లోక్‌పాల్‌పై ‘సుప్రీం’ తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: దేశంలో లోక్‌పాల్ నియామకం చేపట్టాలంటూ దాఖలైన వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వులో ఉంచింది. అందరి వాదనలు విన్నామని, తీర్పును రిజర్వులో ఉంచుతున్నామని న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ సారథ్యంలోని ధర్మాసనం పేర్కొంది. విచారణ సందర్భంగా కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. లోక్‌పాల్ చట్టంలో ప్రస్తావించిన ప్రతిపక్ష నేతకు సంబంధించిన నిర్వచనం విషయంలో చేపట్టిన సవరణలు పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్నాయని, అందువల్ల ప్రస్తుతమున్న పరిస్థితుల్లో లోక్‌పాల్ నియామకం సాధ్యపడదని తెలిపారు.
లోక్‌పాల్, లోకాయుక్త చట్టం– 2013 ప్రకారం లోక్‌పాల్ ఎంపిక ప్యానెల్‌లో లోక్‌సభ ప్రతిపక్ష నేత సభ్యుడిగా ఉంటారు. అయితే ప్రస్తుత లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం గమనార్హం. లోక్‌సభలో కాంగ్రెస్ అతి పెద్ద విపక్ష పార్టీగా ఉన్నప్పటికీ ప్రతిపక్ష నేత హోదా పొందేందుకు అవసర మైన సంఖ్యాబలం దానికి లేదని, అందువల్ల కాంగ్రెస్‌కు ఆ పదవి ఇవ్వలేదని అటార్నీ జనరల్ వివరించారు. అతిపెద్ద విపక్షపార్టీ నేతను ప్రతిపక్ష నేతగా చేస్తూ తలపెట్టిన సవరణలు పార్లమెంటులో ఆమోదం పొందేవరకు లోక్‌పాల్ నియామకం సాధ్యం కాదని రోహత్గీ స్పష్టం చేశారు. లోక్‌పాల్ నియామకం చేపట్టాలం టూ ఎన్జీవో కామన్ కాజ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఎన్జీవో తరఫున సీనియర్ న్యాయవాది శాంతి భూషణ్ వాదనలు విని పిస్తూ బిల్లు 2013లో పార్లమెంటు ఆమోదం పొందిందని, 2014లో అమలులోకి వచ్చిందని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా లోక్‌పాల్‌ను నియమించట్లేదన్నారు.