
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : పెండింగ్ కేసులు పేరుకుపోవడంతో భారత ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జస్టిస్ రంజన్ గగోయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. న్యాయమూర్తులకు పనిదినాల్లో ‘నో లీవ్’ పాలసీని ముందుకుతెచ్చారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈనెల 3న ప్రమాణ స్వీకారం చేసిన రోజే జస్టిస్ గగోయ్ న్యాయమూర్తులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ కోర్టు పెండింగ్ కేసుల క్లియరెన్స్ కోసం పనిదినాల్లో సెలవులు తీసుకోరాదనే విధాన నిర్ణయంపై సంకేతాలు పంపినట్టు సమాచారం.
హైకోర్టుల్లో న్యాయమూర్తులు పనిదినాల్లో సెలవులు తీసుకోకుండా, కోర్టు రూముల్లో విధిగా హాజరుకావాలని జస్టిస్ గగోయ్ విస్పష్టంగా చెప్పినట్టు ఓ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెల్లడించినట్టు హిందుస్తాన్ టైమ్స్ పేర్కొంది. ఇక సుప్రీంలో వివిధ బెంచ్‌లకు కేసుల కేటాయింపు కోసం జస్టిస్ గగోయ్ నూతన రోస్టర్‌ను తీసుకువచ్చారు.
ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను తనతో పాటుగా తన తర్వాత సీనియర్ అయిన మదన్ బీ లోకూర్ నేతృత్వంలోని బెంచ్‌లు విచారణ చేపట్టాలని జస్టిస్ గగోయ్ నిర్ణయించారు. ప్రాధాన్యత, తక్షణ అవసరాలకు అనుగుణంగా కేసుల విచారణకు నూతన ప్రమాణాలను అనుసరించాలని జస్టిస్ గగోయ్ న్యాయవాదులకు సంకేతాలు పంపారు. నిర్ధిష్ట ప్రమాణాలకు అనుగుణంగా లేకుంటే కేసుల తక్షణ విచారణకు ముందుకు రావద్దని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment