జరిమానాల షాక్
దొంగల్ని చేస్తున్నారంటున్న వినియోగదారులు
అదనపు విద్యుత్ భారానికే చార్జీలు వేస్తున్నామంటున్న అధికారులు
గుడ్లవల్లేరు : గత కాంగ్రెస్ ప్రభుత్వం సర్‌చార్జీల పేరుతో వాతలు పెడితే.. ప్రభుత్వ చంద్రబాబు ప్రభుత్వం అదనంగా కరెంట్ వాడారంటూ జరిమానాల్ని విధించి, రశీదుల్ని చేతిలో పెడుతోంది. గుడ్లవల్లేరు మండలంలో ఇటీవల అదనపు విద్యుత్ లోడులకు సంబంధించి రూ.2,50,800లను అధికారులు జరిమానాగా విధించారు. మండలంలో 14,500 సర్వీసులున్నాయి. ఇందులో 2,758లను ఆకస్మిక తనిఖీ చేసి అధిక లోడుల పేరుతో వినియోగదారులకు జరిమానాలు వడ్డించారు.
అభివృద్ధి పేరిట నెత్తిన భారం
ప్రభుత్వం తమను దొంగలుగా చిత్రీకరించి, జరిమానాలు వేయడం దారుణమని బాధిత వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాడుకున్న యూనిట్లకు అనుగుణంగా బిల్లులు చెల్లిస్తున్నా జరిమానాలు వేయడం దారుణమని ఖండిస్తున్నారు. సమాచార హక్కు చట్టం కింద ట్రాన్స్‌కో ఉన్నతాధికారుల్ని వివరణ కోరనున్నట్లు బాధిత వినియోగదారులు తెలిపారు. ఈ విషయమై ట్రాన్స్‌కో ఏఈ పేర్ని రవికుమార్‌ను వివరణ కోరగా అదనంగా విద్యుత్‌ను వాడటం వల్ల డెవలప్మెంట్ చార్జీల కింద సొమ్ము చెల్లించాలని రశీదులు ఇచ్చామని తెలిపారు.
ట్రాన్సకో చర్య దారుణం
ఏదో కరెంట్ చోరీ చేసినట్లుగా ఇళ్లపై ట్రాన్స్‌కో సిబ్బం ది తనిఖీలు నిర్వహించారు. రూ.2వేల కరెంట్ బిల్లు నెలకు తూచా తప్పకుండా చెల్లిస్తాం. కాని మేమేదో ఎక్కువ కరెంట్ వాడుతున్నామంటూ రూ.6,125 చెల్లించాలంటూ రశీదు చేతిలో పెట్టారు.
-కె.రామ్మోహనరావు, కౌతవరం పీఏసీఎస్ అధ్యక్షుడు
ఇవేం వసూళ్లు ?
ట్రాన్స్‌కో పోకడ అర్థం కావడం లేదు. అధికంగా కరెంటు వాడుతున్నామంటూ జరిమానా వేసి రూ.3,250లకు రశీదుని చేతిలో పెట్టారు. వారంలో చెల్లించకపోతే కరెంట్ తొలగిస్తామని చెబుతున్నారు. ఇదేమి అన్యాయమంటే ట్రాన్స్‌కో అభివృద్ధి అంటున్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఇదేంటో తేల్చుకుంటాం.
- కానూరి రాజేంద్రప్రసాద్, కౌతవరం
బడ్డీ కొట్టుకు రూ.2,550 జరిమానానా?
మా కొట్టుకు రూ.1,600 కరెంట్ బిల్లు వచ్చేది. మొన్న ఆకస్మిక తనిఖీల్లో రూ.2,550 కట్టాలంటూ రశీదు ఇచ్చారు. అది చెల్లించాలంటే నాకు అంత వ్యాపారం లేదు. కాని వారంలో చెల్లింకపోతే ఫీజులు పీకేస్తామని అంటున్నారు. ఏం చేయాలో దిక్కు తోచటం లేదు.
- కె.శ్రీశైలం, దుకాణదారుడు