సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల ఆరోపణలపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కి అంతర్గత కమిటీ క్లీన్‌చిట్ ఇచ్చిన నేపథ్యంలో సుప్రీం కోర్టు వెలుపల మంగళవారం 144 సెక్షన్ విధించారు. సుప్రీం కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు, మహిళా సంఘాల కార్యకర్తలు సర్వోన్నత న్యాయస్ధానం ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులను పోలీసులు నిలువరించే క్రమంలో పలువురు మహిళలు, జర్నలిస్టులను సైతం అదుపులోకి తీసుకున్నారు.
నిరసన ప్రదర్శనను కవర్ చేసేందుకు వచ్చిన జర్నలిస్టులను పోలీసులు ఆ తర్వాత విడుదల చేయగా 30 మందికి పైగా మహిళా కార్యకర్తలను మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో నిర్భందించారు. సుప్రీం కోర్టు వెలుపల భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన కమిటీ విచారణకు అనుసరించిన పద్ధతిని పలువురు న్యాయవాదులు, మహిళా కార్యకర్తలు వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్‌కు క్లీన్‌చిట్ ఇస్తూ సుప్రీం అంతర్గత కమిటీ విచారణకు అనుసరించిన విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టామని భారత మహిళా జాతీయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి అనీ రాజా పేర్కొన్నారు. గతంలో సుప్రీం కోర్టులో పనిచేసిన ఉద్యోగిని తనను జస్టిస్ రంజన్ గగోయ్ లైంగికంగా వేధింపులకు గురిచేశారని చేసిన ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment