పోలింగ్ 63 శాతం
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కీలకమైన మూడో విడత పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా గురువారం ప్రశాంతంగా ముగిసింది. 11 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 91 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ పూర్తయింది. అన్ని నియోజకవర్గాల్లోనూ గత లోక్‌సభ ఎన్నికలకన్నా ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మొత్తంగా ఈ విడతలో 63 శాతం పోలింగ్ నమోదవగా.. చండీగడ్‌లో అత్యధికంగా 74 శాతం పోలింగ్ నమోదయింది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ప్రాబల్యం గల బస్తర్ నియోజకవర్గంలో అతి తక్కువగా 51.4 శాతం పోలింగ్ నమోదైంది. ఛత్తీస్‌గఢ్, ఒడిషా, బీహార్‌లలో పలు చోట్ల నక్సల్ సంబంధిత హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. బీహార్‌లోని ముంగేర్ జిల్లాలో మావోయిస్టులు మందుపాతర పేల్చటంతో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతిచెందారు. లఖీసరాయ్ జిల్లాలో ఒక స్కూలు భవనాన్ని కూడా మావోయిస్టులు పోల్చివేశారు.
కీలకమైన రాష్ట్రాలివే...
దేశవ్యాప్తంగా మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ తొమ్మిది విడతల్లో పోలింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 7వ తేదీనే పోలింగ్ మొదలవగా.. తొలి, రెండో విడతల్లో కేవలం 13 లోక్‌సభ స్థానాలకు మాత్రమే పోలింగ్ పూర్తయింది. గురువారం జరిగిన మూడో విడత ఎన్నికల్లో ఏకంగా 91 స్థానాలకు పోలింగ్ ముగిసింది. 147 స్థానాలున్న ఒడిశా అసెంబ్లీలోని 70 స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించారు.
ఎన్నికల్లో గెలుపు కోసం హోరాహోరీగా పోరాడుతున్న అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలతో పాటు.. ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్‌వాది పార్టీ, బహుజన్ సమాజ్‌వాది పార్టీ, శివసేన, ఎంఎన్‌ఎస్, వామపక్షాలు, జనతాదళ్ (యునెటైడ్) తదితర పార్టీలకు ఈ మూడో విడత పోలింగ్ అత్యంత కీలకమైనది. గత ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటూ దక్కని.. కాంగ్రెస్‌కు అత్యధిక స్థానాలు అందించిన ఢిల్లీ, హర్యానా, కేరళల్లోని మొత్తం సీట్లకూ ఈ విడతలో ఎన్నికలు ముగిశాయి. మొత్తం 9 విడతల పోలింగ్ ముగిశాక 543 స్థానాల్లోనూ మే 16వ తేదీన ఒకేసారి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుందన్న విషయం తెలిసిందే.
దేశ రాజధాని ఢిల్లీలోని మొత్తం 7 లోక్‌సభ స్థానాలు, కేరళలోని మొత్తం 20 స్థానాలు, హర్యానాలోని మొత్తం 10 స్థానాలకూ పోలింగ్ పూర్తయింది. వీటితో పాటు.. ఉత్తరప్రదేశ్‌లో 10, మహారాష్ట్రలో 10, ఒడిషాలో 10, మధ్యప్రదేశ్‌లో 9, బీహార్‌లో 6, జార్ఖండ్‌లో 4, ఛత్తీస్‌గఢ్‌లో 1, చండీగఢ్ 1, లక్షద్వీప్ 1, అండమాన్ నికోబార్ దీవి 1, జమ్మూ 1 లోక్‌సభ స్థానాలకు గురువారం పోలింగ్ ముగిసింది.
మొత్తం 91 లోక్‌సభ స్థానాల్లో 1,40,850 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు బారులు తీరారు. దాదాపు 11 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఢిల్లీలో 64 శాతం పోలింగ్ నమోదైంది. ఇది 2009లో కంటే 12 శాతం ఎక్కువ.
ఒడిశాలో 67%, మహారాష్ట్రలో 62.3%, బీహార్‌లో 53%, అండమాన్, నికోబార్ దీవుల్లో 70 శాతం, లక్షద్వీప్‌లో 71.34 శాతం నమోదైంది.
కేరళలో ప్రస్తుతం 73.4 శాతం పోలింగ్ నమోదైంది. 2009లో 73.37 శాతం.
హర్యానాలో ఇప్పుడు 65%పోలింగ్ నమోదైంది. 2009లో 68 శాతం పోలైంది.
ఉత్తరప్రదేశ్‌లో గురువారం పోలింగ్ జరిగిన 10 లోక్‌సభ నియోజకవర్గాల్లో రికార్డు స్థాయిలో 65 శాతం పోలింగ్ నమోదైంది. గత ఏడాది ఇక్కడ కేవలం 51.30 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. యూపీలో గత ఏడాది ఆగస్టులో మత ఘర్షణలు చోటుచేసుకున్న ముజఫర్‌నగర్, షామిలి నియోజకవర్గాల్లో సగటు పోలింగ్ శాతం కన్నా కొంచెం ఎక్కువగా ఉంది. ముజఫర్‌నగర్‌లో 67.78 శాతం, షామిలిలో 70.85 శాతం పోలింగ్ నమోదైంది.
జార్ఖండ్‌లోని నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లో 58 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ గత ఎన్నికల్లో 50.89 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది.
మధ్యప్రదేశ్‌లో 9 సీట్లలో 54.13 శాతం పోలింగ్ నమోదైంది.
జమ్మూకాశ్మీర్‌లోని జమ్మూ లోక్‌సభ స్థానంలో 66.29 శాతం పోలిం
నమోదైంది. ఇది 2009 ఎన్నికలకన్నా 17 శాతం ఎక్కువ.
బీహార్‌లో 22 ప్రాంతాలకు ఎన్నికల సిబ్బందిని భద్రతా కారణాల రీత్యా పంపించకపోవటంతో.. ఆ ప్రాంతాల్లో పోలింగ్‌ను వాయిదా వేయాలని ఈసీ నిర్ణయించింది. ఇక్కడ పోలింగ్ ఎప్పుడు నిర్వహించేదీ త్వరలో నిర్ణయిస్తారు.
ఈ విడత ఎన్నికల్లో బరిలో ఉన్న 1,418 మందిలో లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, కేంద్ర మంత్రులు కపిల్ సిబల్, కమల్‌నాథ్, బీజేపీ నేత గడ్కారీ, ఆరెల్డీ నేత అజిత్ సింగ్, సినీతారలు జయప్రద, నగ్మా తదితర ప్రముఖులు ఉన్నారు.