సాక్షి, అమరావతి: రాజధానితోపాటు హైకోర్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని, రాజ్యాంగం, చట్టాలు ఏం చెబుతున్నాయన్న విషయాన్ని రాష్ట్ర హైకోర్టుకు సూటిగా, స్పష్టంగా తేల్చి చెప్పింది. రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని ఏర్పాటు గురించి లేదని, కేవలం రాష్ట్రాల ఏర్పాటు గురించి మాత్రమే ప్రస్తావించారని తెలిపింది. హైకోర్టు ప్రిన్సిపల్ సీటు రాజధానిలో మాత్రమే ఉండాలని ఎక్కడా లేదని హైకోర్టుకు తెలియచేసింది. మూడు రాజధానుల విషయంలో పిటిషనర్లు చేస్తున్న వాదనలన్నీ నిస్సారమైనవని నివేదించింది. పదేపదే తమపై అభ్యంతరకర, దురుద్దేశపూర్వకంగా నిందలు మోపుతుండటం ఖండించతగినదని కేంద్రం పేర్కొంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలపై కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించడం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తరఫున హోంశాఖ సెక్రటరీ లలిత టి.హెడావు కౌంటర్ దాఖలు చేయగా పిటిషనర్లు దీనిపై రీజాయిండ్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రీజాయిండ్‌కు సమాధానమిస్తూ లలిత హెడావు తాజాగా హైకోర్టులో అదనపు కౌంటర్ దాఖలు చేశారు. ఈ అదనపు కౌంటర్ వివరాలు ఇవీ..
పిటిషనర్ల వాదనలో అర్థం లేదు...
– ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 6లో ‘ఏ క్యాపిటల్ ఫర్ ఆంధ్రప్రదేశ్’ అన్న వాక్యం ఉపయోగించారని, అదే చట్టంలోని సెక్షన్ 94(3), 94(4)లు, 13వ షెడ్యూళ్లను కలిపి చదివితే ఆంధ్రప్రదేశ్‌కు ఒకే రాజధాని మాత్రమే ఉండాలన్న అర్థం వస్తుందని పిటిషనర్లు అంటున్నారు. వాస్తవానికి జనరల్ క్లాజుల చట్టం 1897లోని సెక్షన్ 13 చెబుతున్నదేంటంటే.. అన్ని కేంద్ర చట్టాలు, నిబంధనల్లో (సంబంధిత విషయానికి, సందర్భానికి విరుద్ధంగా ఉంటే తప్ప) ఏకవచనంలో ఉన్న పదాలన్నింటిని బహువచనాలుగా, బహువచనంలో ఉన్న పదాలను ఏకవచనాలుగా భావించాల్సి ఉంటుంది. పురుష లింగాన్ని స్త్రీ లింగంగా కూడా భావించవచ్చు. దీని ప్రకారం పిటిషనర్లు చేస్తున్న వాదనలో ఏ మాత్రం అర్థం లేదు.
కేంద్రం రాజధానిని ఎంపిక చేయాలని అవి చెప్పట్లేదు..
– సెక్షన్ 94(3), 94(4)లు కేంద్ర ప్రభుత్వం కొత్త రాజధానిలో సదుపాయాల కల్పనకు అవసరమైన ఆర్థిక సాయాన్ని మాత్రమే అందించాలని చెబుతున్నాయి. అవసరమైతే శిధిల అటవీ ప్రాంతాన్ని డీ నోటిఫై చేయాలని కూడా చెబుతున్నాయి. ఈ రెండు సెక్షన్లు కేంద్రం అందించాల్సిన ఆర్థిక సాయం గురించి చెబుతున్నాయే కానీ కేంద్రం రాజధానిని ఎంపిక చేయాలన్న అంశం గురించి కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొదట అమరావతిని రాష్ట్రానికి రాజధానిగా ఎంచుకుంది. దానిని 2015 ఏప్రిల్ 23న నోటిఫై చేసింది. ఆ నోటిఫికేషన్ ఆధారంగా సర్వే ఆఫ్ ఇండియా భారతదేశ రాజకీయ మ్యాప్‌లో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేర్చింది.
పునర్విభజన చట్టంలో ఎలాంటి అస్పష్టత లేదు...
– అపాయింటెడ్ తేదీ నుంచి హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5(1) చెబుతోంది. సెక్షన్ 2 ప్రకారం పదేళ్ల తరువాత హైదరాబాద్ తెలంగాణ రాజధాని అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఏర్పాటవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో ఈ చట్టంలో ఎలాంటి అస్పష్టత లేదు. అయితే ఏపీలో గత ప్రభుత్వం మాత్రం ఉమ్మడి రాజధాని నుంచి తరలివెళ్లాలని నిర్ణయించి అమరావతిని రాజధానిగా నోటిఫై చేసింది. పునర్విభజన చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదికే ఈ నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగంలోని అధికరణ 3లో రాష్ట్రాల ఏర్పాటు, ఇతర విషయాల ప్రస్తావన ఉంది. ఈ అధికరణలో రాజధానుల ఏర్పాటు గురించి ఎలాంటి నిబంధన లేదు.
అంతమాత్రాన మా నిర్ణయంగా భావించరాదు...
– పునర్విభజన చట్టం సెక్షన్ 30 ప్రకారం అధికరణ 214కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పడే వరకు హైకోర్ట్ ఎట్ హైదరాబాద్ ఉభయ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా ఉంటుంది. రాష్ట్రపతి నిర్ణయించి, నోటిఫై చేసిన ప్రదేశం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రిన్సిపల్ సీటు అవుతుంది. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఏపీకి వేరుగా హైకోర్టును ఏర్పాటు చేసి 2019 జనవరి 1 నుంచి అమరావతిని ప్రిన్సిపల్ సీటుగా నిర్ణయిస్తూ రాష్ట్రపతి 2018 డిసెంబర్ 26న ఉత్తర్వులిచ్చారు. రాష్ట్రపతి ఉత్తర్వులను నోటిఫై చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రాన అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఏమాత్రం భావించేందుకు వీల్లేదు.
– హైకోర్టు ప్రిన్సిపల్ సీటు తప్పనిసరిగా రాజధానిలోనే ఉండాలని ఎక్కడా లేదు. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఈ వ్యాజ్యాల్లో తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతున్నాం.
Comments
Please login to add a commentAdd a comment