విభజన అంశాలపై 6న ప్రధానితో సీఎం భేటీ | YS Jagan meeting with Modi on 6th about Division Issues | Sakshi
Sakshi News home page

విభజన అంశాలపై 6న ప్రధానితో సీఎం భేటీ

Published Mon, Aug 5 2019 3:59 AM | Last Updated on Mon, Aug 5 2019 10:23 AM

YS Jagan meeting with Modi on 6th about Division Issues - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర పునర్విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంతోపాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రధాన అజెండాగా ఈ నెల 6, 7 తేదీల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఉండనుంది. మంగళవారం ఉదయం హస్తినకు బయలుదేరి వెళ్లనున్న సీఎం.. అదేరోజు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. బుధవారం రాష్ట్రపతితో పాటు పలువురు కేంద్ర మంత్రులతోనూ జగన్‌ సమావేశం అవుతారు. కాగా పునర్విభజన చట్టానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై ప్రధానికి ముఖ్యమంత్రి నివేదిక సమర్పించనున్నారు.

ఉత్తరాంధ్ర, రాయలసీమలోని ఏడు జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద నిధులు విడుదల చేయడంతో పాటు రెవెన్యూ లోటు భర్తీ, వైఎస్సార్‌ జిల్లాలో స్టీల్‌ ప్లాంటు, రాష్ట్రంలో ఓడరేవు ఏర్పాటు తదితర అంశాలను మోదీ దృష్టికి జగన్‌ తీసుకువెళ్లనున్నారు. అలాగే గోదావరి జలాలను శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు తరలించడం వెనుక ఉన్న లక్ష్యాలు, తద్వారా రైతాంగానికి కలిగే ప్రయోజనాలను వివరించనున్నారు.

పోలవరం ప్రాజెక్టు పనులకు రివర్స్‌ టెండర్‌ వల్ల ప్రజాధనం ఆదా అయ్యే విషయం, ప్రైవేట్‌ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలను కూడా ప్రధానికి వివరించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సూచనల మేరకు.. కేంద్ర ప్రభుత్వానికి నివేదించాల్సిన అంశాలపై ఆదివారం సచివాలయంలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం.. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లాల్సిన అంశాలపై నివేదిక రూపొందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement