Reorganization Act
-
కశ్మీర్ ఎల్జీకి మరిన్ని అధికారాలు
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)కి కేంద్రం మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. పోలీసు శాఖ, అఖిల భారత సర్వీసుల అధికారులు, వివిధ కేసుల విచారణ అనుమతులు వంటి కీలక అంశాలపై అధికారాలను కల్పించింది. ఈ మేరకు జమ్మూకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టం–2019కు హోం శాఖ సవరణలు చేపట్టింది. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం ఈ చట్టం చేసింది. ఇప్పటి వరకు పోలీసు, జైళ్లు, శాంతిభద్రతలు, అఖిల భారత సర్వీసులు, ఏసీబీలకు సంబంధించిన నిర్ణయాలపై జమ్మూకశ్మీర్ ఆర్థిక శాఖ నుంచి ఆమోదం పొందాకనే ఎల్జీ వద్దకు వచ్చేవి. తాజా నిబంధనల ప్రకారం..ఆయా సర్వీసులకు సంబంధించిన ఫైళ్లు ఇకపై చీఫ్ సెక్రటరీ నుంచి నేరుగా ఎల్జీ వద్దకే చేరుతాయి. అడ్వకేట్ జనరల్, ఇతర న్యాయాధికారుల నియామక అధికారాలు కూడా తాజాగా ఎల్జీకే దఖలు పడ్డాయి.అధికారాలను హరించేందుకే..కేంద్రం నిర్ణయంపై జమ్మూకశ్మీర్‌లోని రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికయ్యే ప్రభుత్వం అధికారాలను హరించేందుకే కేంద్రం ప్రయత్నిస్తోందని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ(పీడీపీ)లు ఆరోపించాయి. జమ్మూకశ్మీర్‌లో సెప్టెంబర్ 30వ తేదీలోగా అసెంబ్లీ ఎన్నికలు చేపట్టి, రాష్ట్రం హోదాను పునరుద్ధరించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించడం తెల్సిందే. -
త్వరలో ఎన్నికలు.. జమ్ము-కశ్మీర్ చట్టంలో సవరణలు
ఢిల్లీ: జమ్ము-కశ్మీర్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్ము-కశ్మీర్ లెఫ్ట్నెట్ గవర్నర్(ఎల్జీ) అధికారాలను పెంచే చర్యలను చేపట్టింది. అందులో భాగంగానే జమ్ము-కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2019లోని పలు నిబంధనలను తాజాగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ సవరించింది.అయితే ఈ సవరణల వల్ల జమ్ము కశ్మీర్ ఎల్జీ అధికారాలు మరింత పెరుగనున్నాయి. జమ్ము- కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019లో అధికారాలను అమలు చేసే సెక్షన్ 55 నిబంధనలో తీసుకువచ్చిన పలు సవరణలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. జమ్ము కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వానికి సంబంధిచిన వ్యాపార లావాదేవీలను సవరించడానికి రాష్ట్రపతి మరిన్ని నిబంధనలను రూపొందించినట్లు నోటిఫికేషన్లో పేర్కొంది.తాజాగా సవరించిన చట్టం.. జమ్ము- కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో రెండో సవరణ. ఈ సవరించిన నిబంధనల ద్వారా శాంతి భద్రతల చర్యలకు సంబంధించి పూర్తి అధికారాలు ఇక నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లోనే ఉండనున్నాయి. అయితే ఈ చట్టం అమలులోకి వచ్చిన మొదట్లో పోలీసు, పబ్లిక్ ఆర్డర్, ఆల్ ఇండియా సర్వీస్, అవినీతి నిరోధక బ్యూరోకు సంబంధించి అధికారాలను అమలు చేయడానికి ఆర్థిక శాఖ ఆమోదం తీసుకోవాల్సి అవసరం ఉండేది. కానీ కొత్త సవరణ చట్ట నియమాల్లో పొందుపర్చిన సబ్ రూల్ (2ఎ) ప్రకారం.. ఇక నుంచి ఆర్థికశాఖ అనుమంతి తీసుకోవాల్సిన అవసరం లేదు. పోలీసు, యాంటీ కరప్షన్ బ్యూరో, ఆల్ ఇండియా సర్వీసులకు సంబంధించిన ప్రతిపానదలను చీఫ్ సెక్రటరీ.. ఎల్జీ ముందు తీసుకెవెళ్లితే.. ఎల్జీ ప్రతిపాదనలను అంగీకరించే లేదా తిరస్కరించే అధికారం లభించింది.చట్టంలోని ప్రధాన నిబంధనల్లో కొత్తగా 42(ఎ)ను హోం మంత్రిత్వశాఖ చేర్చింది.ఈ నిబంధన ప్రకారం.. సీఎంకు న్యాయ వ్యవహారాల్లో ఎలాంటి అధికారం ఉండదు. అడ్వకేట్ జనరల్‌తోపాటు ఇతర న్యాయ అధికారుల నియమకానికి చీఫ్ సెక్రటరీతో పాటు సీఎం.. ఎల్జీ ఆమోదానికి పంపాల్సి ఉంటుంది. అదేవిధంగా 42 బీ నిబంధనం ప్రకారం.. ప్రాసిక్యూషన్ మంజూరు లేదా అప్పీల్‌కు దాఖలకు సంబంధించిన ఏదైనా ప్రతిపాదనను న్యాయశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ద్వారా చీఫ్ సెక్రటరీ ఎల్జీకి పంపిస్తారని హోం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. -
హైకోర్టు తీర్పు గుబులు.. ఆ 15 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పరిస్థితేంటి?
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించినందున ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆ రాష్ట్రానికే వెళ్లాలని మంగళవారం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉన్నతాధికారుల్లో గుబులు రేపుతోంది. హైకోర్టు ఉత్తర్వులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ తీర్పుతో మిగిలిన ఉన్నతాధికారులంతా విధిగా ఆయా రాష్ట్రాలకు తిరిగి వెళ్లాల్సిందేనా? అన్న చర్చ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తెలంగాణలో పని చేస్తుండగా.. తెలంగాణ రాష్ట్ర కేడర్‌కు కేటాయించిన వారు ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్నారు. రెండు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన కేడర్లలో కాకుండా క్యాట్ ఉత్తర్వులతో కొనసాగుతున్న వారిలో 9 మంది ఐఏఎస్‌లు, ఆరుగురు ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ఐపీఎస్‌లకు సంబంధించి ఇటీవలే తెలంగాణ ఇన్చార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అంజనీకుమార్, అడిషనల్ డీజీపీ అభిలాష బిస్త్, అభిలాష్ మహంతిలు ఆంధ్ర కేడర్‌కు చెందిన అధికారులు కాగా.. తెలంగాణలో పనిచేస్తున్నారు. మొన్నటివరకు ఏపీ కేడర్‌కు చెందిన సంతోష్ మెహ్రా తెలంగాణలో పనిచేసినా, ఈ మధ్యనే ఆయన ఏపీ కేడర్‌కు వెళ్లిపోయారు. కాగా తెలంగాణకు కేడర్‌కు కేటాయించిన మనీష్‌కుమార్ సింగ్, అమిత్‌గార్గ్, అతుల్ సింగ్‌లు ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్నారు. ఇక ఈ విధంగా ఐఏఎస్ అధికారుల్లో సోమేశ్‌కుమార్, వాణీప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఎం.ప్రశాంతి, కాటా ఆమ్రపాలి తెలంగాణ కేడర్‌లో పనిచేస్తుండగా అలాగే తెలంగాణ కేడర్‌కు కేటాయించిన హరికిరణ్, శ్రీజన, శివశంకర్‌లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్నారు. చదవండి: (తెలంగాణ నూతన సీఎస్‌గా శాంతికుమారి) -
‘అమరావతి’ మా నిర్ణయం కాదు
సాక్షి, అమరావతి: రాజధానితోపాటు హైకోర్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని, రాజ్యాంగం, చట్టాలు ఏం చెబుతున్నాయన్న విషయాన్ని రాష్ట్ర హైకోర్టుకు సూటిగా, స్పష్టంగా తేల్చి చెప్పింది. రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని ఏర్పాటు గురించి లేదని, కేవలం రాష్ట్రాల ఏర్పాటు గురించి మాత్రమే ప్రస్తావించారని తెలిపింది. హైకోర్టు ప్రిన్సిపల్ సీటు రాజధానిలో మాత్రమే ఉండాలని ఎక్కడా లేదని హైకోర్టుకు తెలియచేసింది. మూడు రాజధానుల విషయంలో పిటిషనర్లు చేస్తున్న వాదనలన్నీ నిస్సారమైనవని నివేదించింది. పదేపదే తమపై అభ్యంతరకర, దురుద్దేశపూర్వకంగా నిందలు మోపుతుండటం ఖండించతగినదని కేంద్రం పేర్కొంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలపై కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించడం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తరఫున హోంశాఖ సెక్రటరీ లలిత టి.హెడావు కౌంటర్ దాఖలు చేయగా పిటిషనర్లు దీనిపై రీజాయిండ్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రీజాయిండ్కు సమాధానమిస్తూ లలిత హెడావు తాజాగా హైకోర్టులో అదనపు కౌంటర్ దాఖలు చేశారు. ఈ అదనపు కౌంటర్ వివరాలు ఇవీ.. పిటిషనర్ల వాదనలో అర్థం లేదు... – ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 6లో ‘ఏ క్యాపిటల్ ఫర్ ఆంధ్రప్రదేశ్’ అన్న వాక్యం ఉపయోగించారని, అదే చట్టంలోని సెక్షన్ 94(3), 94(4)లు, 13వ షెడ్యూళ్లను కలిపి చదివితే ఆంధ్రప్రదేశ్‌కు ఒకే రాజధాని మాత్రమే ఉండాలన్న అర్థం వస్తుందని పిటిషనర్లు అంటున్నారు. వాస్తవానికి జనరల్ క్లాజుల చట్టం 1897లోని సెక్షన్ 13 చెబుతున్నదేంటంటే.. అన్ని కేంద్ర చట్టాలు, నిబంధనల్లో (సంబంధిత విషయానికి, సందర్భానికి విరుద్ధంగా ఉంటే తప్ప) ఏకవచనంలో ఉన్న పదాలన్నింటిని బహువచనాలుగా, బహువచనంలో ఉన్న పదాలను ఏకవచనాలుగా భావించాల్సి ఉంటుంది. పురుష లింగాన్ని స్త్రీ లింగంగా కూడా భావించవచ్చు. దీని ప్రకారం పిటిషనర్లు చేస్తున్న వాదనలో ఏ మాత్రం అర్థం లేదు. కేంద్రం రాజధానిని ఎంపిక చేయాలని అవి చెప్పట్లేదు.. – సెక్షన్ 94(3), 94(4)లు కేంద్ర ప్రభుత్వం కొత్త రాజధానిలో సదుపాయాల కల్పనకు అవసరమైన ఆర్థిక సాయాన్ని మాత్రమే అందించాలని చెబుతున్నాయి. అవసరమైతే శిధిల అటవీ ప్రాంతాన్ని డీ నోటిఫై చేయాలని కూడా చెబుతున్నాయి. ఈ రెండు సెక్షన్లు కేంద్రం అందించాల్సిన ఆర్థిక సాయం గురించి చెబుతున్నాయే కానీ కేంద్రం రాజధానిని ఎంపిక చేయాలన్న అంశం గురించి కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొదట అమరావతిని రాష్ట్రానికి రాజధానిగా ఎంచుకుంది. దానిని 2015 ఏప్రిల్ 23న నోటిఫై చేసింది. ఆ నోటిఫికేషన్ ఆధారంగా సర్వే ఆఫ్ ఇండియా భారతదేశ రాజకీయ మ్యాప్‌లో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేర్చింది. పునర్విభజన చట్టంలో ఎలాంటి అస్పష్టత లేదు... – అపాయింటెడ్ తేదీ నుంచి హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5(1) చెబుతోంది. సెక్షన్ 2 ప్రకారం పదేళ్ల తరువాత హైదరాబాద్ తెలంగాణ రాజధాని అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఏర్పాటవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో ఈ చట్టంలో ఎలాంటి అస్పష్టత లేదు. అయితే ఏపీలో గత ప్రభుత్వం మాత్రం ఉమ్మడి రాజధాని నుంచి తరలివెళ్లాలని నిర్ణయించి అమరావతిని రాజధానిగా నోటిఫై చేసింది. పునర్విభజన చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదికే ఈ నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగంలోని అధికరణ 3లో రాష్ట్రాల ఏర్పాటు, ఇతర విషయాల ప్రస్తావన ఉంది. ఈ అధికరణలో రాజధానుల ఏర్పాటు గురించి ఎలాంటి నిబంధన లేదు. అంతమాత్రాన మా నిర్ణయంగా భావించరాదు... – పునర్విభజన చట్టం సెక్షన్ 30 ప్రకారం అధికరణ 214కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పడే వరకు హైకోర్ట్ ఎట్ హైదరాబాద్ ఉభయ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా ఉంటుంది. రాష్ట్రపతి నిర్ణయించి, నోటిఫై చేసిన ప్రదేశం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రిన్సిపల్ సీటు అవుతుంది. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఏపీకి వేరుగా హైకోర్టును ఏర్పాటు చేసి 2019 జనవరి 1 నుంచి అమరావతిని ప్రిన్సిపల్ సీటుగా నిర్ణయిస్తూ రాష్ట్రపతి 2018 డిసెంబర్ 26న ఉత్తర్వులిచ్చారు. రాష్ట్రపతి ఉత్తర్వులను నోటిఫై చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రాన అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఏమాత్రం భావించేందుకు వీల్లేదు. – హైకోర్టు ప్రిన్సిపల్ సీటు తప్పనిసరిగా రాజధానిలోనే ఉండాలని ఎక్కడా లేదు. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఈ వ్యాజ్యాల్లో తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతున్నాం. -
తుది కేటాయింపులు చేయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం.. డీఎస్పీ, అదనపు ఎస్పీ, ఎస్పీ (నాన్ కేడర్) పోస్టులకు తుది కేటాయింపులు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. వీరి నుంచి తాజాగా ఆప్షన్స్ కూడా తీసుకోవచ్చని సూచించింది. ఉన్నతాధికారుల పునర్విభజన సలహా కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని, పునర్విభజన చట్టం నిబంధనల మేరకు కేటాయింపులు చేసి తెలంగాణ, ఏపీ హోం శాఖ, డీజీపీలకు తెలియజేయాలని తీర్పునిచ్చింది. ఈ ప్రక్రియను ఆరు వారాల్లో పూర్తి చేయాలని, ఇందుకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలతోపాటు డీజీపీలు సహకరించాలని స్పష్టం చేసింది. తనను ఏపీకి కేటాయించకపోవడాన్ని సవాల్ చేస్తూ కర్నూల్ జిల్లాకు చెందిన డీఎస్పీ జి.నాగన్న దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఇది ఒక్కరికి చెందింది కాదు.... తనను ఏపీకి కేటాయించాలంటూ నాగన్న పిటిషన్ దాఖలు చేసినా.. ఇరు రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులకు తమ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది. తుది కేటాయింపులపై తెలంగాణ ప్రభుత్వ వాదన ఏంటో చెప్పాలంటూ పలు పర్యాయాలు గడువు ఇచ్చినా వాదనలు వినిపించకపోవడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. అలాగే ఆరువారాలు గడువు ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం తయారు చేసిన సీనియారిటీ జాబితాపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిందంటూ కేంద్రం మౌనంగా ఉంటే ఎలా అని ప్రశ్నించింది. తెలంగాణ అభ్యంతరాలను పరిష్కరించే పరిధి కేంద్రానికి ఉన్నా పట్టనట్లుగా వ్యవహరించిందని పేర్కొంది. నాగన్నను విధుల్లోకి తీసుకోవాలి.... తాత్కాలిక కేటాయింపుల్లో భాగంగా తెలంగాణకు కేటాయించిన డీఎస్పీ జి.నాగన్నను తుది కేటాయింపుల్లో కేంద్రం ఏపీకి కేటాయిస్తే వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కేటాయింపుల్లో జాప్యంతో పదోన్నతులు, ఇతర అలవెన్స్‌లు, పదవీ విరమణ బెనిఫిట్స్ మీద దీని ప్రభావం ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో కేటాయింపుల్లో జాప్యానికి కారణమైన కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలు రూ.5 వేల చొప్పున నాగన్నకు పరిహారంగా చెల్లించాలని స్పష్టం చేసింది. -
విభజన అంశాలపై 6న ప్రధానితో సీఎం భేటీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర పునర్విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంతోపాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రధాన అజెండాగా ఈ నెల 6, 7 తేదీల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన ఉండనుంది. మంగళవారం ఉదయం హస్తినకు బయలుదేరి వెళ్లనున్న సీఎం.. అదేరోజు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. బుధవారం రాష్ట్రపతితో పాటు పలువురు కేంద్ర మంత్రులతోనూ జగన్ సమావేశం అవుతారు. కాగా పునర్విభజన చట్టానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై ప్రధానికి ముఖ్యమంత్రి నివేదిక సమర్పించనున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని ఏడు జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద నిధులు విడుదల చేయడంతో పాటు రెవెన్యూ లోటు భర్తీ, వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంటు, రాష్ట్రంలో ఓడరేవు ఏర్పాటు తదితర అంశాలను మోదీ దృష్టికి జగన్ తీసుకువెళ్లనున్నారు. అలాగే గోదావరి జలాలను శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు తరలించడం వెనుక ఉన్న లక్ష్యాలు, తద్వారా రైతాంగానికి కలిగే ప్రయోజనాలను వివరించనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులకు రివర్స్ టెండర్ వల్ల ప్రజాధనం ఆదా అయ్యే విషయం, ప్రైవేట్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలను కూడా ప్రధానికి వివరించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సూచనల మేరకు.. కేంద్ర ప్రభుత్వానికి నివేదించాల్సిన అంశాలపై ఆదివారం సచివాలయంలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం.. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లాల్సిన అంశాలపై నివేదిక రూపొందించారు. -
కమీషన్ల దాహంతో గందరగోళంగా మార్చేశారు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసే పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు అధికారంలో ఉండగా కమీషన్ల దాహంతో గందరగోళం చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఒక్క పోలవరం ప్రాజెక్టులోనే చంద్రబాబు అనేక కుంభకోణాలకు పాల్పడి తన అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చుకున్నారని చెప్పారు. శనివారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిపుణుల కమిటీతో భేటీ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో పోలవరం నిర్మాణంలో చోటు చేసుకున్న అక్రమాల గురించి వైఎస్ జగన్ ప్రస్తావించారు. ‘పోలవరంలో నామినేషన్‌దే డామినేషన్’ శీర్షికన ఈనెల 20వతేదీన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చదివి వినిపించారు. ఈ కుంభకోణంపై తొలుత విచారణ చేయాలని నిర్దేశించారు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ‘రివర్స్ టెండరింగ్’ ద్వారా కొత్త కాంట్రాక్టర్‌ను అక్టోబర్ నాటికి ఎంపిక చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నవంబర్ నాటికి కొత్త కాంట్రాక్టర్‌తో పోలవరం పనులను ప్రారంభించి శరవేగంగా పూర్తి చేస్తామని ప్రకటించారు. నాలుగు నెలల్లోగా విచారణ పూర్తి కావాలి... రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని కేంద్రమే నిర్మించి అప్పగించాల్సి ఉండగా చంద్రబాబు కమీషన్ల కోసం ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి మరీ ప్రాజెక్టు బాధ్యతలను దక్కించుకున్నారని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ప్రణాళికా రాహిత్యం, చిత్తశుద్ధి లోపం, కమీషన్ల దాహంతో పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టులో స్పిల్ వే, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ప్రధాన జలాశయం) రెండు భాగాలుగా నిర్మించాల్సి ఉంటుందన్నారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్ పూర్తి చేసిన తర్వాత.. గోదావరి వరద ప్రవాహాన్ని వాటి మీదుగా మళ్లించే ఏర్పాట్లు పూర్తయ్యాక ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ కట్టడానికి వీలుగా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు నిర్మించాలని చెప్పారు. అయితే చంద్రబాబు అధికారంలో ఉండగా స్పిల్ వేను పూర్తి చేయకుండా కాఫర్ డ్యామ్‌ల పనులను హడావుడిగా ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఎగువ కాఫర్ డ్యామ్ పనులు 80 శాతం మేర, దిగువ కాఫర్ డ్యామ్ పనులు 60 శాతం మేర పూర్తి చేశారని, కానీ గోదావరికి వరదలు వచ్చే సమయం ఆసన్నమవడంతో వాటిని మధ్యలోనే ఆపేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. జూలై నుంచి అక్టోబర్ వరకు గోదావరికి భారీగా వరదలు రానున్నందున కాఫర్ డ్యామ్, స్పిల్ వే, స్పిల్ ఛానల్ మీదుగా మళ్లించాల్సి వస్తుందన్నారు. దీనివల్ల జూలై నుంచి అక్టోబర్ వరకూ నాలుగు నెలలపాటు పనులు చేయడానికి వీలు లేకుండా పోయిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సరైన ప్రణాళికతో పోలవరం పనులను చేపట్టి ఉంటే ఈ దుస్థితి దాపురించేది కాదన్నారు. పోలవరంలో చోటుచేసుకున్న అక్రమాలపై నాలుగు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని నిపుణుల కమిటీకి సూచించారు. అక్రమాలకు కేంద్ర బిందువుగా పోలవరం.. పోలవరం జలాశయం(హెడ్ వర్క్స్) పనులను ఈపీసీ విధానంలో రూ.4,054 కోట్లకు దక్కించుకున్న ట్రాన్స్ట్రాయ్(జేవీ) ఒప్పందం ప్రకారం 2018 మార్చి నాటికే పనులు పూర్తి చేయాల్సి ఉందని నిపుణుల కమిటీతో భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. సత్తాలేని రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌కి పనులు ఎలా అప్పగిస్తారంటూ ప్రతిపక్షంలో ఉండగా విమర్శలు చేసిన చంద్రబాబు ఆయన టీడీపీలో చేరగానే మాట మార్చారని దుయ్యబట్టారు. పోలవరం పనులను దక్కించుకున్న మరుసటి రోజే హెడ్ వర్క్స్ అంచనా వ్యయాన్ని చంద్రబాబు రూ.5,385.91 కోట్లకు పెంచేసి అక్రమాలకు కేంద్ర బిందువుగా మార్చేశారని చెప్పారు. పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించి 2018 ఫిబ్రవరి వరకు రూ.2,362.22 కోట్ల బిల్లులు చెల్లించి కమీషన్లు వసూలు చేసుకున్నారని మండిపడ్డారు. ట్రాన్స్‌ట్రాయ్‌తో ఈపీసీ ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండా ఎల్ఎస్ృఓపెన్ విధానంలో మరో కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. గేట్ల పనులను రూ.387.56 కోట్లకు బీకెమ్ సంస్థకు నామినేషన్‌పై అప్పగించారని చెప్పారు. ట్రాన్స్‌ట్రాయ్‌కి చెల్లించిన బిల్లులు, నామినేషన్ పద్ధతిలో అప్పగించిన పనుల విలువను పరిశీలిస్తే హెడ్ వర్క్స్ అంచనా వ్యయం రూ.5,825.15 కోట్లు అవుతుందన్నారు. సవరించిన అంచనా వ్యయం కంటే హెడ్ వర్క్స్ పనుల విలువ రూ.439.24 కోట్లు అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోందని ‘సాక్షి’ కథనాన్ని ప్రస్తావించారు. కాలువల్లోనూ అక్రమాల ప్రవాహం.. అక్రమాలు హెడ్వర్క్స్కే పరిమితం కాలేదని, పోలవరం కుడి కాలువ పనుల అంచనా వ్యయాన్ని రూ.2,240.86 కోట్ల నుంచి రూ.4,375.77 కోట్లకు, ఎడమ కాలువ పనులు రూ.1,954.74 కోట్ల నుంచి రూ.3,645.15 కోట్లకు పెంచుతూ 2016 డిసెంబర్ 6వతేదీన చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేయించారని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. అనంతరం ఎడమ కాలువలో ఎనిమిది ప్యాకేజీల కాంట్రాక్టర్లపై 60 సీ నిబంధన కింద వేటు వేసి కమీషన్లు చెల్లించేవారికి నామినేషన్‌పై పనులు అప్పగించారని చెప్పారు. వాస్తవాలు వెల్లడించండి.. అధికారులు నిపుణుల కమిటీకి సహకరించి పోలవరం ప్రాజెక్టులో అక్రమాలను బహిర్గతం చేయాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు. ‘అప్పట్లో చంద్రబాబు ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఆయన ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టారు. పోలవరం పనుల్లో చంద్రబాబు అక్రమాలకు సహకరించారు. కాంట్రాక్టర్ల నుంచి చంద్రబాబు భారీ ఎత్తున కమీషన్లు వసూలు చేసుకున్నారు. వాస్తవాలు చెప్పండి. మిమ్మల్ని (అధికారులను) రక్షించే పూచీ నాది. ప్రజాధనం ఆదా చేసిన వారిని ప్రజల సమక్షంలో సన్మానిస్తాం’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. గత నాలుగేళ్ల పది నెలల వ్యవధిలో చంద్రబాబు పాలనలో సాగునీటి ప్రాజెక్టులపై చేసిన ఖర్చును సద్వినియోగం చేసుకుని ఉంటే ప్రాజెక్టులన్నీ పూర్తై కాలువల్లో నీళ్లు గలగలా పారుతుండేవని ముఖ్యమంత్రి చెప్పారు. చంద్రబాబు అక్రమాలకు పాల్పడటం వల్ల ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదన్నారు. నివేదిక రాగానే రివర్స్ టెండరింగ్.. పోలవరం పనుల్లో జీవో 22, 63లను వర్తింపజేసి తాజా ధరల కంటే అధికంగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి చంద్రబాబు భారీ ఎత్తున కమీషన్లు వసూలు చేసుకున్నారని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. పోలవరం జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టు టెండర్లలో రూ.వెయ్యి కోట్లకుపైగా అవినీతి జరిగిందని స్పష్టం చేశారు. ఈ అక్రమాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని నిపుణుల కమిటీని ఆదేశించారు. నివేదిక రాగానే అంచనా వ్యయాన్ని అలానే ఉంచి రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పోటీ పడేలా నిబంధనలు రూపొందించి టెండర్లు పిలుస్తామన్నారు. తక్కువ ధరకు పనులు చేయడానికి ముందుకొచ్చిన కాంట్రాక్టర్లకు అప్పగించి తద్వారా ఆదా అయ్యే నిధులను ప్రజల కోసం వినియోగిస్తామని ప్రకటించారు. ప్రజాధనం ఆదా కావడానికి దోహదం చేసిన అధికారులు, నిపుణులను ప్రజల సమక్షంలో సన్మానిస్తామని చెప్పారు. -
విభజన చట్టం అమలుపై కేంద్రం సమీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చ ట్టంలోని నిబంధనల అమలుపై కేంద్రహోంశాఖ సమీక్షించింది. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి సత్పాల్ చౌహాన్ అధ్యక్షతన జరిగి న సమావేశంలో వివిధ కేంద్ర శాఖల కార్యదర్శులు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులు పాలొ ్గన్నారు. తెలంగాణ నుంచి ఆర్థిక శాఖ ముఖ్య కార్య దర్శి కె.రామకృష్ణారావు, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్(ఎఫ్ఏసీ) వేదాంతంగిరి హాజరయ్యారు. ఏపీ నుంచి ఆర్అండ్బీ శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్‌కుమార్‌ప్రసాద్, పురపాలన శాఖ ముఖ్య కార్య దర్శి ఆర్.కరికాల వళవన్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, పునర్ వ్యవస్థీకరణ వ్యవహారా ల ముఖ్య కార్యదర్శి ఎల్.ప్రేమ్‌చంద్రారెడ్డి, ఆంధ్ర ప్రదేశ్‌భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ పాల్గొన్నారు. పునర్ వ్యవస్థీకరణ చట్టం పరిధిలో ఏపీ, తెలంగాణ కేంద్రం అమలు చేయాల్సిన అంశా లపై రెండు రాష్ట్రాల ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చిం చారు. చట్టంలో 13వ షెడ్యూల్లో పొందుపరిచిన మౌలిక వసతుల నిబంధనల అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు తమ రాష్ట్రానికి సంబంధించి ఆరు అంశాలను హోంశాఖ దృష్టికి తీసుకొచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన గిరిజన యూనివ ర్సిటీకి నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. అలాగే ఉద్యానవన విశ్వవిద్యాల య స్థాపన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఖమ్మం జిల్లా బయ్యారంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని వెనకబడిన ప్రాంతాలను అనుసం ధానిస్తూ రహదారుల నిర్మాణం చేపట్టాలని నివేదించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి చర్చించిన అంశాలు పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 13లో పొందుపరిచిన అంశాల్లో జాతీయస్థాయి సంస్థల సత్వర నిర్మాణానికి వేగవంతంగా నిధులు విడుదల చేయాలని, కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ నిర్మాణానికి కేంద్రం చొరవ చూపాలని, విశాఖప ట్నం–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ స్థాపన అంశంలో పురోగతి లేదని ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు నివేదిం చారు. తిరుపతి విమానాశ్రయ ఆధునీకరణ పనులు, విజయవాడ విమానాశ్రయ విస్తరణ పనులు వేగవం తంగా సాగడం లేదని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకొచ్చారు. -
నీటిని దామాషా పద్ధతిన పంచాలి
-
దామాషా పద్ధతిన పంచాలి
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా నదిలో నీటి లభ్యత తగ్గినప్పుడు దిగువ రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించేలా దామాషా పద్ధతిలో నీటి పంపిణీ అమలయ్యేలా చూడాలని. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ణయించింది. దీనిపై కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించింది. తెలంగా ణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య కృష్ణా జలాల పంపిణీ, కృష్ణా బోర్డు వర్కింగ్ మాన్యువల్(కార్యనిర్వాహక నియమావళి) ముసాయిదా రూపకల్పన కోసం ఏర్పాటైన ఏకే బజాజ్ కమిటీకి సైతం ఈ లేఖను పంపనుంది. ఇక ఈ ఏడాది నీటి లభ్యత బాగా తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో నీటి ఎద్దడి నెలకొందని.. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, కర్ణాటక ప్రాజెక్టు ల నుంచి దిగువకు నీటిని విడుదల చేసేలా కేంద్ర జోక్యం ఆవశ్యకమని భేటీలో బోర్డు, తెలంగాణ, ఏపీలు అభిప్రాయపడ్డాయి. ఎగువన భారీ వర్షాలు కురిసినా.. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఏపీలోని అమరావతిలో మంగళవారం కృష్ణా బోర్డు సమావేశం జరిగింది. బోర్డు చైర్మన్ ఎస్కే శ్రీవాత్సవ, సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ, తెలంగాణ, ఏపీ జల వనరుల శాఖ కార్యదర్శులు ఎస్కే జోషి, శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీలు ఎం.వెంకటేశ్వరరావు, మురళీధర్‌లు ఇందులో పాల్గొన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లోని కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి.. కోయినా, ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు పూర్తిగా నిండాయని ఇరు రాష్ట్రాల అధికారులు బోర్డు దృష్టికి తీసుకువచ్చారు. అయినా దిగువకు నీటిని విడుదల చేయడం లేదని.. కేటాయించిన జలాలకన్నా అధికంగా వినియోగించుకుంటున్నాయని వివరించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కనీస మట్టానికి మించి తగ్గిపోయాయని పేర్కొన్నారు. నీటి లభ్యత తగ్గిన సందర్భాల్లో.. దిగువ రాష్ట్రాలకు న్యాయం జరిగేలా దామాషా పద్ధతిలో నీటి పంపిణీని అమలు చేయాలంటూ కేంద్రానికి లేఖ రాయాలని బోర్డును కోరారు. ఈ ప్రతిపాదనతో ఏకీభవించిన బోర్డు చైర్మన్ శ్రీవాత్సవ.. కేంద్రానికి లేఖ రాస్తామని, అవసరమైతే స్వయంగా చర్చిస్తామని హామీ ఇచ్చారు. టెలిమెట్రీ మీటర్ల ఏర్పాటుపై విభేదాలు కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఇరు రాష్ట్రాల నీటి వినియోగం లెక్కలు తేల్చేందుకు తొలిదశలో 18 చోట్ల టెలిమెట్రీ మీటర్లను బోర్డు ఏర్పాటు చేయగా.. వాటిపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. తెలంగాణ పోతిరెడ్డిపాడు వద్ద అదనంగా టెలిమీటర్లను ఏర్పాటు చేయాలని కోరగా ఏపీ అంగీకరించింది. కానీ రెండో దశలో మరో 29 ప్రాంతాల్లో టెలిమీటర్ల ఏర్పాటు చేయాలన్న బోర్డు ప్రతిపాదనపై మాత్రం ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఏర్పాటు చేసిన టెలిమీటర్ ద్వారా తమ నీటి వినియోగం లెక్కలు తేలాక.. వెలిగోడు, గాలేరు–నగరి, సోమశిల, కండలేరు జలాశయాల వద్ద టెలిమీటర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ, దిగువ కాలువ ద్వారా నీటి వినియోగం లెక్కలను తుంగభద్ర బోర్డు ఎప్పటికప్పుడు ప్రకటిస్తోందని.. అలాంటప్పుడు అక్కడ టెలిమీటర్ల ఏర్పాటు అనవసరమని పేర్కొంది. వీటితోపాటు ఏపీలోని మరో 17 ప్రాంతాల్లో టెలిమీటర్లు ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రతిపాదననూ ఏపీ వ్యతిరేకించింది. అసలు టెలిమీటర్ల ఏర్పాటుకు మార్గదర్శకాలు రూపొందించాలని.. ఆ తర్వాతే రెండో దశ టెలిమీటర్ల ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని సూచించింది. దీంతో టెలిమెట్రీ అంశాన్ని కొలిక్కి తెచ్చేందుకు వచ్చే నెల 18, 19 తేదీల్లో హైదరాబాద్‌లో సమావేశం కావాలని బోర్డు నిర్ణయించింది. డీపీఆర్‌లు సమర్పించాలన్న బోర్డు కృష్ణా పరీవాహక ప్రాంతంలో అనుమతి లేకుండా ప్రాజెక్టులు చేపట్టారంటూ ఏపీ, తెలంగాణలు ఒకరిపై ఒకరు కేంద్రానికి, బోర్డుకు ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ నేప థ్యంలో నెల రోజుల్లోగా ఆయా ప్రాజెక్టుల డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)లు ఇవ్వా లని ఇరు రాష్ట్రాల అధికారులను ఎస్కే శ్రీవాత్సవ కోరారు. ఇక చిన్ననీటి వనరుల కింద నీటి వినియోగాన్ని ఇప్పటికే ఏర్పాటు చేసిన సబ్‌కమిటీ తేల్చాలని ఇరు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చాయి. కృష్ణా బోర్డు నిర్వహణకు అయ్యే వ్యయాన్ని చెరి సగం భరించేందుకు ఆమోదం తెలిపాయి. అయితే 52 మంది సిబ్బందిని సమకూర్చాలన్న బోర్డు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ.. 25 మంది సిబ్బందికి ఓకే చెప్పాయి. కాగా ఏకే బజాజ్ కమిటీ నివేదిక మేరకే కృష్ణా బోర్డు వర్కింగ్ మ్యాన్యువల్‌ను ఖరారు చేయాలని ఇరు రాష్ట్రాలు చేసిన ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. అదే నిష్పత్తిన పంపిణీ పునర్విభజన చట్టం మేరకు కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల చొప్పున చేసిన తాత్కాలిక సర్దుబాటు పంపిణీనే ఈ ఏడాది కూడా అమలు చేయాలని బో ర్డు నిర్ణయించింది. 812 టీఎంసీల కన్నా అధికంగా నీటి లభ్యత ఉంటే.. ఇదే నిష్పత్తిన ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేసా ్తమని పేర్కొంది. కేంద్రం దీనిని పునఃసమీక్షించే వరకు గానీ, బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు నోటిఫై అయ్యే వరకుగానీ ఇదే విధానం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. -
అసెంబ్లీ సీట్లు పెంచాల్సిందే
తెలుగుదేశం పార్టీ లాబీయింగ్ సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు కోసం తెలుగుదేశం పార్టీ లాబీయింగ్ ముమ్మరం చేస్తోంది. పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచేందుకు వీలుగా చట్ట సవరణ చేయాలని పట్టుబడుతోంది. అయితే, కేవలం పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని సవరిస్తే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ సాధ్యం కాదని, ఇందుకోసం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని సవరించాల్సి ఉంటుందని భారత అటార్నీ జనరల్, కేంద్ర న్యాయ శాఖ ఇప్పటికే తేల్చిచెప్పాయి. ఈ నేపథ్యంలో కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి నేతృత్వంలోని బృందం హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను గురువారం కలవనుందని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా పాల్గొంటారని సమాచారం. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26ను సవరించడం ద్వారా అసెంబ్లీ సీట్ల పెంపునకు వీలుగా ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు తేవాలని టీడీపీ కోరుతోంది. అలా వీలుకాని పక్షంలో పార్లమెంట్ సమావేశాలు ముగిసిన అనంతరం ఆర్డినెన్స్ ద్వారానైనా పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించాలని కేంద్రంపై ఒత్తిడి పెంచుతోంది. కానీ, ఇది సాధ్యపడదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు టీడీపీ వర్గాలకు స్పష్టం చేసినట్లు సమాచారం. -
'పునర్విభజన చట్టం ప్రకారం నడుచుకోవాలి'
ఢిల్లీ: పునర్విభజన చట్టం ప్రకారం నడుచుకోవాలని కృష్ణా బోర్డు అధికారులను కేంద్రమంత్రి ఉమాభారతి ఆదేశించారు. సోమవారం ఢిల్లీ వెళ్లిన తెలంగాణ భారీనీటిపారుదల శాఖా మంత్రి హరీష్ రావు బృందం కేంద్రమంత్రి ఉమాభారతితో భేటీ అయింది. ఈ భేటీలో కృష్ణా రివర్ బోర్డు ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ ఉమాభారతికి హరీష్ రావు బృందం ఫిర్యాదు చేసింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం కృష్ణా బోర్డు ఉన్నతాధికారులతో కేంద్రమంత్రి ఉమాభారతి ఫోన్ మాట్లాడినట్టు తెలుస్తోంది. పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డు అధికారులు నడుచుకోవాలంటూ ఆమె ఆదేశించారు. రేపు (మంగళవారం) కృష్ణా బోర్డు ఉన్నతాధికారులను కలవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆమె కోరినట్టు సమాచారం.