జస్టిస్ ఎస్.ఎన్.శుక్లా
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయ వ్యవస్థలో అవినీతిని సహించేది లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ చెప్పారు. ఎంబీబీఎస్ ప్రవేశాల్లో ఓ ప్రైవేట్ మెడికల్ కళా శాల పట్ల ఉదారంగా వ్యవహరించిన కేసులో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎన్.శుక్లాపై విచారణ జరిపేందుకు సీబీఐకి అనుమతించారు. శుక్లా తీరుపై మాజీ సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా సూచన మేరకు ప్రాథమిక విచారణ జరిపామని, అవినీతిపై ఆధారాలు లభించాయని దర్యాప్తు సంస్థ పేర్కొంది. శుక్లాపై ఉన్న అవినీతి ఆరోపణలు తీవ్రంగా పరిగణించాల్సి ఉందన్న కమిటీ నివేదిక ఆధారంగా గొగోయ్ విచారణకు అనుమతించారు.
దర్యాప్తు జరిపేందుకు వీలుగా అనుమతి కోరుతూ ప్రాథమిక విచారణపై ఒక సంక్షిప్త నివేదికను కూడా సీబీఐ అందజేసింది.‘శుక్లా అవినీతి దర్యాప్తు అంశంపై మీ లేఖలో జోడించిన గమనికను పరిగణించడం జరిగింది. విచారణకు అనుమతి మంజూరు చేస్తున్నాం’అని గొగోయ్ చెప్పారు. సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తిపై కేసు నమోదు చేయడానికి అనుమతి ఇవ్వడం ఇదే మొదటిసారి. కొన్ని నెలల తరువాత జస్టిస్ శుక్లా కేసు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. అప్పటిదాకా శుక్లాను న్యాయవ్యవస్థకు దూరంగా ఉండేలా ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment