కాలిక భవనం..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక భవన ప్రారంభోత్సవం ఆదివారం జరగనుంది. సీఆర్‌డీఏ పరిధిలో నేలపాడులో నిర్మించిన ఈ తాత్కాలిక భవనాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగొయ్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టులోని తెలుగు న్యాయమూర్తులు జస్టిస్ నూతలపాటి వెంకటరమణ, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ రామయ్యగారి సుభాష్‌రెడ్డి, ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్‌లతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పలువురు న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు. అయితే హైకోర్టు తాత్కాలిక భవనం నుంచి కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న విషయంపై ఇంతవరకూ పూర్తి స్పష్టత లేదు. ఫిబ్రవరి 15 అనంతరం ఈ భవనం నుంచి హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభించవచ్చు. భవనాన్ని ఇప్పటికే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రధాన ద్వారం పైభాగంలో మూడు సింహాల బొమ్మ ఏర్పాటు చేశారు.
హైకోర్టులోని ఓ కోర్టు గది
2.5 లక్షల చ.అడుగుల్లో నిర్మాణం
ఈ తాత్కాలిక భవనాన్ని అత్యాధునిక వసతులతో నిర్మించారు. రూ.110 కోట్లతో జీ+2 అంతస్తుల్లో నిర్మించిన భవనాన్ని భవిష్యత్తులో జీ+ 5కు పెంచుకునే వెసులుబాటు ఉంది. 2.5 లక్షల చదరపు అడుగుల్లో ఈ తాత్కాలిక భవన నిర్మాణాన్ని ప్రారంభించగా.. మొదటి అంతస్తులో కోర్టు హాళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. రెండో అంతస్తులో నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. హైకోర్టు భవనం నాలుగు వైపులా రాజస్తాన్ స్టోన్‌ను పరిచారు. వాహనాల పార్కింగ్‌కు విశాలమైన స్థలం కేటాయించారు.
100 అడుగుల స్తూపం
జాతీయ జెండా ఎగురవేసేందుకు హైకోర్టు భవనం ఎదుట ఏర్పాటు చేసిన 100 అడుగుల స్తూపం ప్రత్యేక ఆకర్షణగా ఉంది. హైకోర్టు భవనం పక్కనే జీ+5 అంతస్తుల్లో న్యాయవాదుల కోసం మరో భవనం నిర్మిస్తున్నారు. 2.5 లక్షల రికార్డులు భద్రపరిచేలా ఏర్పాట్లు చేశారు. మహిళా న్యాయవాదులకు ప్రత్యేక గది, ప్రభుత్వ న్యాయవాదులకు చాంబర్లు, సువిశాలమైన క్యాంటీన్ ఏర్పాటు చేశారు. ఉద్యోగులు, న్యాయవాదులు, కక్షిదారుల కోసం తాత్కాలిక హైకోర్టు భవనానికి వచ్చేందుకు వీలుగా విజయవాడ, గుంటూరు జిల్లాల నుంచి బస్సులు నడపనున్నారు. తాత్కాలిక భవనం ఎదురుగా న్యాయమూర్తులకు విల్లాలు సిద్ధం చేస్తున్నారు. ఆ నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి.
నిఘా నీడలో నేలపాడు
గుంటూరు: నేలపాడు గ్రామ పరిధిలో ఆదివారం హైకోర్టు తాత్కాలిక భవనం ప్రారంభోత్సవం నేపథ్యంలో గట్టి నిఘా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రూరల్ ఎస్పీ ఎస్.వి.రాజశేఖరబాబు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీజేఐతో పాటు పలువురు సుప్రీం, తెలుగు రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తులు హాజరవుతున్న కారణంగా భద్రతను మరింత పెంచారు.
Comments
Please login to add a commentAdd a comment