ఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయం
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో చివరిదైన తొమ్మిదో దశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. మూడు రాష్ట్రాల్లోని 41 స్థానాల్లో సోమవారం పోలింగ్ జరుగనుంది. ఉత్తరప్రదేశ్‌లో 18 లోక్సభ స్థానాలు, పశ్చిమ బెంగాల్‌లో 17 స్థానాలు, బీహార్‌లో 6 స్థానాలలో పోలింగ్ జరుగుతుంది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ సహా 42 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న హిందువుల ఆధ్యాత్మిక నగరం వారణాసి స్థానం యావత్ దేశం దష్టిని ఆకర్షిస్తోంది. హిందువుల ఓట్లపై బీజేపీ గంపెడాశలు పెట్టుకుంది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని సుమారు 3 లక్షల మంది మైనారిటీలు ఉన్నారు.
మొత్తం 606 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని సుమారు 9 కోట్ల మంది ఓటర్లు నిర్దేశించనున్నారు. తొమ్మిదో దశ పోలింగ్‌తో సుమారు 35 రోజులపాటు జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు తెరపడనుంది. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లో మావోయిస్టుల హింసాత్మక ఘటనలు మినహా మొత్తంమీద గత ఎనిమిది దశల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఈ ఎనిమిది దశల్లో సగటున 66 శాతం పోలింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపు 16న జరుగనుంది.