దామాషా పద్ధతిన పంచాలి | Board to request Center on Krishna Water Distribution | Sakshi
Sakshi News home page

దామాషా పద్ధతిన పంచాలి

Published Wed, Aug 23 2017 3:13 AM | Last Updated on Sun, Sep 17 2017 5:51 PM

దామాషా పద్ధతిన పంచాలి

దామాషా పద్ధతిన పంచాలి

సాక్షి, హైదరాబాద్‌ : కృష్ణా నదిలో నీటి లభ్యత తగ్గినప్పుడు దిగువ రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించేలా దామాషా పద్ధతిలో నీటి పంపిణీ అమలయ్యేలా చూడాలని. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ణయించింది. దీనిపై కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించింది. తెలంగా ణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య కృష్ణా జలాల పంపిణీ, కృష్ణా బోర్డు వర్కింగ్‌ మాన్యువల్‌(కార్యనిర్వాహక నియమావళి) ముసాయిదా రూపకల్పన కోసం ఏర్పాటైన ఏకే బజాజ్‌ కమిటీకి సైతం ఈ లేఖను పంపనుంది. ఇక ఈ ఏడాది నీటి లభ్యత బాగా తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో నీటి ఎద్దడి నెలకొందని.. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, కర్ణాటక ప్రాజెక్టు ల నుంచి దిగువకు నీటిని విడుదల చేసేలా కేంద్ర జోక్యం ఆవశ్యకమని భేటీలో బోర్డు, తెలంగాణ, ఏపీలు అభిప్రాయపడ్డాయి.
 
ఎగువన భారీ వర్షాలు కురిసినా.. 
రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఏపీలోని అమరావతిలో మంగళవారం కృష్ణా బోర్డు సమావేశం జరిగింది. బోర్డు చైర్మన్‌ ఎస్‌కే శ్రీవాత్సవ, సభ్య కార్యదర్శి సమీర్‌ చటర్జీ, తెలంగాణ, ఏపీ జల వనరుల శాఖ కార్యదర్శులు ఎస్‌కే జోషి, శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీలు ఎం.వెంకటేశ్వరరావు, మురళీధర్‌లు ఇందులో పాల్గొన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లోని కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి.. కోయినా, ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాలు పూర్తిగా నిండాయని ఇరు రాష్ట్రాల అధికారులు బోర్డు దృష్టికి తీసుకువచ్చారు. అయినా దిగువకు నీటిని విడుదల చేయడం లేదని.. కేటాయించిన జలాలకన్నా అధికంగా వినియోగించుకుంటున్నాయని వివరించారు.

శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కనీస మట్టానికి మించి తగ్గిపోయాయని పేర్కొన్నారు. నీటి లభ్యత తగ్గిన సందర్భాల్లో.. దిగువ రాష్ట్రాలకు న్యాయం జరిగేలా దామాషా పద్ధతిలో నీటి పంపిణీని అమలు చేయాలంటూ కేంద్రానికి లేఖ రాయాలని బోర్డును కోరారు. ఈ ప్రతిపాదనతో ఏకీభవించిన బోర్డు చైర్మన్‌ శ్రీవాత్సవ.. కేంద్రానికి లేఖ రాస్తామని, అవసరమైతే స్వయంగా చర్చిస్తామని హామీ ఇచ్చారు. 
 
టెలిమెట్రీ మీటర్ల ఏర్పాటుపై విభేదాలు 
కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఇరు రాష్ట్రాల నీటి వినియోగం లెక్కలు తేల్చేందుకు తొలిదశలో 18 చోట్ల టెలిమెట్రీ మీటర్లను బోర్డు ఏర్పాటు చేయగా.. వాటిపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. తెలంగాణ పోతిరెడ్డిపాడు వద్ద అదనంగా టెలిమీటర్లను ఏర్పాటు చేయాలని కోరగా ఏపీ అంగీకరించింది. కానీ రెండో దశలో మరో 29 ప్రాంతాల్లో టెలిమీటర్ల ఏర్పాటు చేయాలన్న బోర్డు ప్రతిపాదనపై మాత్రం ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ఏర్పాటు చేసిన టెలిమీటర్‌ ద్వారా తమ నీటి వినియోగం లెక్కలు తేలాక.. వెలిగోడు, గాలేరు–నగరి, సోమశిల, కండలేరు జలాశయాల వద్ద టెలిమీటర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ, దిగువ కాలువ ద్వారా నీటి వినియోగం లెక్కలను తుంగభద్ర బోర్డు ఎప్పటికప్పుడు ప్రకటిస్తోందని.. అలాంటప్పుడు అక్కడ టెలిమీటర్ల ఏర్పాటు అనవసరమని పేర్కొంది. వీటితోపాటు ఏపీలోని మరో 17 ప్రాంతాల్లో టెలిమీటర్లు ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రతిపాదననూ ఏపీ వ్యతిరేకించింది. అసలు టెలిమీటర్ల ఏర్పాటుకు మార్గదర్శకాలు రూపొందించాలని.. ఆ తర్వాతే రెండో దశ టెలిమీటర్ల ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని సూచించింది. దీంతో టెలిమెట్రీ అంశాన్ని కొలిక్కి తెచ్చేందుకు వచ్చే నెల 18, 19 తేదీల్లో హైదరాబాద్‌లో సమావేశం కావాలని బోర్డు నిర్ణయించింది.
 
డీపీఆర్‌లు సమర్పించాలన్న బోర్డు
కృష్ణా పరీవాహక ప్రాంతంలో అనుమతి లేకుండా ప్రాజెక్టులు చేపట్టారంటూ ఏపీ, తెలంగాణలు ఒకరిపై ఒకరు కేంద్రానికి, బోర్డుకు ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ నేప థ్యంలో నెల రోజుల్లోగా ఆయా ప్రాజెక్టుల డీపీఆర్‌ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)లు ఇవ్వా లని ఇరు రాష్ట్రాల అధికారులను ఎస్‌కే శ్రీవాత్సవ కోరారు. ఇక చిన్ననీటి వనరుల కింద నీటి వినియోగాన్ని ఇప్పటికే ఏర్పాటు చేసిన సబ్‌కమిటీ తేల్చాలని ఇరు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చాయి. కృష్ణా బోర్డు నిర్వహణకు అయ్యే వ్యయాన్ని చెరి సగం భరించేందుకు ఆమోదం తెలిపాయి. అయితే 52 మంది సిబ్బందిని సమకూర్చాలన్న బోర్డు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ.. 25 మంది సిబ్బందికి ఓకే చెప్పాయి. కాగా ఏకే బజాజ్‌ కమిటీ నివేదిక మేరకే కృష్ణా బోర్డు వర్కింగ్‌ మ్యాన్యువల్‌ను ఖరారు చేయాలని ఇరు రాష్ట్రాలు చేసిన ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది.  
 
అదే నిష్పత్తిన పంపిణీ 
పునర్విభజన చట్టం మేరకు కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల చొప్పున చేసిన తాత్కాలిక సర్దుబాటు పంపిణీనే ఈ ఏడాది కూడా అమలు చేయాలని బో ర్డు నిర్ణయించింది. 812 టీఎంసీల కన్నా అధికంగా నీటి లభ్యత ఉంటే.. ఇదే నిష్పత్తిన ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేసా ్తమని పేర్కొంది. కేంద్రం దీనిని పునఃసమీక్షించే వరకు గానీ, బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ తీర్పు నోటిఫై అయ్యే వరకుగానీ ఇదే విధానం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement