సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసే పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు అధికారంలో ఉండగా కమీషన్ల దాహంతో గందరగోళం చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఒక్క పోలవరం ప్రాజెక్టులోనే చంద్రబాబు అనేక కుంభకోణాలకు పాల్పడి తన అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చుకున్నారని చెప్పారు. శనివారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిపుణుల కమిటీతో భేటీ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో పోలవరం నిర్మాణంలో చోటు చేసుకున్న అక్రమాల గురించి వైఎస్ జగన్ ప్రస్తావించారు. ‘పోలవరంలో నామినేషన్‌దే డామినేషన్’ శీర్షికన ఈనెల 20వతేదీన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చదివి వినిపించారు. ఈ కుంభకోణంపై తొలుత విచారణ చేయాలని నిర్దేశించారు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ‘రివర్స్ టెండరింగ్’ ద్వారా కొత్త కాంట్రాక్టర్‌ను అక్టోబర్ నాటికి ఎంపిక చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నవంబర్ నాటికి కొత్త కాంట్రాక్టర్‌తో పోలవరం పనులను ప్రారంభించి శరవేగంగా పూర్తి చేస్తామని ప్రకటించారు.
నాలుగు నెలల్లోగా విచారణ పూర్తి కావాలి...
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని కేంద్రమే నిర్మించి అప్పగించాల్సి ఉండగా చంద్రబాబు కమీషన్ల కోసం ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి మరీ ప్రాజెక్టు బాధ్యతలను దక్కించుకున్నారని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ప్రణాళికా రాహిత్యం, చిత్తశుద్ధి లోపం, కమీషన్ల దాహంతో పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టులో స్పిల్ వే, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ప్రధాన జలాశయం) రెండు భాగాలుగా నిర్మించాల్సి ఉంటుందన్నారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్ పూర్తి చేసిన తర్వాత.. గోదావరి వరద ప్రవాహాన్ని వాటి మీదుగా మళ్లించే ఏర్పాట్లు పూర్తయ్యాక ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ కట్టడానికి వీలుగా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు నిర్మించాలని చెప్పారు. అయితే చంద్రబాబు అధికారంలో ఉండగా స్పిల్ వేను పూర్తి చేయకుండా కాఫర్ డ్యామ్‌ల పనులను హడావుడిగా ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఎగువ కాఫర్ డ్యామ్ పనులు 80 శాతం మేర, దిగువ కాఫర్ డ్యామ్ పనులు 60 శాతం మేర పూర్తి చేశారని, కానీ గోదావరికి వరదలు వచ్చే సమయం ఆసన్నమవడంతో వాటిని మధ్యలోనే ఆపేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. జూలై నుంచి అక్టోబర్ వరకు గోదావరికి భారీగా వరదలు రానున్నందున కాఫర్ డ్యామ్, స్పిల్ వే, స్పిల్ ఛానల్ మీదుగా మళ్లించాల్సి వస్తుందన్నారు. దీనివల్ల జూలై నుంచి అక్టోబర్ వరకూ నాలుగు నెలలపాటు పనులు చేయడానికి వీలు లేకుండా పోయిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సరైన ప్రణాళికతో పోలవరం పనులను చేపట్టి ఉంటే ఈ దుస్థితి దాపురించేది కాదన్నారు. పోలవరంలో చోటుచేసుకున్న అక్రమాలపై నాలుగు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని నిపుణుల కమిటీకి సూచించారు.
అక్రమాలకు కేంద్ర బిందువుగా పోలవరం..
పోలవరం జలాశయం(హెడ్ వర్క్స్) పనులను ఈపీసీ విధానంలో రూ.4,054 కోట్లకు దక్కించుకున్న ట్రాన్స్‌ట్రాయ్(జేవీ) ఒప్పందం ప్రకారం 2018 మార్చి నాటికే పనులు పూర్తి చేయాల్సి ఉందని నిపుణుల కమిటీతో భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సత్తాలేని రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌కి పనులు ఎలా అప్పగిస్తారంటూ ప్రతిపక్షంలో ఉండగా విమర్శలు చేసిన చంద్రబాబు ఆయన టీడీపీలో చేరగానే మాట మార్చారని దుయ్యబట్టారు. పోలవరం పనులను దక్కించుకున్న మరుసటి రోజే హెడ్ వర్క్స్ అంచనా వ్యయాన్ని చంద్రబాబు రూ.5,385.91 కోట్లకు పెంచేసి అక్రమాలకు కేంద్ర బిందువుగా మార్చేశారని చెప్పారు. పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించి 2018 ఫిబ్రవరి వరకు రూ.2,362.22 కోట్ల బిల్లులు చెల్లించి కమీషన్లు వసూలు చేసుకున్నారని మండిపడ్డారు. ట్రాన్స్‌ట్రాయ్‌తో ఈపీసీ ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండా ఎల్‌ఎస్‌ృఓపెన్ విధానంలో మరో కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. గేట్ల పనులను రూ.387.56 కోట్లకు బీకెమ్ సంస్థకు నామినేషన్‌పై అప్పగించారని చెప్పారు. ట్రాన్స్‌ట్రాయ్‌కి చెల్లించిన బిల్లులు, నామినేషన్ పద్ధతిలో అప్పగించిన పనుల విలువను పరిశీలిస్తే హెడ్ వర్క్స్ అంచనా వ్యయం రూ.5,825.15 కోట్లు అవుతుందన్నారు. సవరించిన అంచనా వ్యయం కంటే హెడ్ వర్క్స్ పనుల విలువ రూ.439.24 కోట్లు అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోందని ‘సాక్షి’ కథనాన్ని ప్రస్తావించారు.
కాలువల్లోనూ అక్రమాల ప్రవాహం..
అక్రమాలు హెడ్‌వర్క్స్‌కే పరిమితం కాలేదని, పోలవరం కుడి కాలువ పనుల అంచనా వ్యయాన్ని రూ.2,240.86 కోట్ల నుంచి రూ.4,375.77 కోట్లకు, ఎడమ కాలువ పనులు రూ.1,954.74 కోట్ల నుంచి రూ.3,645.15 కోట్లకు పెంచుతూ 2016 డిసెంబర్ 6వతేదీన చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేయించారని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. అనంతరం ఎడమ కాలువలో ఎనిమిది ప్యాకేజీల కాంట్రాక్టర్లపై 60 సీ నిబంధన కింద వేటు వేసి కమీషన్లు చెల్లించేవారికి నామినేషన్‌పై పనులు అప్పగించారని చెప్పారు.
వాస్తవాలు వెల్లడించండి..
అధికారులు నిపుణుల కమిటీకి సహకరించి పోలవరం ప్రాజెక్టులో అక్రమాలను బహిర్గతం చేయాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు. ‘అప్పట్లో చంద్రబాబు ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఆయన ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టారు. పోలవరం పనుల్లో చంద్రబాబు అక్రమాలకు సహకరించారు. కాంట్రాక్టర్ల నుంచి చంద్రబాబు భారీ ఎత్తున కమీషన్లు వసూలు చేసుకున్నారు. వాస్తవాలు చెప్పండి. మిమ్మల్ని (అధికారులను) రక్షించే పూచీ నాది. ప్రజాధనం ఆదా చేసిన వారిని ప్రజల సమక్షంలో సన్మానిస్తాం’ అని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. గత నాలుగేళ్ల పది నెలల వ్యవధిలో చంద్రబాబు పాలనలో సాగునీటి ప్రాజెక్టులపై చేసిన ఖర్చును సద్వినియోగం చేసుకుని ఉంటే ప్రాజెక్టులన్నీ పూర్తై కాలువల్లో నీళ్లు గలగలా పారుతుండేవని ముఖ్యమంత్రి చెప్పారు. చంద్రబాబు అక్రమాలకు పాల్పడటం వల్ల ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదన్నారు.
నివేదిక రాగానే రివర్స్ టెండరింగ్..
పోలవరం పనుల్లో జీవో 22, 63లను వర్తింపజేసి తాజా ధరల కంటే అధికంగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి చంద్రబాబు భారీ ఎత్తున కమీషన్లు వసూలు చేసుకున్నారని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. పోలవరం జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టు టెండర్లలో రూ.వెయ్యి కోట్లకుపైగా అవినీతి జరిగిందని స్పష్టం చేశారు. ఈ అక్రమాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని నిపుణుల కమిటీని ఆదేశించారు. నివేదిక రాగానే అంచనా వ్యయాన్ని అలానే ఉంచి రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పోటీ పడేలా నిబంధనలు రూపొందించి టెండర్లు పిలుస్తామన్నారు. తక్కువ ధరకు పనులు చేయడానికి ముందుకొచ్చిన కాంట్రాక్టర్లకు అప్పగించి తద్వారా ఆదా అయ్యే నిధులను ప్రజల కోసం వినియోగిస్తామని ప్రకటించారు. ప్రజాధనం ఆదా కావడానికి దోహదం చేసిన అధికారులు, నిపుణులను ప్రజల సమక్షంలో సన్మానిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment