న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)కి కేంద్రం మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. పోలీసు శాఖ, అఖిల భారత సర్వీసుల అధికారులు, వివిధ కేసుల విచారణ అనుమతులు వంటి కీలక అంశాలపై అధికారాలను కల్పించింది. ఈ మేరకు జమ్మూకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టం–2019కు హోం శాఖ సవరణలు చేపట్టింది.
ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం ఈ చట్టం చేసింది. ఇప్పటి వరకు పోలీసు, జైళ్లు, శాంతిభద్రతలు, అఖిల భారత సర్వీసులు, ఏసీబీలకు సంబంధించిన నిర్ణయాలపై జమ్మూకశ్మీర్ ఆర్థిక శాఖ నుంచి ఆమోదం పొందాకనే ఎల్జీ వద్దకు వచ్చేవి. తాజా నిబంధనల ప్రకారం..ఆయా సర్వీసులకు సంబంధించిన ఫైళ్లు ఇకపై చీఫ్ సెక్రటరీ నుంచి నేరుగా ఎల్జీ వద్దకే చేరుతాయి. అడ్వకేట్ జనరల్, ఇతర న్యాయాధికారుల నియామక అధికారాలు కూడా తాజాగా ఎల్జీకే దఖలు పడ్డాయి.
అధికారాలను హరించేందుకే..
కేంద్రం నిర్ణయంపై జమ్మూకశ్మీర్‌లోని రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికయ్యే ప్రభుత్వం అధికారాలను హరించేందుకే కేంద్రం ప్రయత్నిస్తోందని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ), పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ(పీడీపీ)లు ఆరోపించాయి. జమ్మూకశ్మీర్‌లో సెప్టెంబర్ 30వ తేదీలోగా అసెంబ్లీ ఎన్నికలు చేపట్టి, రాష్ట్రం హోదాను పునరుద్ధరించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించడం తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment