ఫ్యాన్‌కు ఓటేశాడని వృద్ధుడి హత్య
* వైఎస్సార్ సీపీ దెందులూరు అభ్యర్థిపై దాడి
* అచ్చెన్నాయుడి ప్రోత్సాహంతో యువకుడిని కొట్టిన టీడీపీ కార్యకర్తలు
సాక్షి నెట్‌వర్క్: ఎన్నికల సందర్భంగా బుధవారం పలుచోట్ల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. పలు చోట్ల దౌర్జన్యాలకు పాల్పడ్డారు. దొంగ ఓట్లు వే యటానికి ప్రయత్నించిన వారిని నిలదీసి నందుకు చితక్కొట్టారు. ఫ్యాన్‌కు ఓటేశానన్న వృద్ధుడి మీద దాడిచేయటంతో అతడు అక్క డికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దాడులు, దౌర్జన్యాలకు తోడు టీడీపీ నేతలు, కార్యకర్తలు పోలింగ్ సమయంలోనూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేయాలని ప్రయత్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం రాయన్నపాలెంలో దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కారుమూరి వెంకటనాగేశ్వరరావుపై టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు.
ఈ దాడిలో కారుమూరి గన్‌మన్‌కు తీవ్రగాయాలయ్యాయి. కామవరపుకోట మండలం తడికలపూడిలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై ఏలూరు పార్లమెంటరీ టీడీపీ అభ్యర్థి మాగంటి బాబు దౌర్జన్యానికి పాల్పడ్డారు. గణపవరం మండలం అర్ధవరంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలను పోలీసులు కొట్టారు. పోలీసులు, కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనటంతో కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. పాలకొల్లు మండలం అరట్లకట్టలో టీడీపీ వారు ఓటర్లకు గిఫ్ట్‌కూపన్లు పంపిణీ చేశారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బడేటి బుజ్జి పోలింగ్ బూత్ వద్దే ప్రచారం నిర్వహించారు. పెరవలి మం డలం తీపర్రులో టీడీపీ నాయకులు నకిలీ నోట్లు పంచటంతో ఓటర్లు ఆందోళన చేశారు.
తూర్పు గోదావరి జిల్లాలో సీతానగరం మండలం ఇనగంటివారిపేటలో ఓటేసి వస్తున్న మెర్ల దశయ్య (70)ను టీడీపీ నాయకుడుమొగతడకల వెంకటమోహన్ ‘ఎవరికి ఓటేశావు’ అని అడిగాడు. ‘ఫ్యాన్‌కు వేశా’నని చెప్పడంతోనే వెంకటమోహన్ దుర్భాషలాడుతూ గుండెలపై మోదడంతో దశయ్య కుప్పకూలి మృతి చెందాడు. రామచంద్రాపురం మండలం నరసాపురపేట, కె.గంగవరం మండలం ఉడుమూడి, సుందరపల్లిల్లో దొంగ ఓట్లు వేస్తున్న తమ కార్యకర్తలను అడ్డుకుంటున్నారనే ఆగ్రహంతో టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ నాయకులపై దాడులకు దిగారు. సుందరపల్లికి చెందిన టీవీవీ సత్యనారాయణ, ఉడుమూడికి చెందిన సాదే వెంగళరావు, సాదే భద్రరావులకు తీవ్ర గాయాలయ్యాయి.
ఇదే కారణంతో రామచంద్రపురంలో వైఎస్సార్ సీపీ నాయకుడు కొండేపూడి సురేష్‌పై టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సోదరుడి కుమారుడు తోట బాబు, అతడి అనుచరులు దాడిచేసి తల పగులగొట్టారు. కోటనందూరు మండలం అగ్రహారంలో క్యూలైన్‌లో నిల్చుంటే ప్రచారం చేస్తున్నాడంటూ వైఎస్సార్ సీపీ కార్యకర్త రమణపై టీడీపీకి చెందిన బర్ల రాజు, యలమంచలి రమణ, మిరియాల మంగ దాడిచేసి గాయపరిచారు. వేట్లపాలెంలో ఓటేసి బయటకొచ్చి ‘ఫ్యాన్’ జోరుగా తిరుగుతోందన్న ఎస్సీ వర్గీయులపై టీడీపీ నాయకులు దాడి చేశారు. ఎస్సీలు ప్రతిదాడికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.
జ్యోతులపై దాడికి యత్నం
గండేపల్లి మండలం సింగరంపాలెంలో చనిపోయిన, పొరుగూరిలో ఉన్న వారి ఓట్లను కూడా టీడీపీ నాయకులు వేయిస్తుండడం గమనించిన వైఎస్సార్ సీపీ ఏజెంట్ అడ్డుకోవడంతో బలవంతంగా బయటకు పంపించేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జగ్గంపేట అసెంబ్లీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ పోలింగ్ బూత్‌కు చేరుకుని అధికారులను నిలదీశారు. ఇంతలో అక్కడకు వచ్చిన టీడీపీ నేతలు నెహ్రూను దూషిస్తూ దాడి చేయబోయారు. వైఎస్సార్‌సీపీ, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదంలో నెహ్రూ అనుచరుడు భూపాలపట్నం ప్రసాద్‌ను కిర్లంపూడి పోలీసులు అక్రమంగా నిర్బంధించారు.
కాకినాడలో సిటీ టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రోద్బలంతో ఏటిమొగకు చెందిన మత్స్యకారులు పెద్దసంఖ్యలో తమ ఓట్లు గల్లంతయ్యాయనే నెపంతో పోలింగ్ సిబ్బందిని రెండుగంటల పాటు నిర్బంధించారు. సాంబమూర్తినగర్‌లో వైఎస్సార్ సీపీ నేత, మాజీ కార్పొరేటర్ కొప్పుల విజయకుమారి ఇంట్లోకి కాంగ్రెస్, టీడీపీ నేతలు చొరబడి డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ దౌర్జన్యం చేయటంతో వైఎస్సార్ సీపీ వారు ఆందోళన చేశారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి చంద్రశేఖర రెడ్డి అక్కడికి చేరుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తొండంగి మండలం పెరుమాళ్లపురం పోలింగ్‌బూత్‌లో బూత్ లెవెల్ అధికారి.. ఓటర్ స్లిప్‌లు లేని వారికి పోలింగ్ స్టేషన్‌లోనే స్లిప్‌లు ఇస్తుండగా వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా పనిచేస్తున్నావంటూ టీడీపీ వారు ఆయనపై దౌర్జన్యానికి దిగారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తిర్లంగిలో మూడు నెలల కింద మరణించిన తన సోదరుడి ఓటు వేసేందుకు వచ్చిన టీడీపీ వర్గీయుడిని నిలదీసిన ఓ యువకుడిపై ఆ పార్టీ కార్యకర్తలు దాడిచేశారు. మరణించిన బంటాల శివ ఓటు వేసేందు కు అతడి తమ్ముడు యివ్వరాజు పోలింగ్ బూత్‌లోకి రాగా బగాది సురేష్ అనే యువకుడు నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన తెలుగు తమ్ముళ్లు సురేష్‌పై దాడి చేశారు. సురేష్ అక్కడికి కొద్దిదూరంలో గల బడ్డ బాబూరావు ఇంటికి వెళ్లిపోయాడు. తెలుగు తమ్ముళ్లు సురేష్‌ను బయటకు ఈడ్చుకొచ్చి మళ్లీ కొట్టారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న అచ్చెన్నాయుడు కార్యకర్తలను మరింత ఉసిగొల్పారు. దీంతో వారు.. సురేష్‌ను రక్షించుకునేందుకు వచ్చిన అతడి తల్లిదండ్రులు బగాది మల్లేసు, సుందరమ్మలపైనా దాడిచేశారు. గాయపడిన సురేష్‌ను టెక్కలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.