Lokpal Appointment
-
లోక్‌పాల్ కోసం అక్టోబర్ 2 నుంచి నిరశన
రాలేగావ్ సిద్ధి: లోక్‌పాల్ నియామకంపై కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీరుకు నిరసనగా అక్టోబర్ 2 నుంచి నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ప్రకటించారు. అవినీతి రహిత దేశం కోసం తాను చేపట్టిన ఈ ఉద్యమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తన స్వస్థలమైన రాలేగావ్ సిద్ధిలో మహాత్ముడి జన్మదినమైన అక్టోబర్ 2 నుంచి నిరాహారదీక్ష చేపడతానని తెలిపారు. అవినీతిని అరికట్టాలనే చిత్తశుద్ధి ఎన్డీయే సర్కారుకు లేదని, అందుకే లోక్‌పాల్ నియామకంపై కుంటిసాకులు చెబుతోందని మండిపడ్డారు. లోక్‌పాల్ బిల్లు అమలుతో పాటు సత్వరమే లోక్‌పాల్‌ను నియమిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారం చేపట్టిన ఎన్డీయే, ఇప్పడు దానిని విస్మరించిందని ఆరోపించారు. లోక్‌పాల్ చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ 2011లో 12 రోజులపాటు అన్నా హజారే దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో అప్పటి యూపీఏ సర్కారు 2014లో లోక్‌పాల్ చట్టాన్ని తెచ్చింది. -
లోక్‌పాల్ నియామకమెప్పుడు?
న్యూఢిల్లీ: లోక్‌పాల్ నియామకానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలుపుతూ 10 రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. లోక్‌పాల్‌ను నియమించాలని గత ఏప్రిల్‌లో కోర్టు ఇచ్చిన ఆదేశాలను కేంద్రం అమలు చేయలేదని పేర్కొంటూ కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేసింది. కేంద్రం లోక్‌పాల్‌ను నియమించే వరకు సుప్రీం తన అధికారంతో ఆర్టికల్ 142 ప్రకారం లోక్‌పాల్‌ను నియమించాలని కామన్ కాజ్ తరఫు సీనియర్ లాయరు శాంతి భూషణ్ కోరారు. -
లోక్‌పాల్ నియామకం ఎప్పుడు..?
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌పాల్ నియామకంపై జాప్యం పట్ల కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు నిలదీసింది. లోక్‌పాల్‌ను ఎప్పుడు నియమిస్తారో పదిరోజుల్లోగా తమకు నివేదించాలని సర్వోన్నత న్యాయస్ధానం సోమవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. లోక్‌పాల్ నియామకంపై చేపట్టిన చర్యలను వివరిస్తూ పదిరోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని జస్టిస్ రంజన్ గగోయ్, ఆర్ భానుమతితో కూడిన బెంచ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా లోక్‌పాల్ నియామకంపై ప్రభుత్వం నుంచి తనకు అందిన లిఖితపూర్వక సూచనలను అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ బెంచ్ ముందుంచారు. ఇక ఈ అంశంపై తదుపరి విచారణను సుప్రీం బెంచ్ ఈనెల 17కు వాయిదా వేసింది. గత ఏడాది ఏప్రిల 27న సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా కేంద్రం ఇప్పటివరకూ లోక్‌పాల్ నియామకం చేపట్టలేదని ఎన్జీఓ కామన్ కాజ్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు చేపట్టింది. ప్రతిపాదిత సవరణలు చేపట్టేవరకూ లోక్‌పాల్ చట్టం అమలును నిలిపివేయాలనడంలో ఔచిత్యం లేదని గత ఏడాది ఉత్తర్వుల్లో సుప్రీం కోర్టు విస్పష్టంగా పేర్కొంది. -
లోక్‌పాల్‌పై కేంద్రం వాదన ఇదే..
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌పాల్ నియామక ప్రక్రియ కొనసాగుతోందని, ప్రధానితో కూడిన ఎంపిక కమిటీ మార్చి 1న సమావేశమవుతోందని కేంద్రం శుక్రవారం సర్వోన్నత న్యాయస్ధానానికి నివేదించింది. లోక్‌పాల్ నియామకానికి అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపట్టిందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ ఆర్. భానుమతిలతో కూడిన సుప్రీం బెంచ్‌కు వివరించారు. లోక్‌పాల్ నియామకంపై చర్చించేందుకు ప్రధాని, భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభ స్పీకర్, విపక్ష నేతలతో కూడిన ఎంపిక కమిటీ వచ్చే నెల 1న సమావేశం కానుందని తెలిపారు. దీంతో ఈ అంశంపై తదుపరి విచారణను మార్చి 6కు కోర్టు వాయిదా వేసింది. లోక్‌పాల్ నియామకంపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్ సమర్పించాలని కేంద్రాన్ని కోరింది. గత ఏడాది ఏప్రిల్ 27న లోక్‌పాల్ నియామకంపై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఎన్జీఓ కామన్ కాజ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం బెంచ్ విచారిస్తోంది. -
లోక్‌పాల్‌పై ‘సుప్రీం’ తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: దేశంలో లోక్‌పాల్ నియామకం చేపట్టాలంటూ దాఖలైన వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వులో ఉంచింది. అందరి వాదనలు విన్నామని, తీర్పును రిజర్వులో ఉంచుతున్నామని న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ సారథ్యంలోని ధర్మాసనం పేర్కొంది. విచారణ సందర్భంగా కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. లోక్‌పాల్ చట్టంలో ప్రస్తావించిన ప్రతిపక్ష నేతకు సంబంధించిన నిర్వచనం విషయంలో చేపట్టిన సవరణలు పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్నాయని, అందువల్ల ప్రస్తుతమున్న పరిస్థితుల్లో లోక్‌పాల్ నియామకం సాధ్యపడదని తెలిపారు. లోక్‌పాల్, లోకాయుక్త చట్టం– 2013 ప్రకారం లోక్‌పాల్ ఎంపిక ప్యానెల్లో లోక్‌సభ ప్రతిపక్ష నేత సభ్యుడిగా ఉంటారు. అయితే ప్రస్తుత లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం గమనార్హం. లోక్‌సభలో కాంగ్రెస్ అతి పెద్ద విపక్ష పార్టీగా ఉన్నప్పటికీ ప్రతిపక్ష నేత హోదా పొందేందుకు అవసర మైన సంఖ్యాబలం దానికి లేదని, అందువల్ల కాంగ్రెస్‌కు ఆ పదవి ఇవ్వలేదని అటార్నీ జనరల్ వివరించారు. అతిపెద్ద విపక్షపార్టీ నేతను ప్రతిపక్ష నేతగా చేస్తూ తలపెట్టిన సవరణలు పార్లమెంటులో ఆమోదం పొందేవరకు లోక్‌పాల్ నియామకం సాధ్యం కాదని రోహత్గీ స్పష్టం చేశారు. లోక్‌పాల్ నియామకం చేపట్టాలం టూ ఎన్జీవో కామన్ కాజ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఎన్జీవో తరఫున సీనియర్ న్యాయవాది శాంతి భూషణ్ వాదనలు విని పిస్తూ బిల్లు 2013లో పార్లమెంటు ఆమోదం పొందిందని, 2014లో అమలులోకి వచ్చిందని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా లోక్‌పాల్‌ను నియమించట్లేదన్నారు. -
నిర్జీవ లేఖగా మార్చొద్దు
లోక్‌పాల్ నియామకంలో జాప్యంపై సుప్రీంకోర్టు అసంతృప్తి న్యూఢిల్లీ: లోక్‌పాల్ నియామకంలో కేంద్రం జాప్యాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. చట్టం ఓ ‘నిర్జీవమైన లేఖ’గా మారడాన్ని అనుమతించరాదని స్పష్టం చేసింది. అతిపెద్ద విపక్ష నేతను లోక్‌పాల్ ఎంపిక కమిటీలో చేర్చేలా చట్టాన్ని సవరించలేదనే పేరిట.. దేశవ్యాప్త ఆందోళనల నేపథ్యంలో రూపుదాల్చిన లోక్‌పాల్ చట్టాన్ని నిష్ర్పయోజనమైన దానిగా మార్చలేరని ధ్వజమెత్తింది. ప్రతిపక్ష నేత ఎంపిక కమిటీలో ఉండాలని లోక్‌పాల్, లోకాయుక్తల చట్టం చెబుతుండటం, ప్రస్తుత లోక్‌సభలో ప్రతిపక్ష నేత లేని పరిస్థితుల్లో.. కేంద్రం లోక్‌పాల్‌ను నియమించకుండా జాప్యం చేస్తూ వచ్చింది. అయితే అది సడలించదగిన అంశమేనని, అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేతను కమిటీలో చేర్చడం ద్వారా ప్రక్రియను ముందుకు కొనసాగించవచ్చని ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ బుధవారం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన చట్ట సవరణ పార్లమెంటులో పెండింగ్‌లో ఉందని కేంద్రం చెప్పడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. చట్ట సవరణ చేయకపోవడం ద్వారా లోక్‌పాల్ నియామకానికి సంబంధించి ప్రజాభిప్రాయానికి తూట్లు పొడవజాలరని పేర్కొంది.