పోలింగ్‌కు సర్వం సిద్ధం: భన్వర్‌లాల్
* తెలంగాణ జిల్లాల్లో నేడు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ షురూ
* సాయంత్రం 6 గంటలకు లైన్‌లో ఉన్న అందరికీ ఓటు వేసే అవకాశం
* 16,512 కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్.. ప్రధాన కూడళ్లలో తెరలపై పోలింగ్ సరళి
* నేడు అన్ని సంస్థలకూ సెలవు.. అత్యవసర సేవల సంస్థలకూ ఒక షిఫ్ట్ సెలవు
* సెలవు ఇవ్వని యాజమాన్యాలపై కేసు నమోదు.. ఏడాది జైలు
* ఓటర్ గుర్తింపు కార్డు లేకపోతే 11 ప్రత్యామ్నాయ కార్డులతో ఓటు
* ఎగ్జిట్, ఓపీనియన్ పోల్స్‌పై నిషేధం.. ఓటెవరికి వేశారని అడగరాదు
* టీవీ, రేడియో, ఎస్‌ఎంఎస్‌ల ప్రచారంపై నిషేధం
* అందరూ ఓటు హక్కును వినియోగించుకోండి: సీఈఓ భన్వర్‌లాల్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని తెలంగాణ జిల్లాల్లో 17 లోక్‌సభ, 119 అసెంబ్లీ స్థానాలకు మరి కొద్ది గంటల్లో పోలింగ్ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామగ్రి, ఈవీఎంలతో మంగళవారం రాత్రి సిబ్బంది చేరుకున్నారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఐదేళ్లకోసారి వచ్చే ఓటు వేసే అవకాశాన్ని ఎవరూ జారవిడుచుకోకుండా ప్రతి ఒక్కరు మంచి అభ్యర్థికి ఓటు వేయాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులకు రెండు నిముషాల్లో ఓటు వేయచ్చునని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు వేయాలని సూచించారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు నిష్పక్షపాతంగా నిర్వర్తించాలని, ఉద్యోగ సంఘాలు తటస్థంగా వ్యవహరించాలని భన్వర్‌లాల్ సూచించారు.
ఎవరైనా పక్షపాతంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్‌కు ముందు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, డబ్బు పంపిణీని నిరోధించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను 4000కు పెంచామని, ఈ స్క్వాడ్స్ ద్వారా రాత్రిపూట గట్టి నిఘా పెట్టామని తెలిపారు. లక్షకు పైగా ఈవీఎంలను పోలింగ్‌కు వినియోగిస్తున్నామని, ఎక్కడైనా ఈవీఎంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే 20 నిముషాల నుంచి అరగంటలోగా మరో ఈవీఎం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రతి సెక్టార్ ఆఫీసర్ దగ్గర నాలుగేసి ఈవీఎంలు స్టాక్ ఉంటాయన్నారు. ఒక్క నిజామాబాద్‌లో 300 ఈవీఎంలు ఫ్యాక్టరీ మోడ్‌లోకి వెళ్లిపోయాయని, అక్కడ 200 ఈవీఎంలు మిగులు ఉండటంతో పోలింగ్ నిర్వహణకు సమస్యలేదని వివరించారు. సీఈఓ భన్వర్‌లాల్ మంగళవారం సచివాలయంలో సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పోలింగ్ నిర్వహణకు తీసుకున్న చర్యలను వివరించారు. ముఖ్యాంశాలివీ...
* తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు 265 మంది.. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,669 మంది పోటీలో ఉన్నారు.
* తెలంగాణ జిల్లాలోని నక్సలైట్ ప్రభావిత భూపాలపల్లి, ములుగు, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. 4 గంటల వరకు క్యూలో ఉన్నవారందరికీ ఎంత సమయమైనా ఓటు వేసే అవకాశం కల్పిస్తాం. అలాగే సిర్పూర్, చెన్నూరు, ఆసిఫాబాద్, ఖానాపూర్, మంథని, అచ్చంపేట, కోల్లాపూర్ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఈ నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు క్యూలో ఉన్నవారికి ఎంత సమయమైనా ఓటు వేసే అవకాశం కల్పిస్తాం. మిగతా 109 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు లైన్‌లో ఉన్నవారికి అర్ధరాత్రి వరకు అయినా ఓటు వేసే అవకాశం కల్పిస్తాం.
* పోలింగ్ నిర్వహణ, భద్రతా చర్యల్లో మూడున్నర లక్షల మంది సిబ్బందిని నియమించాం. 182 కంపెనీల కేంద్ర సాయుధ బలగాల వినియోగం. ప్రతి పోలింగ్ కేంద్రంలోను ముగ్గురేసి పోలీసులు విధులు. శాంతిభద్రతల పరిరక్షణలో 11,898 మంది రాష్ట్ర పోలీసు అధికారులు, 44,223 కానిస్టేబుళ్లు, 13,058 మంది హోంగార్డులు. మొత్తం 30,518 పోలింగ్ కేంద్రాల్లో 8,894 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తింపు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సాయుధ పోలీసులు నియామకం.
* తెలంగాణలో 16,512 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు. మండల, నియోజకవర్గ, సమీపంలోని పట్టణ కూడళ్లలో తెరలపై ఆయా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళి చూపిస్తారు. అభ్యర్థులు, పార్టీ నాయకులు, ప్రజలు పోలింగ్ సరళిని తెరలపై పరిశీలించవచ్చు. మిగతా పోలింగ్ కేంద్రాల్లో వీడియో చిత్రీకరణతో పాటు, స్టాటిక్ కెమెరాలు, మైక్రో పరిశీలకుల ఏర్పాటు.
* తెలంగాణలో బుధవారం అత్యవసర సేవలందించే ఆసుప్రతుల్లో సిబ్బందికి కూడా ఒక షిఫ్ట్ సెలవు ఇవ్వాలి. బుధవారం ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేట్ కంపెనీలు, పరిశ్రమలు, ఐటీ సంస్థలు, దుకాణాలన్నింటినీ సెలవు ప్రకటించాం. ఎవరైనా సెలవు ఇవ్వకపోతే ఆ యాజమాన్యంపై కేసు నమోదు చేస్తారు. ఏడాది పాటు జైలు శిక్షపడుతుంది.
* తెలంగాణ జిల్లా ఓటర్లలో ముగ్గురు ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు ఉన్నారు. తెలంగాణ జిల్లాల్లో మొత్తం ఓటర్లు సంఖ్య 2,81,74,055 ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 1,43,82,661 కాగా మహిళా ఓటర్లు సంఖ్య 1,37,81,276 ఉన్నారు, ఇతర ఓటర్లు 2,329 మంది ఉన్నారు. సర్వీసు ఓటర్లు మొత్తం 7,786 ఉన్నారు.
* అభ్యర్థులు కాని వారు పోలింగ్ రోజు సెక్యురిటీతో ఓటు వేయడానికే బయటకు వెళ్లాలి. ఓటు వేసి వచ్చి ఇంట్లో కూర్చోవాలి. అలా కాకుండా బయట తిరిగితే అలాంటి వారిని గృహ నిర్బంధం చేస్తారు. సెక్యూరిటీ గల అభ్యర్థుల వెంట 24 గంటలు షాడో బృందాలతో నిఘా ఏర్పాటు చేస్తారు.
* పోలింగ్ రోజు ఎగ్జిట్, ఓపీనియన్ పోల్ నిర్వహించరాదు. పోలింగ్ ముగిసే వరకు ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో, ఎస్‌ఎంఎస్‌లు, సామాజిక మీడియా ద్వారా ప్రచారం నిర్వహించరాదు. పోలింగ్ రోజు అభ్యర్థులను గానీ, ఓటర్లను గానీ ఎలక్ట్రానిక్ మీడియా ఇంటర్వ్యూలు చేయరాదు.
స్లిప్ లేకున్నా జాబితాలో పేరు ఉంటే ఓటు
‘‘ఓటర్ స్లిప్‌లు రాకపోయినా జాబితాలో పేరు ఉంటే వెళ్లి ఓటు వేయవచ్చు. గుర్తింపు కార్డు లేకపోయినా ఇతర గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకుని వెళ్లి ఓటు వేయవచ్చు. గుర్తింపు కార్డుగా పాస్‌పోర్టు, డ్రైవింగ్ లెసైన్స్, ఉద్యోగుల గుర్తింపు కార్డు, పాసు పుస్తకం, పాన్‌కార్డ్, ఆధార్ కార్డ్, ఉపాధి హామీ జాబ్ కార్డు, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, పెన్షన్ డాక్యుమెంట్, ఫొటో ఓటర్ స్లిప్, జనాభా గుర్తింపు కార్డు- వీటిలో ఏదైనా తీసుకెళ్లవచ్చు. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్ స్లిప్‌లతో బూత్‌స్థాయి ఆఫీసర్లు ఉంటారు. వారి నుంచి స్లిప్‌లు తీసుకోవచ్చు.
2 నిమిషాల్లోనే రెండు ఓట్లు
‘‘పోలింగ్ కేంద్రాల్లో తొలుత పార్లమెంటు అభ్యర్థులకు ఓటు వేసే కంపార్ట్‌మెంట్ ఉంటుంది. తెలుపు రంగు బ్యాలెట్ పార్లమెం టు అభ్యర్థికి ఉంటుంది. రెండో కంపార్ట్‌మెం ట్‌లో అసెంబ్లీ అభ్యర్థుల ఈవీఎం ఉంటుంది. గులాబి రంగు బ్యాలెట్ అసెంబ్లీ అభ్యర్థికి ఉంటుంది. రెండు నిముషాల్లో రెండు ఓట్లు వేయవచ్చు. ఓటు వేయగానే రెడ్ లైట్ వెలుగుతుంది. ఆ లైట్ వెలిగితే ఓటు నమోదైనట్లే.’’
6.30 గంటలకు మాక్ పోలింగ్
తెలంగాణలో 17 లోక్‌సభ, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 30,518 పోలింగ్ కేంద్రాల్లో బుధవారం ఉదయం 6.30 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఈ మాక్ పోలింగ్‌ను అభ్యర్థుల ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎన్నికల ఏజెంట్లందరూ ఉదయం 6.30 గంటల కల్లా పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉండాలి. ఆయా పోలింగ్ కేంద్రాల్లో వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో ఎవరికి ఓటు వేస్తున్నారో వారికే ఓటు పడుతోందో లేదో మాక్ పోలింగ్ ద్వారా నిర్థారించనున్నారు. ఒక్కో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంలో 50 ఓట్లు వేసి ఈ మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఎవరికి వేసిన ఓట్లు వారికే పడుతున్నట్లు నిర్థారణ అయిన తరువాత ఆ యంత్రాల్లో వేసిన ఓట్లను తొలగిస్తారు. ఆ తరువాత సీల్ వేసి ఉదయం 7 గంటలకు పోలింగ్‌ను నిర్వహిస్తారు.