ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో మొట్టమొదటి మహిళా రిఫైనరీ యూనిట్ హెడ్‌గా సమర్ధంగా విధులను నిర్వర్తిస్తున్నారు శుక్లా మిస్త్రీ. పురుషాధిపత్య విభాగమైన మాన్యుఫ్యాక్చరింగ్, ఆపరేషన్స్ లీడర్‌గా కొనసాగుతున్న శుక్లా ఈ యేడాది ప్రతిష్టాత్మక ఇటిప్రైమ్ ఉమన్ లీడర్‌షిప్ అవార్డ్‌కు ఎంపికయ్యారు. గతంలో భారతీయ హైడ్రోకార్బన్ పరిశ్రమలోనూ మొట్టమొదటి మహిళా ఇన్‌స్పెక్షన్ ఇంజనీర్‌గా పనిచేసిన అనుభవం శుక్లా ఖాతాలో ఉంది.
వారంలో అన్ని షిఫ్టులలోనూ, సమ్మె రోజున కూడా సమర్థంగా విధులను నిర్వర్తించిన అధికారిగా, సహోద్యోగులకు రోల్‌మోడల్‌గా నిలుస్తారు శుక్లా. అత్యుత్తమ సంస్థాగత నైపుణ్యాలతో, ఏ మాత్రం సంకోచం లేకుండా కీలక విధులను నిర్వర్తిస్తారనే ఘనత ఆమెది. వెస్ట్ బెంగాల్‌లోని సుందర్‌బన్స్ ప్రాంతంలో ఉన్న బసంతి అనే ఒక చిన్న గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగారు శుక్లా మిస్ట్రీ.
ప్రతి యేటా వరదలకు గురవుతుండే ఆ గ్రామానికి పడవ సాయం తప్ప రోడ్డు మార్గం కూడా సరిగా లేదు. కరెంటు, కాలేజీలు లేని చోటు నుంచి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఇంజినీర్‌గా చేరడానికి ఎన్నో అవరోధాలను అధిగమించారు. అంచెలంచెలుగా రిఫైనరీ హెడ్‌గా ఎదిగారు. ‘మన దారి ఎప్పుడూ సునాయసంగా ఉండదు. కష్టాలు అనే బ్రేక్స్ వస్తూనే ఉంటాయి. సవాళ్లుగా వాటిని ఎదుర్కొని, ప్రయాణం కొనసాగిస్తేనే గమ్యానికి చేరగలం’ అంటారు ఐదు పదుల వయసున్న శుక్లా.
సామర్థ్య నిరూపణ
రిఫైనరీ కార్యకలాపాలలో ప్రత్యేక శ్రద్ధ అన్నివేళలా అవసరం. లేదంటే, ప్రమాదకరస్థితిని ఎదుర్కోక తప్పదు. అలాంటి కీలమైన విధి నిర్వహణ గురించి శుక్లా వివరిస్తూ ‘ముడిసరుకును మెరుగుపరిచే ప్రక్రియ నిరంతరాయంగా ఉంటుంది. వారంలో అన్ని షిఫ్టులకీ లీడ్ చేయడం తప్పనిసరి. అందరికీ సరైన గైడ్‌లైన్స్ ఇస్తూ ఉండాలి’ అని వివరిస్తారు ఆమె.
పుస్తకాలు కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో దూరపు బంధువు అందించిన సాయంతో, కలకత్తా విశ్వవిద్యాలయం నుండి 1986లో ఇంజినీరింగ్ పూర్తిచేశాక ఐఓసీలో చిన్న పోస్టులో చేరారు.
అక్కడ మగవాళ్లు ఆన్‌సైట్లో పనిచేయడం చూసి, ఈ రంగంలో మహిళ ఎదగడానికి హద్దులున్నాయని గమనించారు. ఒక మహిళా ఇంజినీర్‌గా ఆఫీసులోనే కాకుండా పట్టుదలతో సైట్‌లో పనిచేయడానికి అనుమతి లభించేలా కష్టపడ్డారు. కానీ, ఆ సవాల్ అక్కడితో ఆగలేదు. శుక్లా ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ ‘మగ సహచరులతో పనిచేయగల అర్హతను సంపాదించుకోవడమే కాదు తగిన సామర్థ్యాన్ని కూడా చూపగలగాలి’ అంటారామె. అందుకు కొన్నేళ్ల సమయం పట్టిందని వివరిస్తారు శుక్లా.
అవకాశాల కల్పనకు కృషి
ఐసిఎఫ్‌ఎఐ నుంచి మోడర్న్ టెక్నాలజీలో డిప్లమా కూడా చేసిన శుక్లా నిర్వర్తించే విధులను గమనిస్తే అత్యంత చురుకుదనం, మానసిక శక్తి అవసరమయ్యే కఠినమైన ఉద్యోగం ఇది అని తెలుస్తుంది. మహిళలు కఠినమైన పని చేయడానికి ఇది తమకు తగనిది అని భావించడం తప్పు అనే శుక్లా ‘ఆడ–మగ తేడా లేదు. ఒకసారి పని మొదలుపెడితే ఎవరైనా దానిని సజావుగా పూర్తి చేయగల సామర్థ్యం తప్పక కలిగి ఉంటారు. అప్పుడు సమస్యలు, సవాళ్లు ఏవైనా కాలక్రమేణా తగ్గిపోతుంటాయి. మెరుగైన పనిని ‘చేయగలను’ అని సంకల్పించుకుంటేనే అవకాశాలు మనకోసం నడిచి వస్తాయి. అందుకు ప్రకృతి కూడా మన సమర్థతను నిరూపించుకోగలిగే స్థైర్యాన్ని ఇస్తుంది’ అంటారు.
మనల్ని మనం అంగీకరిస్తేనే..
శుక్లా ఈ ఉద్యోగంలో చేరిన మొదటి రోజుల్లో ఇండియన్ ఆయిల్స్‌లో ముగ్గురు మహిళలలో ఒకరిగా ఉన్నారు. ఆ తర్వాత తన పనితనాన్ని నిరూపించుకుంటూ ఒక్కో మెట్టును అధిరోహించుకుంటూ వెళ్లారు. తరచూ దేశవ్యాప్తంగా ఒంటరిగా ప్రయాణిస్తూ, అవగాహన పెంచుకోవడంతో పాటు, సవాళ్లను ఎదుర్కోవడానికి తనను తాను సిద్ధం చేసుకున్నారు. ‘మగ సహచరులతో కలిసి పనిచేసే వాతావరణాన్ని మనమే తయారుచేసుకోవాలి. నేను సైట్‌లో వచ్చిన మొదటి రోజుల్లో నా గురించి వ్యతిరేకంగా మాట్లాడకున్నారు.
కానీ, నన్ను నేను నిరూపించడం మొదలుపెట్టేసరికి ఇతరులూ నా సమర్థతను అంగీకరించడం ప్రారంభించారు. నేను వృత్తిరీత్యా కతార్‌కు వెళ్లవలసి వచ్చినప్పుడు ఆఫీస్‌ను, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకోవడంలో సమస్యలను ఎదుర్కొన్నాను. 75 మంది గల గల్ఫ్ దేశ సభ్యులలో ఏకైక మహిళగా ఏడాది పాటు పనిచేశాను. సాధారణంగా మహిళలు డెస్క్ జాబ్‌లు సరైనవి అన్నట్టుగా భావిస్తుంటారు. ఇప్పుడిప్పుడే అమ్మాయిలు తమ సామర్థ్యాలను తాము గుర్తిస్తున్నారు. చేయగలం అని నిరూపిస్తున్నారు. ఈ రంగంలో అమ్మాయిలు బాగా రాణించగలరు. అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి’ అని వివరిస్తారు శుక్లా.
అవార్డుల నిధి
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో మొదటి మహిళా యూనిట్ హెడ్‌గా చరిత్ర సృష్టించిన శుక్లా గతంలో ఎన్‌పిఎంపీ అవార్డు, పెట్రోఫెడ్ బెస్ట్ ఉమెన్ ఎగ్జిక్యూటివ్ అవార్డ్, కైజెన్ అవార్డ్ ఫర్ బెస్ట్ సజెషన్, పెట్రోటెక్ ఉజాసిని అవార్డు మొదలైన అనేక జాతీయ అవార్డులను అందుకున్నారు. ఆల్ రౌండర్‌గా పేరు తెచ్చుకున్న శుక్లా మంచి వక్త. వ్యాస రచన, కవిత్వం, క్రీడల పైనా ఎంతో ఆసక్తి చూపుతారు. కష్టంగా అనిపించే పనులను పట్టుదలతో చేపట్టి, సంకల్పబలంతో సాధించి, ఆశ్చర్యపరిచే విజయాలను సొంతం చేసుకునే శుక్లా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment