
సాక్షి, అమరావతి: అమరావతిని రాజధానిగా నిర్ణయించడం వెనుక గత పాలకులకు ఏమాత్రం సదుద్దేశం లేదని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. గత పాలకులు తీసుకున్న నిర్ణయాలు అహేతుకం, ఏకపక్షం, నిజాయితీ లోపించినవైతే, వాటిని తదుపరి పాలకులు కొనసాగించాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నారు. ఆర్థిక పరిపుష్టి కలిగిన కొంత మంది వ్యక్తులు అమరావతిలోని వనరులన్నింటినీ నియంత్రిస్తున్నారని తెలిపారు. వాళ్లే ఇప్పుడు రాజధాని అంశంలో కోర్టుల్లో పిటిషన్లు వేశారన్నారు. అమరావతి అందరి రాజధాని కాదని, ఆర్థిక పరిపుష్టి కలిగిన కొందరిది మాత్రమేనన్నారు. కొందరు ప్రైవేటు వ్యక్తులకు మరింత లబ్ధి చేకూర్చేందుకే అమరావతిని రాజధానిగా నిర్ణయించారే తప్ప, అందులో ఏ మాత్రం ప్రజాప్రయోజనాలు లేవని శ్రీరామ్ కోర్టు దృష్టికి తెచ్చారు.
40 శాతం మంది రైతులు తమ ప్లాట్లను ఆ ఆర్థిక పరిపుష్టి కలిగిన వ్యక్తులకు అమ్మేసుకున్నారని, వారే ఇప్పుడు రైతుల ముసుగులో ఆందోళన చేస్తున్నారని కోర్టుకు నివేదించారు. నిజమైన రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం పూర్తిగా కాపాడుతోందన్నారు. విస్తృత ప్రజాప్రయోజనాల నిమిత్తం పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. పిటిషనర్లు ఈ వ్యాజ్యాలు దాఖలు చేయడం ద్వారా గత పాలకుల తప్పులను ఈ ప్రభుత్వం కొనసాగించాలని ఒత్తిడి చేయదలిచారని వివరించారు. అమరావతిని రాజధానిగా నిర్ణయించడం వెనుక జరిగిన వ్యవహారాలన్నింటినీ ముందు కోర్టు తెలుసుకోవాలని, ఆ తర్వాత ఈ వ్యాజ్యాలను విచారించాలని కోరారు. గత ప్రభుత్వ అక్రమాలను పునరుద్ధరించేందుకు కోర్టు తన పరిధిని ఉపయోగించరాదన్నారు.
ప్రజల రాజధానికి ఉండాల్సిన లక్షణాలేవీ అమరావతికి లేవని వివరించారు. తమకు నచ్చిన నగరాన్ని రాజధానిగా ప్రకటించాలని, నిర్ణయించాలని పిటిషనర్లు కోరజాలరని తెలిపారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాలను కొట్టేయాలని కోరారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment