జస్టిస్ సుభాష్‌రెడ్డికి ఘన వీడ్కోలు
♦ ఆయన సహకారం మరువలేనిదన్న ఏసీజే
♦ సుభాష్‌రెడ్డి సేవలను కొనియాడిన ఏజీలు
♦ ఘనంగా సన్మానించిన న్యాయవాదుల సంఘం
సాక్షి, హైదరాబాద్: పదోన్నతిపై గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామయ్యగారి సుభాష్‌రెడ్డికి హైకోర్టు బుధవారం ఘనంగా వీడ్కోలు పలికింది. ఇందుకు గాను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే నేతృత్వంలో న్యాయమూర్తులందరూ మొదటి కోర్టు హాలులో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉభయ రాష్ట్రాల అడ్వొకేట్స్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి, పి.వేణుగోపాల్‌లు న్యాయవ్యవస్థకు జస్టిస్ సుభాష్‌రెడ్డి చేసిన సేవలను కొనియాడారు.
అనంతరం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ దిలీప్ బి.బొసాలే మాట్లాడుతూ ఉమ్మడి హైకోర్టు ఓ మంచి న్యాయమూర్తి సేవలను కోల్పోతోందన్నారు. విధి నిర్వహణలో తనకు జస్టిస్ సుభాష్‌రెడ్డి అనేక విధాలుగా సహాయ, సహకారాలు అందించారని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అనేక కీలక కమిటీలకు నేతృత్వం వహించి సమస్యల పరిష్కారానికి ఎంత గానో కృషి చేశారని ప్రశంసించారు. జస్టిస్ సుభాష్‌రెడ్డి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఏసీజే ఆకాంక్షించారు. ఆ తరువాత జస్టిస్ సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ, ఇన్నేళ్ల తన న్యాయ ప్రస్థానంలో తనకు సహకరించిన వారిందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.
విధి నిర్వహణలో తనకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన సహచర న్యాయమూర్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాన న్యాయమూర్తిగా వెళుతున్నందుకు సంతోషంగా ఉన్నా, హైకోర్టును, సహచరులను విడిచి వెళుతున్నందుకు బాధగా ఉందన్నారు. తరువాత హైకోర్టు న్యాయవాదుల సంఘం జస్టిస్ సుభాష్‌రెడ్డి దంపతులను ఘనంగా సత్కరించింది. అలాగే సిటీ సివిల్ కోర్టు న్యాయవాదుల సంఘం కూడా ఆయన్ను సత్కరించింది. కార్యక్రమంలో బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం ఏపీ విభాగం అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు, తెలంగాణ విభాగం అధ్యక్షుడు ఎం.రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.