అమరులకు సలాం..!
అంబాలా/బెంగళూరు: పఠాన్‌కోట్‌లో పాక్ ముష్కరులతో పోరాడి అమరులైన జవాన్లకు జనం కన్నీటి వీడ్కోలు పలికారు. సైనిక లాంఛనాల మధ్య వారికి అంత్యక్రియలు నిర్వహించారు. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు వదిలిన గరుడ్ కమాండో గురుసేవక్ సింగ్ భౌతిక కాయాన్ని సోమవారం ఆయన సొంతూరు హర్యానాలోని అంబాలా సమీపంలోని గర్నాలాకు తీసుకువచ్చారు. పార్థివ దేహాన్ని చూడగానే కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. గురుసేవక్‌కు నవంబర్‌లోనే వివాహమైంది. ఆయన అంత్యక్రియల్లో హర్యానా మంత్రులు అనిల్ విజ్, అభిమన్యులతోపాటు ఆర్మీ, పోలీసు, వైమానిక దళాధికారులు పాల్గొన్నారు.
► పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదుల గ్రెనేడ్‌ను నిర్వీర్వం చేస్తుండగా అది పేలడంతో ప్రాణాలు కోల్పోయిన లెఫ్టినెంట్ కల్నల్ ఇ.కె. నిరంజన్ భౌతికకాయాన్ని బెంగళూరులోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ సందర్శించి నివాళులర్పించారు. నిరంజన్ కుటుంబానికి సీఎం రూ.30 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. తర్వాత నిరంజన్ పార్థివదేహాన్ని ఆయన స్వస్థలమైన కేరళలోని పాలక్కడ్‌కు తరలించారు. ‘నా కొడుకు త్యాగానికి నేను గర్విస్తున్నా..’ అని చెమర్చిన కళ్లతో నిరంజన్ తండ్రి శివరంజన్ చెప్పారు. 32 ఏళ్ల నిరంజన్‌కు భార్య, 18 నెలల కూతురు ఉన్నారు.
► ఉగ్రవాదుల తూటాలకు బలైన సుబేదార్ ఫతేసింగ్(51) పార్థివదేహాన్ని పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు తీసుకువచ్చారు. షూటింగ్‌లో మంచి ప్రతిభ గల ఫతేసింగ్ కామన్‌వెల్త్ క్రీడల్లో దేశానికి పతకాలు సాధించిపెట్టారు. జవాన్లతో కలిసి ఫతేసింగ్ కూతురు మధు తన తండ్రి భౌతికకాయాన్ని మోయడం అందరూ కన్నీటిపర్యంతమయ్యారు. ఝాన్‌దేవాల్ కుర్ద్ గ్రామంలోని ఫతేసింగ్ కుటుంబసభ్యులను సోమవారం పంజాబ్ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్ కలిసి పరామర్శించారు.
► ఉగ్రవాద దాడిలో కన్నుమూసిన మరో అమరుడు హావిల్దార్ కుల్వంత్‌సింగ్‌కు పంజాబ్‌లోని ఆయన సొంతూరు చాక్ షరీఫ్ గ్రామంలో సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. కుల్వంత్ సింగ్ కుటుంబీకులను సైతం సీఎం బాదల్ కలసి పరామర్శించారు.
► ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన హవీల్దార్ సంజీవన్ సింగ్ రానా(50) అంత్యక్రియలు ఆయన స్వస్థలం కంగ్రా జిల్లా సియన్ గ్రామంలో, హవీల్దార్ జగదీశ్ చంద్(58) అంత్యక్రియలు చంబా జిల్లా గోలా గ్రామంలో సైనిక లాంఛనాలతో నిర్వహించారు. వీరిద్దరి కుటుంబాలకు రూ.20 లక్షల ఆర్ధిక సాయం అందిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం వీర్‌భద్రసింగ్ ప్రకటించారు. లాన్స్ నాయక్ మూల్ రాజ్ అంత్యక్రియలను ఆయన సొంతూరైన జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని సాంబా జిల్లా జాఖ్ గ్రామంలో నిర్వహించారు.
అమర జవాన్లు
ఉగ్రవాదులతో కాల్పుల్లో ఒక గరుడ్ కమాండో, ఒక ఎన్‌ఎస్‌జీ అధికారి, ఐదుగురు డిఫెన్స్ సెక్యూరిటీ కోర్(డీఎస్‌సీ) సిబ్బంది మరణించారు. మరో 17 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు.
► గురుసేవక్ సింగ్ - గరుడ్ కమాండో
► ఇ.కె. నిరంజన్ -లెఫ్టినెంట్ కల్నల్ (ఎన్‌ఎస్‌జీ)
► ఫతేసింగ్- సుబేదార్ మేజర్ (డీఎస్‌సీ)
► మూల్ రాజ్-లాన్స్ నాయక్(డీఎస్‌సీ)
► సంజీవన్ సింగ్-హవల్దార్(డీఎస్‌సీ)
► జగదీశ్ చంద్- హవల్దార్ (డీఎస్‌సీ)
► కుల్వంత్ సింగ్- హవల్దార్ (డీఎస్‌సీ)