Division issues
-
ఐదింటిపై పట్టు
సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఎనిమిదేళ్లవుతున్నా తెలుగు రాష్ట్రాల మధ్య విభజనకు సంబంధించి పలు సమస్యలు పరిష్కారం కాలేదు. కేంద్ర ప్రభుత్వం అడపాదడపా ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో సమావేశం నిర్వహించడం మినహా పరిష్కార మార్గాలను సూచించలేదు. తాజాగా కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అశిష్ కుమార్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్ధిక శాఖ ప్రత్యేక సీఎస్‌లు ఎస్ఎస్ రావత్, రామకృష్ణారావులతో ఏర్పాటైన ఉప కమిటీ గురువారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానుంది. ఇరు రాష్ట్రాల అధికారులతో పాటు ఏపీ పునర్విభజన విభాగం ముఖ్యకార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి దీనికి హాజరు కానున్నారు. విభజనకు సంబంధించి ఐదు పెండింగ్ అంశాలపై ప్రధానంగా సమావేశంలో చర్చించనున్నారు. గాజుల రామారంలో 270 ఎకరాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ (ఏపీఎస్ఎఫ్సీ) ఆస్తుల విభజనపై తొలుత అంగీకరించిన తెలంగాణ సర్కారు ఆ తరువాత మాట మార్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎస్‌ఎఫ్‌సీకి 2005–06లో ప్రభుత్వ ఈక్విటీ కింద డబ్బులకు బదులుగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా గాజుల రామారంలో ఎకరం రూ.40 లక్షల చొప్పున 270 ఎకరాలను కేటాయించింది. విభజన చట్టం ప్రకారం ఈక్విటీ జనాభా ప్రాతిపదికన ఇరు రాష్ట్రాలకు చెందాలి. తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఈ భూమిలో ఏపీకి వాటా ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉప కమిటీ సమావేశంలో ప్రస్తావించనుంది. కరెంట్ బకాయిలు ఏవి? రాష్ట్ర విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలకు ఏపీ జెన్కో విద్యుత్ సరఫరా చేసింది. 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు 8,890 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందచేసింది. దీనికి సంబంధించి ఏపీకి రూ.6,284 కోట్లను తెలంగాణ చెల్లించాల్సి ఉంది. ఈ విషయాన్ని తెలంగాణ డిస్కంలు కూడా అంగీకరించినా బకాయిలు మాత్రం చెల్లించలేదు. బకాయిలు వసూలు కాకపోవడంతో ఏపీ విద్యుత్ సంస్థలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పెండింగ్ విద్యుత్తు బిల్లులను తెలంగాణ ప్రభుత్వం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఉప కమిటీ సమావేశంలో కోరనుంది. హైదరాబాద్‌లో పన్నుల చెల్లింపులు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో ఏపీకి చెందిన పలు కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. పన్నులు కూడా హైదరాబాద్‌లోనే చెల్లించాయి. ఆ విధంగా ఏపీకి చెందిన సంస్థలు చెల్లించిన పన్నులు రూ.3,800 కోట్లు వరకు ఉంటాయి. ఈ మొత్తాన్ని ఇప్పించాలని ఏపీ ప్రభుత్వం కోరనుంది. మా వాటా మాటేమిటి? కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి విడుదలైన నిధుల్లో తమ వాటా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఆ నిధులను ఇప్పించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. అయితే తెలంగాణ నిధులు తమకు ఎలా వస్తాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఏపీ నిధులతో ధాన్యం సేకరణ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పౌర సరఫరాల సంస్థలకు ఒకే అధికారి పని చేశారు. ఈ సమయంలో తెలంగాణలో ధాన్యం సేకరణ కోసం ఏపీకి చెందిన రూ.400 కోట్లను వినియోగించారు. ఆ మొత్తాన్ని తెలంగాణ నుంచి ఇప్పించాలని ఆంధ్రప్రదేశ్ కోరుతోంది. అదే సమయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.600 కోట్ల సబ్సిడీ కూడా ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అశిష్ కుమార్ దృష్టికి తేనుంది. అజెండాలో ఐదు ప్రధానాంశాలు 1. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన 2. ఏపీజెన్కోకు తెలంగాణ డిస్కమ్‌లు చెల్లించాల్సిన విద్యుత్బకాయిలు 3. పన్ను అంశాలపై తలెత్తిన లోపాల పరిష్కారం 4. బ్యాంకులో ఉన్న నగదు, డిపాజిట్ల పంపిణీ 5. ఏపీఎస్సీఎస్సీఎల్, టీఎస్సీఎస్సీఎల్ మధ్య నగదు అంశం -
నేడు వైఎస్ జగన్, కేసీఆర్ భేటీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కె.చంద్రశేఖరరావు సోమవారం హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతి భవన్లో మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ భేటీలో ప్రధానంగా ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలు చర్చకు రానున్నాయి. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలే లక్ష్యంగా పలు అంశాలను పరస్పర చర్చల ద్వారా స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకోవాలని గతంలో వైఎస్ జగన్, కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
విభజన అంశాలపై 6న ప్రధానితో సీఎం భేటీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర పునర్విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంతోపాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రధాన అజెండాగా ఈ నెల 6, 7 తేదీల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన ఉండనుంది. మంగళవారం ఉదయం హస్తినకు బయలుదేరి వెళ్లనున్న సీఎం.. అదేరోజు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. బుధవారం రాష్ట్రపతితో పాటు పలువురు కేంద్ర మంత్రులతోనూ జగన్ సమావేశం అవుతారు. కాగా పునర్విభజన చట్టానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై ప్రధానికి ముఖ్యమంత్రి నివేదిక సమర్పించనున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని ఏడు జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద నిధులు విడుదల చేయడంతో పాటు రెవెన్యూ లోటు భర్తీ, వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంటు, రాష్ట్రంలో ఓడరేవు ఏర్పాటు తదితర అంశాలను మోదీ దృష్టికి జగన్ తీసుకువెళ్లనున్నారు. అలాగే గోదావరి జలాలను శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు తరలించడం వెనుక ఉన్న లక్ష్యాలు, తద్వారా రైతాంగానికి కలిగే ప్రయోజనాలను వివరించనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులకు రివర్స్ టెండర్ వల్ల ప్రజాధనం ఆదా అయ్యే విషయం, ప్రైవేట్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలను కూడా ప్రధానికి వివరించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సూచనల మేరకు.. కేంద్ర ప్రభుత్వానికి నివేదించాల్సిన అంశాలపై ఆదివారం సచివాలయంలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం.. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లాల్సిన అంశాలపై నివేదిక రూపొందించారు. -
విభజన సమస్యల పరిష్కారానికి కొత్త సబ్ కమిటీ
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల విభజన సందర్భంగా తలెత్తిన వివిధ సమస్యల పరిష్కారానికి కేంద్రం మరో ముందడుగు వేసింది. తాజాగా కేంద్ర హొంశాఖ సంయుక్త కార్యదర్శి కుమార్ అలోక్ నేతృత్వంలో ఓ సబ్ కమిటీని ఏర్పాటుచేసింది. సబ్ కమిటీ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్లను నియమించింది. అనిల్ కుమార్ సింఘాల్, శశాంక్ గోయల్‌తో పాటు ఏపీ, తెలంగాణ ఆర్థికశాఖ కార్యదర్శులైన ప్రేమ్‌చంద్రారెడ్డి, రామకృష్ణారావు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ సబ్ కమిటీ తొలి సమావేశం ఈ నెల 26న జరగనుంది. విభజన సమస్యలను 2 నెలల్లో కొలిక్కి తీసుకురావాలని కమిటీని కేంద్రం ఆదేశించినట్లు తెలుస్తోంది.