సాక్షి,విశాఖ : ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) బుధవారం వైజాగ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) హయాంలో వచ్చిన పలు కీలక ప్రాజెక్ట్‌లపై ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
ప్రధాని మోదీ పర్యటనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారులతో సమీక్ష జరిపారు. సమీక్షలో ‘సాయంత్రం 4.15 గంటలకు ప్రధాని ప్రత్యేక విమానంలో విశాఖ (Visakhapatnam) కు చేరుకుంటారు. 5.30 గంటల వరకు రోడ్ షోలో పాల్గొంటారు. 5.30 గంటల నుంచి 6.45 గంటల వరకు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం సభా వేదిక వద్ద నుంచి వర్చువల్‌గా పలు శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేసి ప్రసంగిస్తారు. అనంతరం విశాఖ విమానాశ్రయానికి చేరుకుని భువనేశ్వర్ వెళతారు.’ అని సీఎస్ వివరించారు.
👉ముందస్తు షెడ్యూల్ ప్రకారం.. సీఎంగా వైఎస్ జగన్ తన హయాంలో రాష్ట్రానికి తెచ్చిన ప్రాజెక్ట్‌లకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్‌తో బల్క్ డ్రగ్ పార్క్,గ్రీన్ హైడ్రోజన్‌తో పాటు పలు పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయి. మోదీ ఇవాళ శంకుస్థాపన చేసే ప్రాజెక్ట్‌లలో ఇవే ప్రధానంగా ఉన్నాయి.
👉వైఎస్ జగన్ హయాంలో లక్ష 85 వేల కోట్ల విలువైన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఒప్పందం కార్యరూపం దాల్చింది. ఇందుకోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనకాపల్లి జిల్లా పుడిమడకలో 1200 ఎకరాల్లో ప్రాజెక్ట్ ఏర్పాటుకు కావలసిన అన్ని అనుమతులు మంజూరు చేసింది. ప్రధాని మోదీ నేడు శంకుస్థాపన చేయనున్న ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ 57 వేల మందికి ఉపాధి కలగనుంది.
👉ఇతర రాష్ట్రాలతో పోటీ పడి బల్క్ డ్రగ్ పార్క్‌ను వైఎస్ జగన్ రాష్ట్రానికి తెచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్‌కు ప్రధాని మోదీ చేతుల మీదగా శంకుస్థాపన జరగనుంది. రెండు వేల ఎకరాల్లో రూ.1876 కోట్ల రూపాయల ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. 17 రాష్ట్రాలు పోటీ పడగా దక్షిణ భారతదేశం నుంచి ప్రాజెక్టు సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నిలిచింది. గతంలో బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ ఇదే టీడీపీ వ్యతిరేకించింది.
👉ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి 10 నుంచి 15 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. 25 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనుంది. దీంతో పాటు గత ఏడాది జనవరిలో 52 ఎకరాల భూమిని రైల్వే జోన్ భవనాల నిర్మాణం కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం కేటాయించింది. రైల్వే జోన్ భవనాలకు ప్రధాని మోదీ నేడు శంకుస్థాపన చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment