హైకోర్టు విభజనపై మళ్లీ కదలిక
- ఏడాది తర్వాత విచారణకు వచ్చిన తెలంగాణ పిటిషన్
- ఏపీ ఏజీ లేకపోవడంతో విచారణ 21కి వాయిదా
- నిధుల కేటాయింపులపై పూర్తి వివరాలు సమర్పించండి
- కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టును విభజించాలంటూ ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై మళ్లీ కదలిక మొదలైంది. ఏడాది కాలంగా విచారణకు నోచుకోని పునఃసమీక్ష పిటిషన్లపై ఎట్టకేలకు మళ్లీ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. హైకోర్టు విభజనపై గతేడాది మే 1న అప్పటి ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పు ను పునఃసమీక్షించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, న్యాయవాది కె.రవీందర్‌రెడ్డి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై విచారణ ఈ నెల 21కి వాయిదా పడింది. శుక్రవారం జరిగిన విచారణకు ఏపీ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ అందుబాటులో లేకపోవడంతో హైకోర్టు ఈ వ్యా జ్యాలపై విచారణను వా యిదా వేసింది. ఈ మేర కు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ నాటి కి ఈవ్యవహారంలో పూర్తి వివరాలను కోర్టు ముం దుంచాలని కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజన్‌కు స్పష్టం చేసింది.
గత తీర్పులో ఏం చెప్పారు?
హైకోర్టు విభజనలో జాప్యం జరుగుతోందంటూ హైదరాబాద్‌కు చెందిన ధనగోపాల్‌రావు అనే వ్యక్తి హైకోర్టులో గతంలో ప్రజా ప్రయోజన వ్యా జ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ పిల్ విచారణ సమయంలో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు విభజన కోసం కొన్ని ప్రతిపాదనలను ధర్మాసనం ముందుంచింది. ప్రస్తుత హైకోర్టును ఏపీకి వది లేసి, తెలంగాణ హైకోర్టును మరోచోట ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. వాదనలను విన్న అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం గతేడాది మే 1న తీర్పు వెలువరించింది. ఏపీ హైకోర్టు ఏపీ భూభాగంలోనే ఉండాలని చెప్పింది. ఏపీ హైకోర్టును తెలంగాణలో ఏర్పా టు చేసేందుకు చట్టం అనుమతించడం లేదని పేర్కొంది. ఏపీ హైకోర్టు ఏర్పాటుకు కొంత సమయం పట్టినా అది శాశ్వత ప్రతిపాదకనే ఉండాలని తీర్పులో పేర్కొంది.
తీర్పులో తప్పిదాలున్నాయన్న తెలంగాణ
అయితే ఈ తీర్పులో కొన్ని తప్పిదాలు చోటు చేసుకున్నాయని, ఆ తీర్పును పునఃసమీక్ష చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గతేడాది జూలైలో అనుబంధ పిటిషన్ వేశారు. తీర్పు పునర్విభజన చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ న్యాయవాది రవీందర్‌రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 31(2) ప్రకారం ఏపీ హైకోర్టు ప్రధాన కేంద్రం ఎక్కడ ఉండాలన్న దాన్ని రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా నిర్ణయిస్తారని, అయితే ఈ సెక్షన్ ఓ నిర్దిష్ట ప్రదేశంలోనే ఉండాలని చెప్పడం లేదని, ఈ విషయంలో రాష్ట్రపతి అధికారాలను ఆ సెక్షన్ నియంత్రించడం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ధర్మాసనం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా తప్పు చేసిందన్నారు.
కేంద్రం, ఏపీకి గతంలోనే నోటీసులు
ఈ వ్యాజ్యాలపై గత ఏడాది జూలై 31న హైకోర్టు విచారణ జరిపింది. ఇందులో ప్రతి వాదులుగా ఉన్న కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పలువురు న్యాయవాదులకు నోటీసులు జారీ చేసిం ది. అప్పటి నుంచి ఆ వ్యాజ్యాలు విచారణకు నోచుకోలేదు. శుక్రవారం ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా.. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది డి.రమేశ్ స్పందిస్తూ ఈ కేసులో అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హాజరవుతారని తెలిపారు. ఆయన కృష్ణా ట్రిబ్యునల్ ముందు వాదనలు విని పించేందుకు వెళ్లారని, ఈ నెల 14, 15 తేదీల్లో కూడా అందుబాటులో ఉండరని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అందువల్ల అనుబంధ పిటిషన్లపై విచారణను వాయిదా వేయాలని కోరారు. ఈ సమయంలో రవీందర్‌రెడ్డి తరఫు న్యాయవాది గండ్ర మోహనరావు స్పందిస్తూ పార్లమెంట్ సమావేశాలకు ముందే వీటిపై విచారణ పూర్తి చేయాలని కోరగా దీనికి ధర్మాసనం నిరాకరించింది. విచారణను తొలుత ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది. అయితే అదనపు సొలిసిటర్ జనరల్ అభ్యర్థన మేరకు 21కి మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.