
సాక్షి, అమరావతి: పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాల వల్ల అమరావతికి భూములిచ్చిన రైతుల ప్రాథమిక హక్కులకు ఎటువంటి భంగం వాటిల్లడం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ చట్టాల్లో రైతుల ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షించామని పేర్కొంది. విస్తృత ప్రజా ప్రయోజనాల నిమిత్తం ఏ చట్టాన్నైనా రద్దు చేసే అధికారం రాష్ట్రానికి ఉందని నివేదించింది. మాస్టర్ ప్లాన్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చునని, దాని ఆధారంగా మాట్లాడటం సరికాదంది. గత నిర్ణయాన్ని పునఃసమీక్షించడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రధాన కారణమని చెప్పింది. తాము ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఏకపక్ష నిర్ణయం కాదని, పలు సంస్థలు జరిపిన అధ్యయనాల ఆధారంగానే నిర్ణయం తీసుకున్నట్టు హైకోర్టుకు నివేదించింది. (హైకోర్టును రెడ్‌జోన్‌గా ప్రకటించడం సాధ్యం కాదు)
కౌంటర్‌లో దాఖలు చేసిన మరిన్ని అంశాలు..
►రాజ్యాంగంలోని అధికరణ 38కి లోబడే నిర్ణయం జరిగింది. దీని ప్రకారం వివిధ ప్రాంతాల పట్ల అసమానతలు చూపడానికి వీల్లేదు. అన్నీ ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మాపై ఉంది.
►వ్యక్తులకు జరిగే నష్టం, విస్తృత ప్రజా ప్రయోజనాల మధ్య వైరుద్ధ్యం వచ్చినప్పుడు న్యాయస్థానాలు విస్తృత ప్రజా ప్రయోజనాల వైపే మొగ్గు చూపాలి. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు అనేక తీర్పుల ద్వారా చెప్పింది.
►నిపుణుల కమిటీ, బోస్టన్ కన్సల్టెన్నీ గ్రూపు రిపోర్ట్, హైపవర్ కమిటీ రిపోర్ట్‌ల నివేదికలను ఆధారంగా చేసుకునే హేతుబద్ధమైన నిర్ణయం తీసుకున్నాం.
►పాలన వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతిలోనే ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయస్థానాలు ఉండాలని పిటిషనర్లు కోరడం న్యాయబద్ధం కాదు.
►ఇక.. చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో ఇటీవల పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై గతవారం విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
►విచారణను ఈ నెల 14కి వాయిదా వేస్తూ, అప్పటి వరకు కార్యాలయాల తరలింపుపై యథాతథస్థితి కొనసాగించాలని ఆదేశించింది.
►హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం తరపున పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి రామ మనోహరరావు కౌంటర్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను శుక్రవారం త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది.
Comments
Please login to add a commentAdd a comment