అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు కోసం తెలుగుదేశం పార్టీ లాబీయింగ్ ముమ్మరం చేస్తోంది.
తెలుగుదేశం పార్టీ లాబీయింగ్
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు కోసం తెలుగుదేశం పార్టీ లాబీయింగ్ ముమ్మరం చేస్తోంది. పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచేందుకు వీలుగా చట్ట సవరణ చేయాలని పట్టుబడుతోంది. అయితే, కేవలం పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని సవరిస్తే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ సాధ్యం కాదని, ఇందుకోసం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని సవరించాల్సి ఉంటుందని భారత అటార్నీ జనరల్, కేంద్ర న్యాయ శాఖ ఇప్పటికే తేల్చిచెప్పాయి. ఈ నేపథ్యంలో కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి నేతృత్వంలోని బృందం హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను గురువారం కలవనుందని టీడీపీ వర్గాలు తెలిపాయి.
ఈ భేటీలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా పాల్గొంటారని సమాచారం. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26ను సవరించడం ద్వారా అసెంబ్లీ సీట్ల పెంపునకు వీలుగా ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు తేవాలని టీడీపీ కోరుతోంది. అలా వీలుకాని పక్షంలో పార్లమెంట్ సమావేశాలు ముగిసిన అనంతరం ఆర్డినెన్స్ ద్వారానైనా పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించాలని కేంద్రంపై ఒత్తిడి పెంచుతోంది. కానీ, ఇది సాధ్యపడదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు టీడీపీ వర్గాలకు స్పష్టం చేసినట్లు సమాచారం.