కలిసి నడుద్దామనుకున్న తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీలకు మధ్య విరిసిన స్నేహం మూన్నాళ్ల ముచ్చటే అవుతోంది. ఇరు పక్షాల మధ్య సీమాంధ్రలో ఎగిసిన విభేదాల నెగళ్ల ప్రభావం ‘తెలంగాణ’లోనూ కనిపిస్తోంది.
మనసులు కుదరక ఇక్కడా రెండూ పార్టీలు చెరో దారిన వెళ్తున్నాయి. ప్రచార పర్వంలో ఇది కొట్టొచ్చినట్లుగా ఉంది. దీంతో తెలుగుదేశం అభ్యర్థులు ఒంటరిగానే ముందుకెళ్తున్నారు. వాళ్లే అలా ఉంటే మేమేం తక్కువా అంటూ కమల దళం బెట్టుచేస్తోంది. బెడిసిన వ్యవహారం ఎటుదారితీస్తుందోనని రెండు పార్టీల అభ్యర్థులు, కేడరు ఆందోళన చెందుతున్నారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలుగుదేశం పార్టీ 2009 సాధారణ ఎన్నికల్లో తొమ్మిది అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుని జిల్లాపై పట్టు సాధించింది. కానీ ఐదేళ్లు తిరిగే సరికి పార్టీ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్ట పోయిన చందంగా తయారైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో వలసలు, తిరుగుబాట్లు పార్టీ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చాయి.
బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నా పొసగ క పోవడంతో ఒంటరిగా ప్రచార పర్వంలో దిగిన దేశం అభ్యర్థులు పడుతూ లేస్తూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల షెడ్యూలు వెలువడిన తర్వాత మార్చి 25న జిల్లా కేంద్రం మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రసంగించారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ అన్ని ప్రధాన పార్టీలు ముఖ్య నేతలను జిల్లాకు రప్పిస్తున్నాయి.
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే రెండు చోట్ల బహిరంగ సభల్లో పాల్గొన్నారు. 21న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, 22న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ మహబూబ్‌నగర్‌లో నిర్వహించే సభల్లో పాల్గొంటున్నారు. సీమాంధ్రలో తెలుగుదేశం, బీజేపీల పొత్తు రోజుకో మలుపు తిరుగుతుండటంతో నరేంద్ర మోడీ సభకు టీడీపీ కేడర్ హాజరు అనుమానంగానే కనిపిస్తోంది. క్షేత్ర స్థాయిలోనూ టీడీపీ, బీజేపీ కలిసి పనిచేస్తున్న ఘట్టం అరుదుగా కనిపిస్తోంది. టీడీపీ నాగర్‌కర్నూలు లోక్‌సభ నియోజకవర్గంతో పాటు ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించింది.
కొడంగల్‌లో టీడీపీ అభ్యర్థి రేవంత్‌రెడ్డి సొంత ఇమేజీని నమ్ముకుని ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీలో రెండు వర్గాలు ఉండటంతో వారిని వేర్వేరుగా ప్రచార పర్వంలో పాల్గొనేలా రేవంత్ తంటాలు పడుతున్నారు. మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డి ఇప్పటి వరకు నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు.
మక్తల్‌లో ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి టీడీపీ, బీజేపీ మధ్య సమన్వయం కోసం ప్రయత్నించినా సయోధ్య కుదరడం లేదు. బీజేపీ, టీడీపీ కార్యకర్తల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసినా మెజారిటీ బీజేపీ కార్యకర్తలు ముఖం చాటేశారు.
జడ్చర్లలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఒంటరిగా ప్రచారం చేసుకుంటున్నారు. సొంత పార్టీ కేడర్ ఇతర పార్టీల్లోకి వలస వెళ్లడంతో వ్యక్తిగత పరిచయాలపైనే ఆధార పడి ప్రచార వ్యూహం సిద్దం చేసుకుంటున్నారు.
నారాయణపేటలో టీడీపీ అభ్యర్థి రాజేందర్‌రెడ్డి పొత్తు ఉన్నా ఒంటరి ప్రచారం చేసుకుంటున్నారు. టికెట్ దక్కక పోవడంతో తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో వున్న రతంగ్ పాండు రెడ్డి తన ప్రచార రథంపై బీజేపీ ఎంపీ అభ్యర్థి నాగం జనార్దన్‌రెడ్డి ఫోటో, ఎన్నికల గుర్తును పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా తనకు, ఎంపీగా నాగంకు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు టీడీపీ అభ్యర్థి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.
దేవరకద్రలో ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి టీడీపీ కేడర్‌ను వెంటేసుకుని ప్రచారం చేసుకుంటున్నారు. రెండు పార్టీలు వేర్వేరు కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడంతో జనం ముక్కున వేలేసుకుంటున్నారు. నామమాత్రంగా వున్న బీజేపీ కేడర్ ఎంపీ అభ్యర్థి నాగం పక్షాన మాత్రమే ఓట్లు అడుగుతున్నారు.
వనపర్తిలో సిట్టింగ్ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి రెండు పార్టీలను సమన్వయం చేస్తున్నారు. త్రిముఖ పోటీ నెలకొనడంతో జనం స్పందన అంతంత మాత్రంగా కనిపిస్తోంది. ఓట్ల చీలికపైనే రావుల భారీగా ఆశ పెట్టుకుని లెక్కలు వేసుకుంటున్నారు. నాగర్‌కర్నూలు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి బక్కని నర్సింహులు ప్రచార పర్వంలో ఎక్కడా కనిపించడం లేదు.
ఆలంపూర్‌లో ఎమ్మెల్యే అబ్రహాం సానుభూతి ఓటుపై ఆధార పడి ప్రచారం ప్రారంభించారు. బీజేపీ కేడర్ ఎక్కడా ప్రచారంలో కనిపించడం లేదు.
అచ్చంపేటలో ఎమ్మెల్యే రాములు నియోజకవర్గంపై తనకున్న అవగాహనతో ప్రచార షెడ్యూలును అనుసరిస్తున్నారు. బీజేపీ కేడర్ ప్రచార పర్వంలో మొక్కుబడిగా కనిపిస్తోంది.
దారెటు..?
Published Sat, Apr 19 2014 3:18 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement