సాక్షి, హైదరాబాద్: ఆయనో హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి. కక్షిదారులు దాఖలు చేసే వ్యాజ్యాల్లో న్యాయాన్యాయాలపై తీర్పులిస్తుంటారు. అటువంటి న్యాయమూర్తే ఇప్పుడు న్యాయం కోసం ఓ సాధారణ కక్షిదారుగా మారారు. న్యాయం చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. తన పుట్టిన తేదీని సరిదిద్దే విషయంలో చర్యలు తీసుకోవాలంటూ తాను పెట్టుకున్న వినతులపై స్పందించడం లేదంటూ అటు రాష్ట్రపతి కార్యాలయంపై, ఇటు కేంద్ర న్యాయశాఖపైనే పిటిషన్ దాఖలు చేశారు. ఆయనే ఇటీవల సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన న్యాయమూర్తి జస్టిస్ బులుసు శివశంకరరావు. నేను వాస్తవంగా పుట్టింది 29.3.1959 కాగా.. రికార్డుల్లో అది 10.4.1957గా నమోదైంది.
ఈ తప్పును సరిదిద్దాలని కోరుతూ గత 2 దశాబ్దాలుగా అధికారులకు విజ్ఞప్తి చేస్తూ వచ్చాను. 1996 నుంచి అనేక వినతిపత్రాలు ఇచ్చాను. హైకోర్టు జడ్జి అయిన తర్వాత హైకోర్టు ద్వారా కూడా వినతిపత్రాలు పంపాను. అయితే ఇప్పటివరకు నా పుట్టిన తేదీని సరిచేసే విషయంలో చర్యలు తీసుకోలేదు. రాష్ట్రపతి సెక్రటేరియట్‌కు సైతం వినతిపత్రం పంపాను. అయినా నా పుట్టిన తేదీని సరిచేయలేదు. ఎన్ని వినతిపత్రాలు పెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో విధి లేక ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేస్తున్నాను. అందువల్ల నేను పెట్టుకున్న వినతిపత్రాలపై తగిన నిర్ణయం తీసుకునేలా ప్రతివాదులను ఆదేశించండి.’అని న్యాయమూర్తి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇందులో రాష్ట్రపతి కార్యాలయ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు.
న్యాయం కోసం న్యాయస్థానానికి న్యాయమూర్తి
Published Tue, Feb 26 2019 1:47 AM | Last Updated on Tue, Feb 26 2019 1:47 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment