నియోజక వర్గాల పెంపు 2026 తర్వాతే
పదేళ్ల తర్వాతే డీలిమిటేషన్..
♦ తెలుగు రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటుకు అప్పటివరకు ఆగాల్సిందే
♦ పలుమార్లు స్పష్టం చేసిన కేంద్ర న్యాయశాఖ
♦ టీడీపీ లోక్‌సభ పక్షనేత ప్రశ్నకు మంత్రి సదానంద స్పష్టీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శాసన సభ స్థానాల పెంపు ఉంటుందంటూ విస్తృతంగా ప్రచారం చేస్తూ అధికార పార్టీలు పార్టీ ఫిరాయింపులను యథేచ్ఛగా ప్రోత్సహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2026 వరకూ నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశమే లేదంటూ కేంద్ర ప్రభుత్వం ఒకటికి, నాలుగుసార్లు స్పష్టంచేసినప్పటికీ మంత్రులు, ముఖ్యమంత్రులు భిన్నంగా ప్రచారం చేయడంపై పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేందుకే ఈ ప్రచారం తప్ప డీలిమిటేషన్ సాధ్యం కాదంటూ స్పష్టంచేస్తున్నారు. గతంలో నియోజకవర్గాల పునర్విభజన కోసం జార్ఖండ్, తదితర రాష్ట్రాల్లో కూడా గట్టిగా డిమాండ్లు తలెత్తినా ఇది సాధ్యపడలేదని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ నియోజకవర్గాల పునర్విభజనపై ఏమంటుందో తేటతెల్లం చేసే రెండు ఉదంతాలను కేంద్ర న్యాయశాఖ వర్గాలు ఉటంకిస్తున్నాయి. సాక్షాత్తూ టీడీపీ లోక్‌సభ పక్ష నేత తోట నర్సింహం, టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత ఎ.పి.జితేందర్‌రెడ్డిలకు ఇచ్చిన సమాధానాల్లోనే ఈ విషయం స్పష్టంగా ఉందని చెబుతున్నాయి. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఈ అంశంపై నాలుగుసార్లు స్పష్టతనిచ్చిందని నిపుణులు చెబుతున్నారు. యూపీఏ హయాంలో జార్ఖండ్‌లో నియోజకవర్గాలను పెంచాలని ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదని గుర్తుచేస్తున్నారు. 2026 తరువాత తొలి జనాభా లెక్కలు ప్రచురించేంతవరకు పార్లమెంటు నియోజకవర్గాలు గానీ, అసెంబ్లీ నియోజకవర్గాలు గానీ పునర్విభజన చేపట్టే అవకాశం లేదని రాజ్యాంగ నిపుణులతోపాటు, కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా స్పష్టంచేస్తున్నారు. డీలిమిటేషన్‌పై కేంద్ర న్యాయశాఖ, హోంశాఖలు స్పష్టతనిచ్చిన ఉదాహరణలిలా ఉన్నాయి.
2026 తర్వాతేనన్న న్యాయశాఖ మంత్రి
‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు కోసం నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ప్రతిపాదించిందా? అలా చేస్తే ఆ వివరాలు ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏవైనా ఈవిషయంలో ప్రతిపాదనలు పంపాయా? పంపితే వివరాలు ఇవ్వండి. ప్రస్తుత పరిస్థితి ఏంటి?’ అని గత ఏడాది బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ లోక్‌సభ పక్ష నేత తోట నర్సింహం లోక్‌సభలో లిఖితపూర్వకంగా ప్రశ్నించారు. దీనికి న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడకు సమాధానమిస్తూ... ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 26 ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శాసన సభ స్థానాల పెంపు అనేది భారత రాజ్యాంగంలోని 170వ అధికరణకు లోబడి ఉంది. 2026 తరువాత వచ్చే మొదటి జనాభా లెక్కల ఆధారంగానే అసెంబ్లీ స్థానాల సర్దుబాటు ఉండాలని ఈ అధికరణ సూచిస్తోంది..’ అని స్పష్టంచేశారు.
2014లోనూ అదే సమాధానం...
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ రవీంద్ర కుమార్ పాండే 2014 ఆగస్టు 11న ఇదే తరహా ప్రశ్న సంధించారు. ‘జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాలు సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను కేంద్రం ప్రతిపాదించిందా? అలా అయితే ఎక్కడెక్కడ చేస్తున్నారు? ఆ వివరాలు ఇవ్వండి? ఒకవేళ లేనిపక్షంలో ఎందుకు లేదో చెప్పండి?’ అంటూ లోక్‌సభలో లిఖితపూర్వక ప్రశ్నలు సంధించారు. ‘భారత రాజ్యాంగంలోని 82, 170 అధికరణల ప్రకారం 2026 తరువాత తొలి జనాభా లెక్కలు ప్రచురించేంతవరకు పార్లమెంటు నియోజకవరా్గాలు గానీ, అసెంబ్లీ నియోజకవర్గాలు గానీ పునర్విభజన చేపట్టే అవకాశం లేదు. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం వద్ద ఎలాంటి ప్రతిపాదన కూడా పరిశీలన లో లేదు..’ అని అప్పటి న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టతనిచ్చారు.
హోం శాఖదీ అదే మాట
‘ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన మేరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం ఏదైనా ప్రతిపాదించింది? ఈ విషయంలో ఏదైనా ప్రక్రియ ప్రారంభమైందా? చట్ట సవరణపై ఏదైనా సలహా తీసుకుందా? అలాంటిదేదైనా ఉంటే వివరాలు ఇవ్వండి. పునర్విభజనలో జాప్యానికి గల కారణాలు తెలియజేయండి..’ అని టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత ఎ.పి.జితేందర్‌రెడ్డి, ఎంపీలు బి.వినోద్‌కుమార్, బూర నర్సయ్య గౌడ్ ఇదే అంశంపై 2015 ఏప్రిల్ 21వ తేదీన కేంద్ర హోం శాఖను లోక్‌సభలో ప్రశ్నలు సంధించారు. దీనికి హోం శాఖ సహాయ మంత్రి హరీభాయ్ పార్తీభాయ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-26 ప్రకారం ఆంధ్రప్రదేశ్ సీట్లను 175 నుంచి 225కు, తెలంగాణలో సీట్లను 119 నుంచి 153కు పెంచాలి. కానీ ఇది రాజ్యాంగంలోని 170వ అధికరణకు లోబడి జరగాలి. అయితే 2026 తరువాత వచ్చే తొలి జనాభాలెక్కల ప్రచురణ వరకు నియోజకవర్గాల పునర్విభజన సాధ్యం కాదని ఈ అధికరణ చెబుతోంది..’ అని స్పష్టం చేశారు.
రెండోసారి స్పష్టం చేసిన హోం శాఖ
టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ 2015 డిసెంబర్ ఎనిమిదో తేదీన అంటే దాదాపు నాలుగు నెలల కిందట... సెక్షన్-26 అమలుకు తీసుకున్న చర్యలేవని లోక్‌సభలో ఒక లిఖితపూర్వక ప్రశ్నను సంధించారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎస్సీ, ఎస్టీ స్థానాల రిజర్వేషన్లపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలేవో చెప్పాలని అడిగారు. ‘నియోజకవర్గాల పునర్విభజన ఆర్టికల్-170కి లోబడి ఉంది. ఆర్టికల్ 170(3) ప్రకారం 2026 తరువాత తొలి జనాభా గణన.. ప్రతి నియోజకవర్గంలో జనాభా సమీక్షకు ఒక ప్రాతిపదిక ఇస్తుంది. అందువల్ల ఎస్సీ, ఎస్టీ సీట్ల సర్దుబాటు కూడా తదుపరి డీలిమిటేషన్‌లోనే ఉంటుంది..’ అని కేంద్రహోం శాఖ సహాయ మంత్రి హరీభాయ్ పార్తీభాయ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
ఎన్నికల సంఘం ఏమంటోంది?
ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-26 ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపుపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని ‘సాక్షి’ సంప్రదించింది. కేంద్ర ఎన్నికల సంఘం న్యాయసలహాదారుగా దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఎస్.కె.మెండిరెట్ట దీనిపై స్పందిస్తూ ‘రాజ్యాంగం ప్రకారం 2026 వరకు నియోజకవర్గాల పునర్విభజనను తిరిగి తెరవరాదన్న అభిప్రాయానికి వచ్చిన హోం శాఖ, న్యాయ శాఖ.. ఇదే అభిప్రాయాన్ని ఎన్నికల సంఘానికి సూచించాయి. ఒకవేళ తమ అభిప్రాయాన్ని మార్చుకోదలిస్తే.. రాజ్యాంగానికి లోబడే చేయాలి..’ అని పేర్కొన్నారు. అందుకు రాజ్యాంగ సవరణ అవసరమని స్పష్టం చేశారు.