92 లోక్సభ స్థానాలకు కొనసాగుతున్న పోలింగ్
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల సమరం మరింత రసవత్తరంగా మారింది. చిన్న రాష్ట్రాల్లో ఓటింగ్ ముగియడంతో పెద్ద రాష్ట్రాల్లో పోలింగ్ పర్వానికి తెరలేచింది. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలతో పాటు మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 92 లోక్‌సభ స్థానాలకు గురువారం పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందు ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎండాకాలం కావడంతో ఉదయాన్నే ఓటుహక్కు వినియోగించుకునేందుకు ప్రజలు భారీగా తరలి వస్తున్నారు.
మూడో దశలో దేశ రాజధాని ఢిల్లీ, కీలకమైన ఉత్తరప్రదేశ్‌లతో పాటు హర్యానా, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, జమ్మూకాశ్మీర్, ఛండీగడ్, లక్ష ద్వీప్, అండమాన్ నికోబార్‌లలో ఎన్నికలు జరుగుతున్నాయి. అత్యధికంగా ఢిల్లీలో అన్ని స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా కేరళలో 20 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. ఢిల్లీ, హర్యానాల్లోబీజేపీ-కాంగ్రెస్-ఆప్ మధ్య ముక్కోణపు పోటీ ఉండగా ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ-సమాజ్‌వాదీ-బీఎస్పీ-కాంగ్రెస్-ఆప్ మధ్య బహుముఖ పోటీ నెలకొంది.
మహారాష్ట్రలో కాంగ్రెస్, బీజేపీ కూటమి, బీహార్‌లో జేడీయూ, కాంగ్రెస్, బీజేపీ కూటములు తలపడుతున్నాయి. లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, కమల్‌నాథ్ సహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ సహా సినీ ప్రముఖులు నగ్మా, జయప్రద, కిరణ్‌ఖేర్, రాజ్ బబ్బర్‌లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
సార్వత్రిక ఎన్నికలు, లోక్సభ, పోలింగ్, ఎన్నికలు, elections 2014, lokh sabha, polling, elections