గుజరాత్ సీజేగా జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్/తెలంగాణ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామయ్యగారి సుభాష్‌రెడ్డిని గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పదోన్నతిపై నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ బుధవారం ప్రకటన విడుదల చేసింది. పదవీబాధ్యతలు చేపట్టిన తేదీ నుంచి ఆయన పదోన్నతి వర్తిస్తుంది. అలహాబాద్ హైకోర్టులోని 12 మంది అదనపు జడ్జీలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించింది. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రేమ్‌శంకర్ భట్‌ను జార్ఖండ్ హైకోర్టుకు, గుజరాత్ హైకోర్టుకు చెందిన మరో న్యాయమూర్తి జస్టిస్ జయంత్ పటేల్‌ను కర్ణాటక హైకోర్టుకు, రాజస్తాన్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధుర్య ను గుజరాత్ హైకోర్టుకు బదిలీ చేసినట్లు వివరించింది.
రాజస్తాన్, పట్నా, గౌహతి, మేఘాలయా, కర్ణాటక హైకోర్టులకు చీఫ్ జస్టిస్‌ల నియామకంపై కొలీజియం చేసిన సిఫార్సులు పరిశీలనలో ఉన్నాయని...వాటిపై త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. న్యాయశాఖ గణాంకాల ప్రకారం...24 హైకోర్టుల్లో 1,044 మంది జడ్జీల ఆమోదిత సంఖ్యకుగాను ఈ ఏడాది జనవరి 1 నాటికి 601 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు. అలాగే సుప్రీంకోర్టులో 31 మంది జడ్జీల ఆమోదిత సంఖ్యకుగాను ప్రస్తుతం 26 మంది జడ్జీలే ఉన్నారు.