ముంబై: మహారాష్ట్ర తొలి మహిళా డీజీపీ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ఆమె గురించి ప్రస్తావించారు. మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారిగా మహిళా డీజీపీ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) పోలీసులను ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. మహారాష్ట్ర తొలి మహిళా డీజీపీగా ఎంపికైన ఈ మహిళా ఐపీఎస్ ఎవరో తెలుసుకుందాం.
మహారాష్ట్ర తొలి మహిళా డీజీపీ పేరు రష్మీ శుక్లా. ఆమె 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 2024 జనవరి 4న మహారాష్ట్ర నూతన డీజీపీగా నియమితులయ్యారు. అంతకుముందు ఆమె డిప్యూటేషన్‌పై సశాస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ) డైరెక్టర్ జనరల్ (డీజీ)గా పనిచేశారు. ఐపీఎస్ అధికారి, డీజీపీ రజనీష్ సేథ్ 2023, డిసెంబర్ 31న పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్‌కు డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం 2024,జనవరి 4న నూతన డీజీపీగా రష్మీ శుక్లాను నియమించింది.
మహారాష్ట్ర డీజీపీ రష్మీ శుక్లా రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారి. మూడేళ్లపాటు ఆమె కేంద్రంలో డిప్యూటేషన్‌పై కొనసాగారు. ఆమె గత జూన్‌లో పదవీ విరమణ చేయవలసి ఉంది. అయితే ఆమె పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. రష్మీ శుక్లా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందినవారు. ప్రయాగ్‌రాజ్‌లోనే తన చదువును పూర్తి చేశాడు. అక్కడే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. 24 ఏళ్లకే ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. రష్మీ శుక్లా.. ఉదయ్ శుక్లాను వివాహం చేసుకున్నారు. ఉదయ్ ప్రస్తుతం ముంబైలోని ఆర్పీఎఫ్‌లో విధులు నిర్వహిస్తున్నారు.
ఐపీఎస్ రష్మీ శుక్లా నాగ్‌పూర్ రూరల్ పోలీస్ సూపరింటెండెంట్‌గా కూడా పనిచేశారు. సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ డైరెక్టర్‌గా, పూణే పోలీస్ కమిషనర్ కూడా విధులు నిర్వహించారు. గతంలో ఆమె రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారంటూ పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఆమెపై పూణె, ముంబైలలో కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం మారిన దరిమిలా ఆమెపై పెట్టిన కేసులను ఉపసంహరిస్తూ, క్లీన్ చిట్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment