Central Justice Department
-
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా జస్టిస్ రావు, జస్టిస్ భట్టి
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తులుగా పదోన్నతి పొందారు. పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మామిడాన సత్యరత్న శ్రీరామచంద్రరావు హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా నియమితులయ్యారు. కేరళ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ సారస వెంకటనారాయణ భట్టి అదే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. కేంద్ర న్యాయ శాఖ ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్లు జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన జస్టిస్ రావు 2021లో జస్టిస్ హిమా కోహ్లీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టుకు కొంతకాలం పాటు తాత్కాలిక సీజేగా సేవలందించారు. జస్టిస్ భట్టి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లె. వీరితో పాటు మరో ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్ విజయ్‌కుమార్ గంగాపూర్వాలా (మద్రాస్ హైకోర్టు), జస్టిస్ రమేశ్ దేవకీనందన్ ధనూకా (బాంబే హైకోర్టు), జస్టిస్ అగస్టీన్ జార్జి మాసి (రాజస్తాన్) కూడా పదోన్నతి పొందారు. జస్టిస్ ధనూకా ఈనెల 30న రిటైరవుతున్నారు. -
సంస్కరణలపై స్పందించండి
న్యూఢిల్లీ: తప్పుడు అఫిడవిట్లు, చెల్లింపు వార్తలను ఎన్నికల నేరాలుగా పరిగణించడం సహా ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన పలు ప్రతిపాదనలను ఎన్నికల సంఘం కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది. ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ అరోరా, కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్ర మంగళవారం లెజిస్లేటివ్ సెక్రటరీ నారాయణరాజుతో భేటీ అయ్యారు. ఓటరు జాబితాతో ఆధార్ నెంబర్‌ను అనుసంధానించే విషయం భేటీలో చర్చకొచ్చింది. ఓటర్లుగా నమోదు చేసుకోవాలనుకునే వారు, ఇప్పటికే ఓటర్లుగా నమోదైనవారు తమ ఆధార్ నెంబర్‌ను అనుసంధానం చేసుకోవాలని కోరేందుకు వీలుగా ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలని కోరుతూ ఇటీవల ఎన్నికల సంఘం కేంద్ర న్యాయ శాఖకు లేఖ రాసింది. అందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన న్యాయశాఖ.. ఆధార్ డేటా భద్రత విషయంలో తమకు హామీ ఇవ్వాలని కోరింది. దీనిపై డేటా భద్రతకు తీసుకోనున్న చర్యలను వివరిస్తూ ఎన్నికల సంఘం సమాధానమిచ్చింది. ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన దాదాపు 40 ప్రతిపాదనలు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న విషయాన్ని న్యాయశాఖ దృష్టికి తీసుకువెళ్లామని ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. కాగా, 20 మంది చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు, పలువురు ఎన్నికల సంఘం అధికారులతో కూడిన 9 బృందాలు తాము రూపొందించిన సంస్కరణల ప్రతిపాదనలను మంగళవారం ఎన్నికల సంఘానికి సమర్పించాయి. ఇటీవలి లోక్‌సభ, ఇతర అసెంబ్లీ ఎన్నికల అనుభవాల ఆధారంగా ఈ సిఫారసులను రూపొందించారు. -
న్యాయం కోసం న్యాయస్థానానికి న్యాయమూర్తి
సాక్షి, హైదరాబాద్: ఆయనో హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి. కక్షిదారులు దాఖలు చేసే వ్యాజ్యాల్లో న్యాయాన్యాయాలపై తీర్పులిస్తుంటారు. అటువంటి న్యాయమూర్తే ఇప్పుడు న్యాయం కోసం ఓ సాధారణ కక్షిదారుగా మారారు. న్యాయం చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. తన పుట్టిన తేదీని సరిదిద్దే విషయంలో చర్యలు తీసుకోవాలంటూ తాను పెట్టుకున్న వినతులపై స్పందించడం లేదంటూ అటు రాష్ట్రపతి కార్యాలయంపై, ఇటు కేంద్ర న్యాయశాఖపైనే పిటిషన్ దాఖలు చేశారు. ఆయనే ఇటీవల సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన న్యాయమూర్తి జస్టిస్ బులుసు శివశంకరరావు. నేను వాస్తవంగా పుట్టింది 29.3.1959 కాగా.. రికార్డుల్లో అది 10.4.1957గా నమోదైంది. ఈ తప్పును సరిదిద్దాలని కోరుతూ గత 2 దశాబ్దాలుగా అధికారులకు విజ్ఞప్తి చేస్తూ వచ్చాను. 1996 నుంచి అనేక వినతిపత్రాలు ఇచ్చాను. హైకోర్టు జడ్జి అయిన తర్వాత హైకోర్టు ద్వారా కూడా వినతిపత్రాలు పంపాను. అయితే ఇప్పటివరకు నా పుట్టిన తేదీని సరిచేసే విషయంలో చర్యలు తీసుకోలేదు. రాష్ట్రపతి సెక్రటేరియట్‌కు సైతం వినతిపత్రం పంపాను. అయినా నా పుట్టిన తేదీని సరిచేయలేదు. ఎన్ని వినతిపత్రాలు పెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో విధి లేక ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేస్తున్నాను. అందువల్ల నేను పెట్టుకున్న వినతిపత్రాలపై తగిన నిర్ణయం తీసుకునేలా ప్రతివాదులను ఆదేశించండి.’అని న్యాయమూర్తి తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇందులో రాష్ట్రపతి కార్యాలయ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు. -
ఈ ఏడాది ఏడుగురు సుప్రీం జడ్జీలు రిటైర్!
న్యూఢిల్లీ: రానున్న 10 నెలల కాలంలో మొత్తం ఏడుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పదవీవిరమణ చేయనున్నట్లు కేంద్ర న్యాయశాఖ, సుప్రీంకోర్టులు వెల్లడించాయి. ఇప్పటికే ఆరు న్యాయమూర్తుల పోస్టులు ఖాళీ ఉండటంతో పాటు మరో ఏడుగురు జడ్జీలు రిటైర్ కానున్న నేపథ్యంలో కోర్టుపై ఒత్తిడి పడనుంది. మార్చి 1న రిటైర్ కావాల్సిన జస్టిస్ రాయ్ కోర్టు సెలవుల కారణంగా శుక్రవారమే తన ఆఖరి పనిదినాన్ని పూర్తి చేశారు. మిగిలిన న్యాయమూర్తుల్లో జస్టిస్ రాజేష్ అగర్వాల్ మే 4న, సీనియర్ జడ్జి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ జూన్ 22న, జస్టిస్ ఆదర్శ్ గోయల్ జూలై 6న రిటైర్‌కానున్నారు. సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ మిశ్రా అక్టోబర్ 2న బాధ్యతల నుంచి తప్పుకోనుండగా, జస్టిస్ కురియన్ జోసెఫ్ నవంబర్ 29న, జస్టిస్ మదన్ బి.లోకూర్ డిసెంబర్ 30న రిటైర్ కానున్నారు. -
ఉమ్మడి హైకోర్టుకు ఆరుగురు న్యాయమూర్తులు
రాష్ట్రపతి ఉత్తర్వులు.. కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ - 21 లేదా 22న ప్రమాణం... 33కి చేరనున్న న్యాయమూర్తులు - హైకోర్టు న్యాయమూర్తిగా తొలిసారి జిల్లా కోర్టు న్యాయవాది సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులుగా దూర్వాసుల వేంకట సూర్యనారాయణ సుబ్రహ్మణ్య (డీవీవీఎస్) సోమయాజులు, కొంగర విజయలక్ష్మి, పోట్లపల్లి కేశవరావు, మంతోజ్ గంగారావు, అభినంద్‌కుమార్ షావిలి, తొడుపునూరి అమర్నాథ్గౌడ్ నియమితులయ్యారు. వారి నియామకపు ఫైలుపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం సంతకం చేశారు. అనంతరం వారి నియామకాలను నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. వీరిలో సోమయాజులు విశాఖపట్నం జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేస్తుండగా, మిగతా ఐదుగురు ఉమ్మడి హైకోర్టు న్యాయవాదులు. ఓ జిల్లా కోర్టు న్యాయవాది హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులవడం మన హైకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి. ఈ నియామకాలతో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది. అయితే న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ఈ నెల 22న, మరో న్యాయమూర్తి జస్టిస్ అనీస్ అక్టోబర్ 20న పదవీ విరమణ చేయనున్నారు. హైకోర్టులో ఇంకా 28 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నూతన న్యాయమూర్తులు ఈ నెల 21 లేదా 22న ప్రమాణం చేసే అవకాశముంది. దూర్వాసుల వేంకట సూర్యనారాయణ సుబ్రహ్మణ్య సోమయాజులు 1961 సెప్టెంబర్ 26న జన్మించారు. 1985లో న్యాయవాదిగా నమోదయ్యారు. పలు బ్యాంకులకు న్యాయ సలహాదారుగా ఉన్నారు. విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షునిగా చేశారు. ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, బీసీసీఐ లీగల్ కమిటీ సభ్యునిగా, ఆంధ్రా యూనివర్సిటీ సెనేట్ సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తించారు. పలు ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయ సలహాదారుగా ఉన్నారు. సతీమణి శ్రావణి సైకాలజిస్టు. సోమయాజులు తండ్రి డీవీ సుబ్బారావు కూడా న్యాయవాదే. ఆయన విశాఖ మేయర్‌గా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా పని చేశారు. మంతోజ్ గంగారావు అనంతపురం జిల్లా గుంతకల్‌లో జన్మించారు. హైదరాబాద్ పీజీ కాలేజీలో ఎంకామ్, ఉస్మానియాలో ఎల్ఎల్బీ చేశారు. 1988లో న్యాయవాదిగా నమోదయ్యారు. దివంగత న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ఏ స్వామి వద్ద జూనియర్‌గా వృత్తి జీవితం ప్రారంభించారు. 1995–96 మధ్య, ఆ తర్వాత మరో రెండుసార్లు ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా చేశారు. 2006–2010 మధ్య ఏపీఎస్ఎఫ్సీ స్టాండింగ్ కౌన్సి ల్గా చేశారు. 2010లో ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు. కొంగర విజయలక్ష్మి 1960 సెప్టెంబర్ 20న జన్మించారు. హైదరాబాద్‌లో సైఫాబాద్ హోలీ మేరీ హైస్కూల్లో టెన్త్, నాంపల్లి వనితా మహిళా కాలేజీలో ఇంటర్, ఆర్బీవీఆర్ రెడ్డి కాలేజీలో బీకాం చేశారు. ఏలూరు సీఆర్ రెడ్డి లా కాలేజీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేసి ఆంధ్రా వర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ పొందారు. ఉస్మానియాలో ఎల్ఎల్ఎం చేశారు. 1985లో న్యాయవాదిగా నమోదయ్యారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎస్.పర్వతరావు వద్ద జూనియర్‌గా వృత్తి జీవితం ప్రారంభించారు. 1991–95 మధ్య ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా పనిచేశారు. 1996లో ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు. సివిల్, క్రిమినల్, ట్యాక్స్ కేసుల్లో మంచి పేరు సంపాదించారు. అభినంద్ కుమార్ షావిలి 1963 అక్టోబర్ 8న జన్మించారు. హైదరాబాద్ అబిడ్స్ సెయింట్ జాన్స్ హైస్కూల్లో టెన్త్, నృపతుంగ జూనియర్ కాలేజీలో ఇంటర్, నిజాం కాలేజీలో బీఎస్సీ చదివారు. ఉస్మానియా నుంచి ఎల్ఎల్బీ చేశారు. 1989లో న్యాయవాదిగా నమోదయ్యారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు వద్ద వృత్తి జీవితం ప్రారంభించారు. రాజ్యాంగ, సివిల్ కేసుల్లో మంచి పేరు సాధించారు. హైకోర్టుతో పాటు కేంద్ర, రాష్ట్ర పరిపాలన ట్రిబ్యునళ్లలో కేసులు వాదించారు. పోట్లపల్లి కేశవరావు వరంగల్ జిల్లాలో 1961 మార్చి 29న జన్మించారు. హన్మకొండ మర్కాజీ హైస్కూల్లో టెన్త్, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్, డిగ్రీ కాలేజీలో బీకాం చదివారు. యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లా నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1986లో న్యాయవాదిగా నమోదయ్యారు. వరంగల్‌లో ప్రముఖ న్యాయవాది పి.సాంబశివరావు వద్ద వృత్తి జీవితం ప్రారంభించారు. హైదరాబాద్‌కు ప్రాక్టీస్ మార్చి ఎం.వి.రమణారెడ్డి వద్ద జూనియర్‌గా చేశారు. సివిల్, కంపెనీ, క్రిమినల్, ఎన్నికలు, సర్వీసు అంశాల్లో పట్టు సాధించారు. ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు. 2010 నుంచి 2016 వరకు సీబీఐ స్పెషల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్‌గా చేశారు. తొడుపునూరి అమర్నాథ్గౌడ్ 1965 మార్చి 1న హైదరాబాద్‌లో జన్మించారు. సికింద్రాబాద్ సెయింట్ ప్యాట్రిక్స్ హైస్కూల్లో టెన్త్, వెస్లీ జూనియర్ కాలేజీలో ఇంటర్, బేగంపేట ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ నుంచి బీఎస్సీ, మహారాష్ట్రలోని శివాజీ లా కాలేజీలో ఎల్ఎల్బీ చేశారు. 1990లో న్యాయవాదిగా నమోదయ్యారు. విశ్రాంత న్యాయ మూర్తి జస్టిస్ వంగా ఈశ్వరయ్య వద్ద వృత్తి జీవి తం ప్రారంభించారు. ఎక్సైజ్, కార్పొరేషన్, కార్మిక కేసులను పెద్ద సంఖ్యలో వాదించారు. నల్లగొండ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్‌కు స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. -
అసెంబ్లీ సీట్లు పెంచాల్సిందే
తెలుగుదేశం పార్టీ లాబీయింగ్ సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు కోసం తెలుగుదేశం పార్టీ లాబీయింగ్ ముమ్మరం చేస్తోంది. పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచేందుకు వీలుగా చట్ట సవరణ చేయాలని పట్టుబడుతోంది. అయితే, కేవలం పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని సవరిస్తే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ సాధ్యం కాదని, ఇందుకోసం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని సవరించాల్సి ఉంటుందని భారత అటార్నీ జనరల్, కేంద్ర న్యాయ శాఖ ఇప్పటికే తేల్చిచెప్పాయి. ఈ నేపథ్యంలో కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి నేతృత్వంలోని బృందం హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను గురువారం కలవనుందని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా పాల్గొంటారని సమాచారం. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26ను సవరించడం ద్వారా అసెంబ్లీ సీట్ల పెంపునకు వీలుగా ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు తేవాలని టీడీపీ కోరుతోంది. అలా వీలుకాని పక్షంలో పార్లమెంట్ సమావేశాలు ముగిసిన అనంతరం ఆర్డినెన్స్ ద్వారానైనా పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించాలని కేంద్రంపై ఒత్తిడి పెంచుతోంది. కానీ, ఇది సాధ్యపడదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు టీడీపీ వర్గాలకు స్పష్టం చేసినట్లు సమాచారం. -
‘సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి కాదు’
న్యూఢిల్లీ: ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను పొందేందుకు ఆధార్ కార్డు కలిగి ఉండటం తప్పనిసరి కాదనీ, ప్రభుత్వాలు జారీ చేసిన ఇతర ఏ గుర్తింపు కార్డు ఉన్నా చాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం చెప్పారు. ఇదే విషయాన్ని సోమవారమే సుప్రీం కోర్టు కూడా స్పష్టం చేయడం తెలిసిందే. ‘ఆధార్ తప్పనిసరేం కాదు. ఆధార్ లేనంత మాత్రాన ఏ వ్యక్తికీ సంక్షేమ ఫలాలను నిరాకరించలేం’అని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. 1 నుంచి నీతి ఆయోగ్ త్రైవార్షిక ప్రణాళిక నీతి ఆయోగ్ కొత్తగా తీసుకురానున్న మూడేళ్ల కార్యాచరణ ప్రణాళికను ఏప్రిల్ 1 నుంచి అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరో రెండు రోజుల్లో (మార్చి 31తో) 12వ పంచవర్ష ప్రణాళిక ముగుస్తుండటంతో ఏప్రిల్ 1 నుంచే కొత్త ప్రణాళికను అమలు చేయనున్నారు. -
ముదురుతున్న ‘న్యాయ’ వివాదం
-
ముదురుతున్న ‘న్యాయ’ వివాదం
హైకోర్టు జడ్జీల నియామక జాప్యంపై సుప్రీం చీఫ్ జస్టిస్ అసంతృప్తి - ట్రిబ్యునళ్లలో సిబ్బంది, మౌలిక వసతుల లేమి వేధిస్తోందని ఆవేదన - సీజేఐ అభిప్రాయంతో విభేదించిన కేంద్ర మంత్రి రవిశంకర్ - ఈ ఏడాది పెద్ద సంఖ్యలో ఖాళీలు భర్తీ చేసినట్లు వెల్లడి న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామక అంశంపై న్యాయవ్యవస్థ, కేంద్రప్రభుత్వం మధ్య వివాదం ముదురుతోంది. జడ్జీల నియామకంలో జరుగుతున్న జాప్యంపై భారత ప్రధాన న్యాయమూర్తి(సీఐజే) జస్టిస్ టీఎస్ ఠాకూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారమిక్కడ జరిగిన జాతీయ రాజ్యాంగ దినోత్సవ’ సదస్సులో జస్టిస్ ఠాకూర్ మాట్లాడారు. ‘ప్రస్తుతం హైకోర్టుల్లో 500 జడ్జీల పోస్టులు ఖాళీగా ఉన్నారుు. ఇప్పటికే ఆ నియామకాలు పూర్తి కావాల్సి ఉంది. కానీ వాటిపై ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదు. దేశంలో న్యాయమూర్తులు లేని కోర్టులు అనేకం ఉన్నారుు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నారుు. ఈ సంక్షోభాన్ని త్వరలోనే కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆశిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. కాగా, సీఐజే అభిప్రాయంతో కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ విభేదించారు. హైకోర్టుల్లో నియామకాల భర్తీకి కేంద్రం కృషి చేస్తోందని చెప్పారు. ఈ ఏడాది 120 ఖాళీలను భర్తీ చేసినట్లు తెలిపారు. 1990 తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో నియామకాలు జరపడం ఇది రెండోసారి అని చెప్పారు. మౌలిక సౌకర్యాల కల్పన అనేది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నా రు. నియామకాలను పారదర్శకంగా జరి పేందుకు సంబంధించిన మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్(ఎంవోపీ)పై సుప్రీంకోర్టు తీర్పు వెలువడాల్సి ఉందని, దీని కోసం మూడు నెలలకు పైగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. కింది స్థారుు కోర్టుల్లో 5 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేసే బాధ్యత కేంద్రం చేతుల్లో లేదన్నారు. న్యాయమూర్తులు ముందుకు రావడం లేదు.. సదస్సులో సీజేఐ జస్టిస్ ఠాకూర్ మాట్లాడుతూ.. ట్రిబ్యునళ్లలో సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాల లేమి వల్ల కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రిబ్యునళ్లలో ఎటువంటి వసతులు లేకపోవడంతో వీటికి నేతృత్వం వహించేందుకు రిటైర్డ్ న్యాయమూర్తులు ముందుకు రావడం లేదన్నారు. కనీస వసతులు లేని చోటకు పంపడం ద్వారా వారిని ఇబ్బంది పెట్టడం తనకు బాధ కలిగించే అంశమని పేర్కొన్నారు. తగిన సంఖ్యలో న్యాయమూర్తులు లేకుండా ట్రిబ్యునళ్లు గానీ, బెంచ్‌లు గానీ ఎలా ఏర్పాటు చేయగలమని ప్రశ్నించారు. ప్రభుత్వం కనీసం ఈ ట్రిబ్యునళ్లనైనా పూర్తి స్థారుులో బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. వివిధ ట్రిబ్యునళ్లలో చైర్పర్సన్లు, సభ్యుల నియామకాలకు సంబంధించి నిబంధనల్లో పలు సవరణలు చేయాల్సిన అవసరముందన్నారు. తద్వారా ఆయా పోస్టులకు హైకోర్టు జడ్జీలు కూడా అర్హులవుతారని పేర్కొన్నారు. సమావేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణ రేఖను దాటొద్దు: సీజేఐ ప్రభుత్వ విభాగాలు తమ పరిధి దాటి ప్రవర్తించవద్దని.. ‘లక్ష్మణరేఖ’ను దాటవద్దని సీజేఐ జస్టిస్ టీఎస్ ఠాకూర్ పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ... పార్లమెంట్ తీసుకున్న ఏ నిర్ణయమైనా అసంబద్ధంగా ఉందనిపిస్తే దాన్ని పక్కన పెట్టే అధికారం న్యాయవ్యవస్థకు ఉందన్నారు. చట్ట, రాజ్యాంగ బద్ధంగా లేకపోతే చట్టసభలు తీసుకున్న నిర్ణయంలో కోర్టులు జోక్యం చేసుకోవాల్సి వస్తుందన్నారు. శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల విధులు, బాధ్యతలను రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారని చెప్పారు. పార్లమెంట్‌కు చట్టాలు చేసే హక్కు ఉన్నా... అది రాజ్యాంగానికి లోబడే ఉండాలని సూచించారు. ఏదైనా నిర్ణయంతో పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతుందని భావిస్తే... తప్పు అని ప్రభుత్వానికి చెప్పే హక్కు న్యాయవ్యవస్థకు ఉందన్నారు. నవంబర్ 26ను న్యాయ దినోత్సవంగా కంటే రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం మంచి పరిణామమని జస్టిస్ ఠాకూర్ పేర్కొన్నారు. -
‘తలాక్’కు వ్యతిరేకం
సుప్రీంకోర్టులో వాదనలు వినిపించనున్న ప్రభుత్వం న్యూఢిల్లీ: మూడుసార్లు ‘తలాక్’ చెప్పి ముస్లిం మహిళలకు విడాకులిచ్చే ఆచారాన్ని వ్యతిరే కించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళల హక్కులకు భంగ ం వాటిల్లే ఈ ఆచారానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించనుంది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు సమాచారం అందించాయి. ఈ నెలాఖరుకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి ఈ అంశంపై సుప్రీంకోర్టులో నివేదిక అందజేయనున్నారు. మూడు సార్లు తలాక్ చెప్పడమనే ఆచారం ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో కూడా లేదని, మనకే ఉందని ప్రభుత్వ సీనియర్ అధికారి పేర్కొన్నారు. హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్, స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మనేకా గాంధీ కిందటి వారం సమావేశమై మూడు సార్లు తలాక్ చెప్పడం తదితర ముస్లిం పద్ధతులు.. సుప్రీంకోర్టుకు ఇవ్వాల్సిన సమాధానంపై చర్చించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. -
1969 చట్టంతో ఎన్నారై పెళ్లి మోసాలకు చెక్
న్యూఢిల్లీ : ఎన్నారై వివాహాల్లో మోసపోయిన మహిళలకు విదేశీ వివాహ చట్టం 1969 అండగా ఉంటుందని పార్లమెంటరీ కమిటీకి కేంద్ర న్యాయ శాఖ తెలిపింది. ఎన్నారై పెళ్లిళ్ల మోసాలపై ఏర్పాటైన రాజ్యసభ కమిటీ... హోంశాఖ ఉన్నతాధికారుల్ని, న్యాయ శాఖ అధికారుల్ని కలిసి సమస్య పరిష్కారాలపై చర్చించింది. ఈ చట్టం గురించి చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల సద్వినియోగం కావడం లేదని కమిటీ సభ్యుడొకరు చెప్పారు. ఎన్ఆర్ఐ భర్తలు భార్యల్ని వదిలేసిన కేసుల్ని పరిష్కరించేందుకు కేంద్రం కూడా కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. -
హైకోర్టు విభజనపై మళ్లీ కదలిక
- ఏడాది తర్వాత విచారణకు వచ్చిన తెలంగాణ పిటిషన్ - ఏపీ ఏజీ లేకపోవడంతో విచారణ 21కి వాయిదా - నిధుల కేటాయింపులపై పూర్తి వివరాలు సమర్పించండి - కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టును విభజించాలంటూ ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై మళ్లీ కదలిక మొదలైంది. ఏడాది కాలంగా విచారణకు నోచుకోని పునఃసమీక్ష పిటిషన్లపై ఎట్టకేలకు మళ్లీ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. హైకోర్టు విభజనపై గతేడాది మే 1న అప్పటి ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పు ను పునఃసమీక్షించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, న్యాయవాది కె.రవీందర్‌రెడ్డి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై విచారణ ఈ నెల 21కి వాయిదా పడింది. శుక్రవారం జరిగిన విచారణకు ఏపీ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ అందుబాటులో లేకపోవడంతో హైకోర్టు ఈ వ్యా జ్యాలపై విచారణను వా యిదా వేసింది. ఈ మేర కు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ నాటి కి ఈవ్యవహారంలో పూర్తి వివరాలను కోర్టు ముం దుంచాలని కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజన్‌కు స్పష్టం చేసింది. గత తీర్పులో ఏం చెప్పారు? హైకోర్టు విభజనలో జాప్యం జరుగుతోందంటూ హైదరాబాద్‌కు చెందిన ధనగోపాల్‌రావు అనే వ్యక్తి హైకోర్టులో గతంలో ప్రజా ప్రయోజన వ్యా జ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ పిల్ విచారణ సమయంలో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు విభజన కోసం కొన్ని ప్రతిపాదనలను ధర్మాసనం ముందుంచింది. ప్రస్తుత హైకోర్టును ఏపీకి వది లేసి, తెలంగాణ హైకోర్టును మరోచోట ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. వాదనలను విన్న అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం గతేడాది మే 1న తీర్పు వెలువరించింది. ఏపీ హైకోర్టు ఏపీ భూభాగంలోనే ఉండాలని చెప్పింది. ఏపీ హైకోర్టును తెలంగాణలో ఏర్పా టు చేసేందుకు చట్టం అనుమతించడం లేదని పేర్కొంది. ఏపీ హైకోర్టు ఏర్పాటుకు కొంత సమయం పట్టినా అది శాశ్వత ప్రతిపాదకనే ఉండాలని తీర్పులో పేర్కొంది. తీర్పులో తప్పిదాలున్నాయన్న తెలంగాణ అయితే ఈ తీర్పులో కొన్ని తప్పిదాలు చోటు చేసుకున్నాయని, ఆ తీర్పును పునఃసమీక్ష చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గతేడాది జూలైలో అనుబంధ పిటిషన్ వేశారు. తీర్పు పునర్విభజన చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ న్యాయవాది రవీందర్‌రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 31(2) ప్రకారం ఏపీ హైకోర్టు ప్రధాన కేంద్రం ఎక్కడ ఉండాలన్న దాన్ని రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా నిర్ణయిస్తారని, అయితే ఈ సెక్షన్ ఓ నిర్దిష్ట ప్రదేశంలోనే ఉండాలని చెప్పడం లేదని, ఈ విషయంలో రాష్ట్రపతి అధికారాలను ఆ సెక్షన్ నియంత్రించడం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తన పిటిషన్లో పేర్కొన్నారు. ధర్మాసనం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా తప్పు చేసిందన్నారు. కేంద్రం, ఏపీకి గతంలోనే నోటీసులు ఈ వ్యాజ్యాలపై గత ఏడాది జూలై 31న హైకోర్టు విచారణ జరిపింది. ఇందులో ప్రతి వాదులుగా ఉన్న కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పలువురు న్యాయవాదులకు నోటీసులు జారీ చేసిం ది. అప్పటి నుంచి ఆ వ్యాజ్యాలు విచారణకు నోచుకోలేదు. శుక్రవారం ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా.. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది డి.రమేశ్ స్పందిస్తూ ఈ కేసులో అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హాజరవుతారని తెలిపారు. ఆయన కృష్ణా ట్రిబ్యునల్ ముందు వాదనలు విని పించేందుకు వెళ్లారని, ఈ నెల 14, 15 తేదీల్లో కూడా అందుబాటులో ఉండరని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అందువల్ల అనుబంధ పిటిషన్లపై విచారణను వాయిదా వేయాలని కోరారు. ఈ సమయంలో రవీందర్‌రెడ్డి తరఫు న్యాయవాది గండ్ర మోహనరావు స్పందిస్తూ పార్లమెంట్ సమావేశాలకు ముందే వీటిపై విచారణ పూర్తి చేయాలని కోరగా దీనికి ధర్మాసనం నిరాకరించింది. విచారణను తొలుత ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది. అయితే అదనపు సొలిసిటర్ జనరల్ అభ్యర్థన మేరకు 21కి మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
నియోజక వర్గాల పెంపు 2026 తర్వాతే
పదేళ్ల తర్వాతే డీలిమిటేషన్.. ♦ తెలుగు రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటుకు అప్పటివరకు ఆగాల్సిందే ♦ పలుమార్లు స్పష్టం చేసిన కేంద్ర న్యాయశాఖ ♦ టీడీపీ లోక్‌సభ పక్షనేత ప్రశ్నకు మంత్రి సదానంద స్పష్టీకరణ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శాసన సభ స్థానాల పెంపు ఉంటుందంటూ విస్తృతంగా ప్రచారం చేస్తూ అధికార పార్టీలు పార్టీ ఫిరాయింపులను యథేచ్ఛగా ప్రోత్సహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2026 వరకూ నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశమే లేదంటూ కేంద్ర ప్రభుత్వం ఒకటికి, నాలుగుసార్లు స్పష్టంచేసినప్పటికీ మంత్రులు, ముఖ్యమంత్రులు భిన్నంగా ప్రచారం చేయడంపై పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేందుకే ఈ ప్రచారం తప్ప డీలిమిటేషన్ సాధ్యం కాదంటూ స్పష్టంచేస్తున్నారు. గతంలో నియోజకవర్గాల పునర్విభజన కోసం జార్ఖండ్, తదితర రాష్ట్రాల్లో కూడా గట్టిగా డిమాండ్లు తలెత్తినా ఇది సాధ్యపడలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ నియోజకవర్గాల పునర్విభజనపై ఏమంటుందో తేటతెల్లం చేసే రెండు ఉదంతాలను కేంద్ర న్యాయశాఖ వర్గాలు ఉటంకిస్తున్నాయి. సాక్షాత్తూ టీడీపీ లోక్‌సభ పక్ష నేత తోట నర్సింహం, టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత ఎ.పి.జితేందర్‌రెడ్డిలకు ఇచ్చిన సమాధానాల్లోనే ఈ విషయం స్పష్టంగా ఉందని చెబుతున్నాయి. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఈ అంశంపై నాలుగుసార్లు స్పష్టతనిచ్చిందని నిపుణులు చెబుతున్నారు. యూపీఏ హయాంలో జార్ఖండ్‌లో నియోజకవర్గాలను పెంచాలని ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదని గుర్తుచేస్తున్నారు. 2026 తరువాత తొలి జనాభా లెక్కలు ప్రచురించేంతవరకు పార్లమెంటు నియోజకవర్గాలు గానీ, అసెంబ్లీ నియోజకవర్గాలు గానీ పునర్విభజన చేపట్టే అవకాశం లేదని రాజ్యాంగ నిపుణులతోపాటు, కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా స్పష్టంచేస్తున్నారు. డీలిమిటేషన్‌పై కేంద్ర న్యాయశాఖ, హోంశాఖలు స్పష్టతనిచ్చిన ఉదాహరణలిలా ఉన్నాయి. 2026 తర్వాతేనన్న న్యాయశాఖ మంత్రి ‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు కోసం నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ప్రతిపాదించిందా? అలా చేస్తే ఆ వివరాలు ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏవైనా ఈవిషయంలో ప్రతిపాదనలు పంపాయా? పంపితే వివరాలు ఇవ్వండి. ప్రస్తుత పరిస్థితి ఏంటి?’ అని గత ఏడాది బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ లోక్‌సభ పక్ష నేత తోట నర్సింహం లోక్‌సభలో లిఖితపూర్వకంగా ప్రశ్నించారు. దీనికి న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడకు సమాధానమిస్తూ... ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 26 ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శాసన సభ స్థానాల పెంపు అనేది భారత రాజ్యాంగంలోని 170వ అధికరణకు లోబడి ఉంది. 2026 తరువాత వచ్చే మొదటి జనాభా లెక్కల ఆధారంగానే అసెంబ్లీ స్థానాల సర్దుబాటు ఉండాలని ఈ అధికరణ సూచిస్తోంది..’ అని స్పష్టంచేశారు. 2014లోనూ అదే సమాధానం... జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ రవీంద్ర కుమార్ పాండే 2014 ఆగస్టు 11న ఇదే తరహా ప్రశ్న సంధించారు. ‘జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాలు సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను కేంద్రం ప్రతిపాదించిందా? అలా అయితే ఎక్కడెక్కడ చేస్తున్నారు? ఆ వివరాలు ఇవ్వండి? ఒకవేళ లేనిపక్షంలో ఎందుకు లేదో చెప్పండి?’ అంటూ లోక్‌సభలో లిఖితపూర్వక ప్రశ్నలు సంధించారు. ‘భారత రాజ్యాంగంలోని 82, 170 అధికరణల ప్రకారం 2026 తరువాత తొలి జనాభా లెక్కలు ప్రచురించేంతవరకు పార్లమెంటు నియోజకవరా్గాలు గానీ, అసెంబ్లీ నియోజకవర్గాలు గానీ పునర్విభజన చేపట్టే అవకాశం లేదు. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం వద్ద ఎలాంటి ప్రతిపాదన కూడా పరిశీలన లో లేదు..’ అని అప్పటి న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టతనిచ్చారు. హోం శాఖదీ అదే మాట ‘ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన మేరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం ఏదైనా ప్రతిపాదించింది? ఈ విషయంలో ఏదైనా ప్రక్రియ ప్రారంభమైందా? చట్ట సవరణపై ఏదైనా సలహా తీసుకుందా? అలాంటిదేదైనా ఉంటే వివరాలు ఇవ్వండి. పునర్విభజనలో జాప్యానికి గల కారణాలు తెలియజేయండి..’ అని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత ఎ.పి.జితేందర్‌రెడ్డి, ఎంపీలు బి.వినోద్‌కుమార్, బూర నర్సయ్య గౌడ్ ఇదే అంశంపై 2015 ఏప్రిల్ 21వ తేదీన కేంద్ర హోం శాఖను లోక్‌సభలో ప్రశ్నలు సంధించారు. దీనికి హోం శాఖ సహాయ మంత్రి హరీభాయ్ పార్తీభాయ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-26 ప్రకారం ఆంధ్రప్రదేశ్ సీట్లను 175 నుంచి 225కు, తెలంగాణలో సీట్లను 119 నుంచి 153కు పెంచాలి. కానీ ఇది రాజ్యాంగంలోని 170వ అధికరణకు లోబడి జరగాలి. అయితే 2026 తరువాత వచ్చే తొలి జనాభాలెక్కల ప్రచురణ వరకు నియోజకవర్గాల పునర్విభజన సాధ్యం కాదని ఈ అధికరణ చెబుతోంది..’ అని స్పష్టం చేశారు. రెండోసారి స్పష్టం చేసిన హోం శాఖ టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ 2015 డిసెంబర్ ఎనిమిదో తేదీన అంటే దాదాపు నాలుగు నెలల కిందట... సెక్షన్-26 అమలుకు తీసుకున్న చర్యలేవని లోక్‌సభలో ఒక లిఖితపూర్వక ప్రశ్నను సంధించారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎస్సీ, ఎస్టీ స్థానాల రిజర్వేషన్లపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలేవో చెప్పాలని అడిగారు. ‘నియోజకవర్గాల పునర్విభజన ఆర్టికల్-170కి లోబడి ఉంది. ఆర్టికల్ 170(3) ప్రకారం 2026 తరువాత తొలి జనాభా గణన.. ప్రతి నియోజకవర్గంలో జనాభా సమీక్షకు ఒక ప్రాతిపదిక ఇస్తుంది. అందువల్ల ఎస్సీ, ఎస్టీ సీట్ల సర్దుబాటు కూడా తదుపరి డీలిమిటేషన్‌లోనే ఉంటుంది..’ అని కేంద్రహోం శాఖ సహాయ మంత్రి హరీభాయ్ పార్తీభాయ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఎన్నికల సంఘం ఏమంటోంది? ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-26 ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపుపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని ‘సాక్షి’ సంప్రదించింది. కేంద్ర ఎన్నికల సంఘం న్యాయసలహాదారుగా దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఎస్.కె.మెండిరెట్ట దీనిపై స్పందిస్తూ ‘రాజ్యాంగం ప్రకారం 2026 వరకు నియోజకవర్గాల పునర్విభజనను తిరిగి తెరవరాదన్న అభిప్రాయానికి వచ్చిన హోం శాఖ, న్యాయ శాఖ.. ఇదే అభిప్రాయాన్ని ఎన్నికల సంఘానికి సూచించాయి. ఒకవేళ తమ అభిప్రాయాన్ని మార్చుకోదలిస్తే.. రాజ్యాంగానికి లోబడే చేయాలి..’ అని పేర్కొన్నారు. అందుకు రాజ్యాంగ సవరణ అవసరమని స్పష్టం చేశారు. -
హైకోర్టు విభజనకు కేంద్రం సిద్ధం
కేంద్రమంత్రి దత్తాత్రేయ సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి హైకోర్టు విభజనకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖా మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. మంగళవారం ఆయన ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలసి కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడను కలిశారు. ఈ సమావేశం అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ ైహైకోర్టు విభజనపై చర్చించినట్టు పేర్కొన్నారు. ప్రత్యేక హైకోర్టు కోసం తెలంగాణలో న్యాయవాదులు చేస్తున్న ఆందోళనను న్యాయశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లానని, త్వరిత గతిన విభజన ప్రక్రియ పూర్తిచేయాలని కోరామన్నారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని దత్తాత్రేయ తెలిపారు. -
గుజరాత్ సీజేగా జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్/తెలంగాణ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామయ్యగారి సుభాష్‌రెడ్డిని గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పదోన్నతిపై నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ బుధవారం ప్రకటన విడుదల చేసింది. పదవీబాధ్యతలు చేపట్టిన తేదీ నుంచి ఆయన పదోన్నతి వర్తిస్తుంది. అలహాబాద్ హైకోర్టులోని 12 మంది అదనపు జడ్జీలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించింది. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రేమ్‌శంకర్ భట్‌ను జార్ఖండ్ హైకోర్టుకు, గుజరాత్ హైకోర్టుకు చెందిన మరో న్యాయమూర్తి జస్టిస్ జయంత్ పటేల్‌ను కర్ణాటక హైకోర్టుకు, రాజస్తాన్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధుర్య ను గుజరాత్ హైకోర్టుకు బదిలీ చేసినట్లు వివరించింది. రాజస్తాన్, పట్నా, గౌహతి, మేఘాలయా, కర్ణాటక హైకోర్టులకు చీఫ్ జస్టిస్‌ల నియామకంపై కొలీజియం చేసిన సిఫార్సులు పరిశీలనలో ఉన్నాయని...వాటిపై త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. న్యాయశాఖ గణాంకాల ప్రకారం...24 హైకోర్టుల్లో 1,044 మంది జడ్జీల ఆమోదిత సంఖ్యకుగాను ఈ ఏడాది జనవరి 1 నాటికి 601 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు. అలాగే సుప్రీంకోర్టులో 31 మంది జడ్జీల ఆమోదిత సంఖ్యకుగాను ప్రస్తుతం 26 మంది జడ్జీలే ఉన్నారు. -
అమరులకు సలాం..!
అంబాలా/బెంగళూరు: పఠాన్‌కోట్‌లో పాక్ ముష్కరులతో పోరాడి అమరులైన జవాన్లకు జనం కన్నీటి వీడ్కోలు పలికారు. సైనిక లాంఛనాల మధ్య వారికి అంత్యక్రియలు నిర్వహించారు. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు వదిలిన గరుడ్ కమాండో గురుసేవక్ సింగ్ భౌతిక కాయాన్ని సోమవారం ఆయన సొంతూరు హర్యానాలోని అంబాలా సమీపంలోని గర్నాలాకు తీసుకువచ్చారు. పార్థివ దేహాన్ని చూడగానే కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. గురుసేవక్కు నవంబర్లోనే వివాహమైంది. ఆయన అంత్యక్రియల్లో హర్యానా మంత్రులు అనిల్ విజ్, అభిమన్యులతోపాటు ఆర్మీ, పోలీసు, వైమానిక దళాధికారులు పాల్గొన్నారు. ► పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదుల గ్రెనేడ్‌ను నిర్వీర్వం చేస్తుండగా అది పేలడంతో ప్రాణాలు కోల్పోయిన లెఫ్టినెంట్ కల్నల్ ఇ.కె. నిరంజన్ భౌతికకాయాన్ని బెంగళూరులోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ సందర్శించి నివాళులర్పించారు. నిరంజన్ కుటుంబానికి సీఎం రూ.30 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. తర్వాత నిరంజన్ పార్థివదేహాన్ని ఆయన స్వస్థలమైన కేరళలోని పాలక్కడ్‌కు తరలించారు. ‘నా కొడుకు త్యాగానికి నేను గర్విస్తున్నా..’ అని చెమర్చిన కళ్లతో నిరంజన్ తండ్రి శివరంజన్ చెప్పారు. 32 ఏళ్ల నిరంజన్‌కు భార్య, 18 నెలల కూతురు ఉన్నారు. ► ఉగ్రవాదుల తూటాలకు బలైన సుబేదార్ ఫతేసింగ్(51) పార్థివదేహాన్ని పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు తీసుకువచ్చారు. షూటింగ్లో మంచి ప్రతిభ గల ఫతేసింగ్ కామన్వెల్త్ క్రీడల్లో దేశానికి పతకాలు సాధించిపెట్టారు. జవాన్లతో కలిసి ఫతేసింగ్ కూతురు మధు తన తండ్రి భౌతికకాయాన్ని మోయడం అందరూ కన్నీటిపర్యంతమయ్యారు. ఝాన్దేవాల్ కుర్ద్ గ్రామంలోని ఫతేసింగ్ కుటుంబసభ్యులను సోమవారం పంజాబ్ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్ కలిసి పరామర్శించారు. ► ఉగ్రవాద దాడిలో కన్నుమూసిన మరో అమరుడు హావిల్దార్ కుల్వంత్సింగ్కు పంజాబ్‌లోని ఆయన సొంతూరు చాక్ షరీఫ్ గ్రామంలో సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. కుల్వంత్ సింగ్ కుటుంబీకులను సైతం సీఎం బాదల్ కలసి పరామర్శించారు. ► ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన హవీల్దార్ సంజీవన్ సింగ్ రానా(50) అంత్యక్రియలు ఆయన స్వస్థలం కంగ్రా జిల్లా సియన్ గ్రామంలో, హవీల్దార్ జగదీశ్ చంద్(58) అంత్యక్రియలు చంబా జిల్లా గోలా గ్రామంలో సైనిక లాంఛనాలతో నిర్వహించారు. వీరిద్దరి కుటుంబాలకు రూ.20 లక్షల ఆర్ధిక సాయం అందిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం వీర్‌భద్రసింగ్ ప్రకటించారు. లాన్స్ నాయక్ మూల్ రాజ్ అంత్యక్రియలను ఆయన సొంతూరైన జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని సాంబా జిల్లా జాఖ్ గ్రామంలో నిర్వహించారు. అమర జవాన్లు ఉగ్రవాదులతో కాల్పుల్లో ఒక గరుడ్ కమాండో, ఒక ఎన్ఎస్జీ అధికారి, ఐదుగురు డిఫెన్స్ సెక్యూరిటీ కోర్(డీఎస్సీ) సిబ్బంది మరణించారు. మరో 17 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ► గురుసేవక్ సింగ్ - గరుడ్ కమాండో ► ఇ.కె. నిరంజన్ -లెఫ్టినెంట్ కల్నల్ (ఎన్ఎస్జీ) ► ఫతేసింగ్- సుబేదార్ మేజర్ (డీఎస్సీ) ► మూల్ రాజ్-లాన్స్ నాయక్(డీఎస్సీ) ► సంజీవన్ సింగ్-హవల్దార్(డీఎస్సీ) ► జగదీశ్ చంద్- హవల్దార్ (డీఎస్సీ) ► కుల్వంత్ సింగ్- హవల్దార్ (డీఎస్సీ) -
సుప్రీంకోర్టు కొత్త సీజేగా దత్తు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ హెచ్ ఎల్ దత్తును నియమించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా ఈ నెల 27న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ దత్తు నియామకానికి సంబంధించిన ఫైలును కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఆమోదించి, ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించినట్టు తెలిసింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం లభించిన వెంటనే దత్తు నియామకానికి సంబంధించిన ఉత్తర్వు జారీ అవుతుందని అధికారవర్గాలు తెలిపాయి. దత్తు వచ్చే ఏడాది డిసెంబర్ 2వరకు సీజేఐగా కొనసాగుతారు.