సాక్షి ప్రతినిధి,కడప: ఎన్నికలు సమీపించేకొద్దీ తెలుగుదేశం పార్టీకి ధీమా సడలుతోంది. అనైతిక కలయికలు, బీజెపీతో పొత్తు లాభిస్తాయనుకుంటే తద్భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి. అలుపెరగని ప్రజాపోరాటం, ప్రజల కోసం ఎంతటి కష్టాన్నైనా భరించే గుణం, దివంగత నేత చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పాలన వెరసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని జిల్లా వాసులు కోరుకుంటున్నారు. తద్వారా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎన్నికల్లో ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలుస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ గ్రాఫ్ పడిపోయిందంటూ నెల రోజుల క్రితం తెలుగుతమ్ముళ్లు గోబెల్స్‌ను మించి ప్రచారం చేపట్టారు. తద్వారా జనంలో గందరగోళం సృష్టించి లబ్ధి పొందాలన్న ఆశలు నెరవేరక డీలాపడ్డారు. పోలింగ్ సమీపించే కొద్దీ ఆపార్టీలో అభద్రాతాభావం అధికమైందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రచారంలో వారి ఊహలకు భిన్నంగా పరిస్థితులు ఎదురుకావడంతో అభ్యర్థులు డీలా పడుతున్నారు.
గెలుపు దేవుడెరుగు మర్యాద నిలుపుకునే స్థాయిలోనైనా ఓట్లు వస్తాయా.. గత ఉప ఎన్నికలలాగే డిపాజిట్లు గల్లంతు అవుతాయా.. అనే సందిగ్ధంలో తెలుగుదేశం నేతలు ఉన్నట్లు సమాచారం. అందుకు కారణం ఎన్నికలు ఏవైనా జిల్లాలో ప్రజాతీర్పు ఏకపక్షంగా ఉంటుండటమే. వైఎస్ కుటుంబం వెన్నంటే జిల్లా ప్రజానీకమని పలుమార్లు రుజువు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అదే ఆదరణ వైఎస్సార్‌సీపీ దక్కుతోందని ప్రచార పర్వంలోనే తెలుగుదేశం నేతలకు అర్థమైనట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. దానికి తోడు తెలుగుదేశం పార్టీ నేతల మధ్య అనైక్యత, అనైతిక కలయిక, బీజెపీతో ఎన్నికల పొత్తు ఇవన్నీ కూడా ప్రతిబంధకంగా నిలుస్తున్నాయని విశ్లేషకుల భావన.
గెలుపు దేవుడెరుగు...
పరువు నిలుస్తే చాలు..!
ప్రజాభిమానం పొందడంలో విఫలమైన తెలుగుదేశం పార్టీ అనైతిక కలయికలకు తెరలేపింది. ఎంతో కొంత యోగ్యకరంగా ఉంటుందని భావించిన నేతలకు మింగుడు పడని వ్యవహారంగా మారిందని విశ్లేషకుల భావన. అనేక రకాలుగా టీడీపీ అభ్యర్థులు ప్రచారాన్ని నిర్వహిస్తున్నా ప్రజాదరణ పొందడంలో విఫలమవుతున్నట్లు సమాచారం. ఆ కారణంగా గత ఉప ఎన్నికల్లో చోటుచేసుకున్న ఫలితాలు అనివార్యం కానున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వరుసగా తాను రెండు మార్లు ఓటమి చవిచూశానని, అయితే అప్పట్లో పరువు నిలుపుకునే ఓట్లు లభించాయని, ఇప్పుడు ప్రజల్లో ఏమాత్రం అభిమానం కన్పించడం లేదని ఓ అభ్యర్థి తన అంతరంగికుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పొత్తులు, వలస నేతల చేరికలు పార్టీకి ఏమాత్రం ఉపయోగకరంగా లేవని అనుచరుల వద్ద ఆ నాయకుడు వాపోయినట్లు సమాచారం.
వైఎస్సార్‌సీపీ దృష్టి అంతా
మెజార్టీపైనే..
ఎన్నికల్లో తలపడుతున్న వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థుల దృష్టి అంతా మెజార్టీపైనే ఉన్నట్లు పలువురు పేర్కొంటున్నారు. జిల్లా వర్గ రాజకీయాల్లో బలమైన నాయకులుగా గుర్తింపు పొందిన మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి, టీడీపీ పొలిట్‌బ్యూరో మాజీ సభ్యుడు కందుల రాజమోహన్‌రెడ్డితో పాటు, మాజీ ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వెంకటశివారెడ్డి, ఎమ్మెల్సీ షేక్ హుస్సేన్, డీసీసీ అధ్యక్షుడు మాకం అశోక్‌కుమార్ లాంటి నాయకులంతా వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు.
ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయంపై కాక మెజార్టీపై పందేలు కాస్తున్నట్లు తెలుస్తోంది. వాణిజ్య కేంద్రమైన ప్రొద్దుటూరులో ఇలాంటి పరిస్థితి అధికంగా ఉన్నట్లు పలువురు చెప్పుకొస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికలు సమీపించేకొద్దీ ప్రజానాడిని పసిగట్టినట్లు తెలుస్తోంది. మరో నాలుగు రోజులు ప్రచారపర్వంలో నెట్టుకొచ్చిగౌరప్రదమైన ఓట్లు దక్కించుకునేందుకు పోరాడాలనే దిశగా వారి చర్యలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్చ్... కష్టమే
Published Sat, May 3 2014 2:08 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement