sukla
-
ప్రధాని మోదీ ప్రస్తావించిన డీజీపీ రష్మీశుక్లా ఎవరు?
ముంబై: మహారాష్ట్ర తొలి మహిళా డీజీపీ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ఆమె గురించి ప్రస్తావించారు. మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారిగా మహిళా డీజీపీ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) పోలీసులను ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. మహారాష్ట్ర తొలి మహిళా డీజీపీగా ఎంపికైన ఈ మహిళా ఐపీఎస్ ఎవరో తెలుసుకుందాం.మహారాష్ట్ర తొలి మహిళా డీజీపీ పేరు రష్మీ శుక్లా. ఆమె 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 2024 జనవరి 4న మహారాష్ట్ర నూతన డీజీపీగా నియమితులయ్యారు. అంతకుముందు ఆమె డిప్యూటేషన్‌పై సశాస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) డైరెక్టర్ జనరల్ (డీజీ)గా పనిచేశారు. ఐపీఎస్ అధికారి, డీజీపీ రజనీష్ సేథ్ 2023, డిసెంబర్ 31న పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్‌కు డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం 2024,జనవరి 4న నూతన డీజీపీగా రష్మీ శుక్లాను నియమించింది.మహారాష్ట్ర డీజీపీ రష్మీ శుక్లా రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారి. మూడేళ్లపాటు ఆమె కేంద్రంలో డిప్యూటేషన్‌పై కొనసాగారు. ఆమె గత జూన్‌లో పదవీ విరమణ చేయవలసి ఉంది. అయితే ఆమె పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. రష్మీ శుక్లా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందినవారు. ప్రయాగ్‌రాజ్‌లోనే తన చదువును పూర్తి చేశాడు. అక్కడే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. 24 ఏళ్లకే ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. రష్మీ శుక్లా.. ఉదయ్ శుక్లాను వివాహం చేసుకున్నారు. ఉదయ్ ప్రస్తుతం ముంబైలోని ఆర్పీఎఫ్లో విధులు నిర్వహిస్తున్నారు.ఐపీఎస్ రష్మీ శుక్లా నాగ్‌పూర్ రూరల్ పోలీస్ సూపరింటెండెంట్‌గా కూడా పనిచేశారు. సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ డైరెక్టర్‌గా, పూణే పోలీస్ కమిషనర్ కూడా విధులు నిర్వహించారు. గతంలో ఆమె రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారంటూ పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఆమెపై పూణె, ముంబైలలో కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం మారిన దరిమిలా ఆమెపై పెట్టిన కేసులను ఉపసంహరిస్తూ, క్లీన్ చిట్ ఇచ్చారు. -
సవాళ్లే సక్సెస్‌కు మెట్లు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో మొట్టమొదటి మహిళా రిఫైనరీ యూనిట్ హెడ్‌గా సమర్ధంగా విధులను నిర్వర్తిస్తున్నారు శుక్లా మిస్త్రీ. పురుషాధిపత్య విభాగమైన మాన్యుఫ్యాక్చరింగ్, ఆపరేషన్స్ లీడర్‌గా కొనసాగుతున్న శుక్లా ఈ యేడాది ప్రతిష్టాత్మక ఇటిప్రైమ్ ఉమన్ లీడర్షిప్ అవార్డ్‌కు ఎంపికయ్యారు. గతంలో భారతీయ హైడ్రోకార్బన్ పరిశ్రమలోనూ మొట్టమొదటి మహిళా ఇన్స్పెక్షన్ ఇంజనీర్‌గా పనిచేసిన అనుభవం శుక్లా ఖాతాలో ఉంది. వారంలో అన్ని షిఫ్టులలోనూ, సమ్మె రోజున కూడా సమర్థంగా విధులను నిర్వర్తించిన అధికారిగా, సహోద్యోగులకు రోల్‌మోడల్‌గా నిలుస్తారు శుక్లా. అత్యుత్తమ సంస్థాగత నైపుణ్యాలతో, ఏ మాత్రం సంకోచం లేకుండా కీలక విధులను నిర్వర్తిస్తారనే ఘనత ఆమెది. వెస్ట్ బెంగాల్‌లోని సుందర్బన్స్ ప్రాంతంలో ఉన్న బసంతి అనే ఒక చిన్న గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగారు శుక్లా మిస్ట్రీ. ప్రతి యేటా వరదలకు గురవుతుండే ఆ గ్రామానికి పడవ సాయం తప్ప రోడ్డు మార్గం కూడా సరిగా లేదు. కరెంటు, కాలేజీలు లేని చోటు నుంచి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఇంజినీర్‌గా చేరడానికి ఎన్నో అవరోధాలను అధిగమించారు. అంచెలంచెలుగా రిఫైనరీ హెడ్‌గా ఎదిగారు. ‘మన దారి ఎప్పుడూ సునాయసంగా ఉండదు. కష్టాలు అనే బ్రేక్స్ వస్తూనే ఉంటాయి. సవాళ్లుగా వాటిని ఎదుర్కొని, ప్రయాణం కొనసాగిస్తేనే గమ్యానికి చేరగలం’ అంటారు ఐదు పదుల వయసున్న శుక్లా. సామర్థ్య నిరూపణ రిఫైనరీ కార్యకలాపాలలో ప్రత్యేక శ్రద్ధ అన్నివేళలా అవసరం. లేదంటే, ప్రమాదకరస్థితిని ఎదుర్కోక తప్పదు. అలాంటి కీలమైన విధి నిర్వహణ గురించి శుక్లా వివరిస్తూ ‘ముడిసరుకును మెరుగుపరిచే ప్రక్రియ నిరంతరాయంగా ఉంటుంది. వారంలో అన్ని షిఫ్టులకీ లీడ్ చేయడం తప్పనిసరి. అందరికీ సరైన గైడ్‌లైన్స్ ఇస్తూ ఉండాలి’ అని వివరిస్తారు ఆమె. పుస్తకాలు కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో దూరపు బంధువు అందించిన సాయంతో, కలకత్తా విశ్వవిద్యాలయం నుండి 1986లో ఇంజినీరింగ్ పూర్తిచేశాక ఐఓసీలో చిన్న పోస్టులో చేరారు. అక్కడ మగవాళ్లు ఆన్సైట్లో పనిచేయడం చూసి, ఈ రంగంలో మహిళ ఎదగడానికి హద్దులున్నాయని గమనించారు. ఒక మహిళా ఇంజినీర్‌గా ఆఫీసులోనే కాకుండా పట్టుదలతో సైట్లో పనిచేయడానికి అనుమతి లభించేలా కష్టపడ్డారు. కానీ, ఆ సవాల్ అక్కడితో ఆగలేదు. శుక్లా ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ ‘మగ సహచరులతో పనిచేయగల అర్హతను సంపాదించుకోవడమే కాదు తగిన సామర్థ్యాన్ని కూడా చూపగలగాలి’ అంటారామె. అందుకు కొన్నేళ్ల సమయం పట్టిందని వివరిస్తారు శుక్లా. అవకాశాల కల్పనకు కృషి ఐసిఎఫ్ఎఐ నుంచి మోడర్న్ టెక్నాలజీలో డిప్లమా కూడా చేసిన శుక్లా నిర్వర్తించే విధులను గమనిస్తే అత్యంత చురుకుదనం, మానసిక శక్తి అవసరమయ్యే కఠినమైన ఉద్యోగం ఇది అని తెలుస్తుంది. మహిళలు కఠినమైన పని చేయడానికి ఇది తమకు తగనిది అని భావించడం తప్పు అనే శుక్లా ‘ఆడ–మగ తేడా లేదు. ఒకసారి పని మొదలుపెడితే ఎవరైనా దానిని సజావుగా పూర్తి చేయగల సామర్థ్యం తప్పక కలిగి ఉంటారు. అప్పుడు సమస్యలు, సవాళ్లు ఏవైనా కాలక్రమేణా తగ్గిపోతుంటాయి. మెరుగైన పనిని ‘చేయగలను’ అని సంకల్పించుకుంటేనే అవకాశాలు మనకోసం నడిచి వస్తాయి. అందుకు ప్రకృతి కూడా మన సమర్థతను నిరూపించుకోగలిగే స్థైర్యాన్ని ఇస్తుంది’ అంటారు. మనల్ని మనం అంగీకరిస్తేనే.. శుక్లా ఈ ఉద్యోగంలో చేరిన మొదటి రోజుల్లో ఇండియన్ ఆయిల్స్‌లో ముగ్గురు మహిళలలో ఒకరిగా ఉన్నారు. ఆ తర్వాత తన పనితనాన్ని నిరూపించుకుంటూ ఒక్కో మెట్టును అధిరోహించుకుంటూ వెళ్లారు. తరచూ దేశవ్యాప్తంగా ఒంటరిగా ప్రయాణిస్తూ, అవగాహన పెంచుకోవడంతో పాటు, సవాళ్లను ఎదుర్కోవడానికి తనను తాను సిద్ధం చేసుకున్నారు. ‘మగ సహచరులతో కలిసి పనిచేసే వాతావరణాన్ని మనమే తయారుచేసుకోవాలి. నేను సైట్లో వచ్చిన మొదటి రోజుల్లో నా గురించి వ్యతిరేకంగా మాట్లాడకున్నారు. కానీ, నన్ను నేను నిరూపించడం మొదలుపెట్టేసరికి ఇతరులూ నా సమర్థతను అంగీకరించడం ప్రారంభించారు. నేను వృత్తిరీత్యా కతార్‌కు వెళ్లవలసి వచ్చినప్పుడు ఆఫీస్‌ను, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకోవడంలో సమస్యలను ఎదుర్కొన్నాను. 75 మంది గల గల్ఫ్ దేశ సభ్యులలో ఏకైక మహిళగా ఏడాది పాటు పనిచేశాను. సాధారణంగా మహిళలు డెస్క్ జాబ్‌లు సరైనవి అన్నట్టుగా భావిస్తుంటారు. ఇప్పుడిప్పుడే అమ్మాయిలు తమ సామర్థ్యాలను తాము గుర్తిస్తున్నారు. చేయగలం అని నిరూపిస్తున్నారు. ఈ రంగంలో అమ్మాయిలు బాగా రాణించగలరు. అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి’ అని వివరిస్తారు శుక్లా. అవార్డుల నిధి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో మొదటి మహిళా యూనిట్ హెడ్‌గా చరిత్ర సృష్టించిన శుక్లా గతంలో ఎన్పిఎంపీ అవార్డు, పెట్రోఫెడ్ బెస్ట్ ఉమెన్ ఎగ్జిక్యూటివ్ అవార్డ్, కైజెన్ అవార్డ్ ఫర్ బెస్ట్ సజెషన్, పెట్రోటెక్ ఉజాసిని అవార్డు మొదలైన అనేక జాతీయ అవార్డులను అందుకున్నారు. ఆల్ రౌండర్‌గా పేరు తెచ్చుకున్న శుక్లా మంచి వక్త. వ్యాస రచన, కవిత్వం, క్రీడల పైనా ఎంతో ఆసక్తి చూపుతారు. కష్టంగా అనిపించే పనులను పట్టుదలతో చేపట్టి, సంకల్పబలంతో సాధించి, ఆశ్చర్యపరిచే విజయాలను సొంతం చేసుకునే శుక్లా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. -
సిట్టింగ్ జడ్జిపై సీబీఐ విచారణ
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయ వ్యవస్థలో అవినీతిని సహించేది లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ చెప్పారు. ఎంబీబీఎస్ ప్రవేశాల్లో ఓ ప్రైవేట్ మెడికల్ కళా శాల పట్ల ఉదారంగా వ్యవహరించిన కేసులో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎన్.శుక్లాపై విచారణ జరిపేందుకు సీబీఐకి అనుమతించారు. శుక్లా తీరుపై మాజీ సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా సూచన మేరకు ప్రాథమిక విచారణ జరిపామని, అవినీతిపై ఆధారాలు లభించాయని దర్యాప్తు సంస్థ పేర్కొంది. శుక్లాపై ఉన్న అవినీతి ఆరోపణలు తీవ్రంగా పరిగణించాల్సి ఉందన్న కమిటీ నివేదిక ఆధారంగా గొగోయ్ విచారణకు అనుమతించారు. దర్యాప్తు జరిపేందుకు వీలుగా అనుమతి కోరుతూ ప్రాథమిక విచారణపై ఒక సంక్షిప్త నివేదికను కూడా సీబీఐ అందజేసింది.‘శుక్లా అవినీతి దర్యాప్తు అంశంపై మీ లేఖలో జోడించిన గమనికను పరిగణించడం జరిగింది. విచారణకు అనుమతి మంజూరు చేస్తున్నాం’అని గొగోయ్ చెప్పారు. సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తిపై కేసు నమోదు చేయడానికి అనుమతి ఇవ్వడం ఇదే మొదటిసారి. కొన్ని నెలల తరువాత జస్టిస్ శుక్లా కేసు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. అప్పటిదాకా శుక్లాను న్యాయవ్యవస్థకు దూరంగా ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. -
భార్య, ముగ్గురు పిల్లల్ని చంపేశాడు..
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఓ ప్రయివేట్ ట్యూటర్ ...భార్య, ముగ్గురు పిల్లల్ని హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ట్యూటర్‌గా పనిచేస్తున్న ఉపేంద్ర శుక్లా... శనివారం తెల్లవారుజామున భార్య, పిల్లలను గొంతుకోసి హతమార్చాడు. దక్షిణ ఢిల్లీలోని మెహ్రోలీ ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. అదే ఇంట్లో నివాసం ఉంటున్న శుక్ల అత్త... తెల్లవారినా కుమార్తె, పిల్లలు గది నుంచి రాకపోవడం, తలుపులు కొట్టినా తెరవకపోవడంతో స్థానికుల సాయం తీసుకున్నారు. బలవంతంగా తలుపులు తెరిచి చూడగా నలుగురు విగత జీవులుగా పడి ఉండటం చూసి, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చనిపోయిన ముగ్గురు చిన్నారుల్లో రెండు నెలల పసిపాప కూడా ఉంది. ఈ దారుణానికి పాల్పడిన శుక్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ హత్యలు తానే చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. అయితే ఎందుకు ఈ ఘటనకు పాల్పడ్డాడనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. కాగా గత కొంతకాలంగా శుక్లా మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. -
హత్య కేసులో నలుగురి అరెస్టు
బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలోని అశోక్‌నగర్‌బస్తీలో జరిగిన హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం సీఐ బానోతు బాలాజీ తన చాంబర్లో వివరాలు వెల్లడించారు. తాండూర్ మండల కేంద్రానికి చెందిన ఎల్లేరు సతీష్, తన భార్య శుక్లతో కలిసి రెండు నెలల క్రితం బెల్లంపల్లికి వలస వచ్చాడు. అశోక్‌నగర్ బస్తీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. సతీష్ ఓ మోటార్‌సైకిల్ షోరూంలో మెకానిక్‌గా పనిచేస్తుండేవాడు. తన భార్య శుక్లకు తాండూరుకు చెందిన కొడిపే నర్సింలుతో వివాహేతర సంబంధం ఉన్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా సతీష్ తెలుసుకున్నాడు. నర్సింలును అంతమొందించాలని భార్య శుక్ల, మేనల్లుడు వాల్మీకి వినోద్(తాండూర్), బావమరిది వైరగాడి నూతన్‌కుమార్(భూరుగుగూడ, ఆసిఫాబాద్)లతో కలిసి పథకం రూపొందించాడు. గత నెల 24న శుక్లతో నర్సింలుకు ఫోన్ చేయించి బెల్లంపల్లికి రప్పించాడు. రాత్రి 10గంటల తర్వాత ఇంటికి రాగానే వైర్‌తో నర్సింలు మెడకు ఉరి వేసి, తలపై రాడ్‌తో కట్టి చంపారు. మృతదేహాన్ని బయటకు తరలించే క్రమంలో ఇంటి యజమానికి మెలకువ వచ్చి బయటకు రావడంతో నిందితులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. మహారాష్ట్రకు పారిపోయారు. వారి వద్ద ఉన్న డబ్బులు అయిపోవడంతో శుక్రవారం తాండూరుకు వచ్చినట్లు సమాచారం అందుకుని సతీష్, శుక్ల, వినోద్, నూతన్‌కుమార్‌లను అరెస్టు చేశామని సీఐ వివరించారు. నిందితులను కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో వన్‌టౌన్ ఎస్సై వి.వేణుగోపాల్‌రావు, ఏఎస్సై సాగర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.