సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఓ ప్రయివేట్ ట్యూటర్ ...భార్య, ముగ్గురు పిల్లల్ని హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ట్యూటర్‌గా పనిచేస్తున్న ఉపేంద్ర శుక్లా... శనివారం తెల్లవారుజామున భార్య, పిల్లలను గొంతుకోసి హతమార్చాడు. దక్షిణ ఢిల్లీలోని మెహ్‌రోలీ ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. అదే ఇంట్లో నివాసం ఉంటున్న శుక్ల అత్త... తెల్లవారినా కుమార్తె, పిల్లలు గది నుంచి రాకపోవడం, తలుపులు కొట్టినా తెరవకపోవడంతో స్థానికుల సాయం తీసుకున్నారు. బలవంతంగా తలుపులు తెరిచి చూడగా నలుగురు విగత జీవులుగా పడి ఉండటం చూసి, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చనిపోయిన ముగ్గురు చిన్నారుల్లో రెండు నెలల పసిపాప కూడా ఉంది. ఈ దారుణానికి పాల్పడిన శుక్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ హత్యలు తానే చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. అయితే ఎందుకు ఈ ఘటనకు పాల్పడ్డాడనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. కాగా గత కొంతకాలంగా శుక్లా మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment