సాక్షి, తిరుపతి: జిల్లాలో అసెంబ్లీ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల తుది జాబితా సిద్ధమైనట్టు తెలిసింది. ఈ జాబితాలో తిరుపతి, సత్యవేడు, పీలేరు, పుంగనూరు స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించనున్నారు. పొత్తుల్లో భాగంగా తిరుపతి, రాజంపేట లోక్‌సభ స్థానాలు, మదనపల్లె అసెంబ్లీ సెగ్మెంట్ బీజేపీకి వదిలిన విషయం విదితమే. ఇవి కాకుండా తొమ్మిది అసెంబ్లీ, చిత్తూరు లోక్‌సభ స్థానాల అభ్యర్థులను రెండు విడతలుగా ప్రకటించారు.
మిగిలిన నాలుగు అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల ఎంపిక క్లిష్టంగా మారడంతో చంద్రబాబు వాటిపై సుదీర్ఘంగా కసరత్తు చేశారు. ముఖ్యంగా తిరుపతి, పుంగనూరు అసెంబ్లీ సెగ్మెంట్లలో టికెట్లు ఆశిస్తున్న వారిమధ్య పోటీ ఉంది. సత్యవేడు, పీలేరు నియోజకవర్గాలకు అభ్యర్థులు దొరకక జాప్యం చేశారు. తిరుపతి నుంచి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి చదలవాడ కృష్ణమూర్తితో పాటు ఇటీవల కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ, బోత్ ఆస్పత్రి మేనేజింగ్ డెరైక్టర్ పసుపులేటి హరిప్రసాద్ టికెట్ కోసం తీవ్రంగా పోటీపడ్డారు.
చివరికి మాజీ ఎమ్మెల్యేల పేర్లు మాత్రమే పరిశీలనకు రాగా వెంకటరమణ పేరు ఖరారు చేశారని తెలిసింది. పార్టీ అధికారంలోకి వస్తే చదలవాడకు ఏదో ఒక పదవి ఇస్తానని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో చదలవాడ వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు అంటిపెట్టుకుని పని చేస్తే ఇప్పుడు అవమానపరుస్తున్నారనే ఆవేదనతో ఉన్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇంకా హైదరాబాద్‌లోనే మకాం వేసిన చదలవాడ ్ణమూర్తి తిరుపతికి వచ్చిన తరువాత తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు.
మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఎవరికి టికెట్టు ఇచ్చినా మరొకరు పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో తిరుపతి టీడీపీ అభ్యర్థికి వెన్నుపోట్ల ప్రమాదం పొంచి ఉందని చెప్పకతప్పదు. ఈ పరిస్థితుల్లో డాక్టర్ హరిప్రసాద్ వైఖరి ఏంటనేది వేచి చూడాల్సిందే.
పీలేరు నుంచి మైనారిటీ అభ్యర్థి
మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరు నుంచి మైనారిటీ అభ్యర్థిని రంగంలోకి తెస్తున్నారు. టీడీపీ మైనారిటీ సెల్ జిల్లా ప్రధానకార్యదర్శి కాబ్లీ ఇక్బాల్ అహ్మద్ పేరును ఖరారు చేశారు. ఇక్కడ ద్వితీయశ్రేణి నాయకులు పోటీపడినప్పటికీ చివరికి ఇక్బాల్ అభ్యర్థిత్వంవైపే మొగ్గుచూపారు. టికెట్టు ఆశించిన ద్వితీయశ్రేణి నాయకులు ఎలా వ్యవహరిస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
రాజుకే పుంగనూరు
ఎడతెగని సంప్రదింపుల తరువాత పుంగనూరు నుంచి ఎం.వెంకటరమణరాజు పేరు ఖరారు చేశారు. కిందటి ఎన్నికల్లో కూడా ఆయన ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ స్థానం నుంచి ఎన్.శ్రీనాథరెడ్డి, ఆయన సతీమణి అనూషారెడ్డి టికెట్టు ఆశించారు. నాలుగు రోజుల తర్జనభర్జన తరువాత వెంకటరమణరాజు వైపు మొగ్గుచూపారు. దీంతో శ్రీనాథరెడ్డి వర్గీయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
సత్యవేడు నుంచి రాజేష్‌కృష్ణ
సత్యవేడు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి రాజేష్‌కృష్ణ పేరు దాదాపుగా ఖరారైనట్టు తెలిసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే హేమలత పట్ల పార్టీ శ్రేణుల్లోనూ ప్రజల్లోనూ వ్యతిరేకత ఉన్నట్టు సర్వేలు తేల్చడంతో కొత్త అభ్యర్థి కోసం అన్వేషించారు. ఇందులో తలారి మనోహర్, రాజేష్‌కృష్ణ పేర్లు పరిశీలనకు వచ్చాయి. రాజేష్‌కృష్ణ వైపే చంద్రబాబు మొగ్గుచూపారు. ఈయన తొలిసారిగా ఎన్నికల బరిలో దిగుతున్నారు,
ఇదీ ‘దేశం’తుదిజాబితా?
Published Wed, Apr 16 2014 4:52 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement