రాష్ట్రపతి ఉత్తర్వులు.. కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్
- 21 లేదా 22న ప్రమాణం... 33కి చేరనున్న న్యాయమూర్తులు
- హైకోర్టు న్యాయమూర్తిగా తొలిసారి జిల్లా కోర్టు న్యాయవాది
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులుగా దూర్వాసుల వేంకట సూర్యనారాయణ సుబ్రహ్మణ్య (డీవీవీఎస్) సోమయాజులు, కొంగర విజయలక్ష్మి, పోట్లపల్లి కేశవరావు, మంతోజ్ గంగారావు, అభినంద్‌కుమార్ షావిలి, తొడుపునూరి అమర్‌నాథ్‌గౌడ్ నియమితులయ్యారు. వారి నియామకపు ఫైలుపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం సంతకం చేశారు. అనంతరం వారి నియామకాలను నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. వీరిలో సోమయాజులు విశాఖపట్నం జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేస్తుండగా, మిగతా ఐదుగురు ఉమ్మడి హైకోర్టు న్యాయవాదులు.
ఓ జిల్లా కోర్టు న్యాయవాది హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులవడం మన హైకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి. ఈ నియామకాలతో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది. అయితే న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ఈ నెల 22న, మరో న్యాయమూర్తి జస్టిస్ అనీస్ అక్టోబర్ 20న పదవీ విరమణ చేయనున్నారు. హైకోర్టులో ఇంకా 28 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నూతన న్యాయమూర్తులు ఈ నెల 21 లేదా 22న ప్రమాణం చేసే అవకాశముంది.
దూర్వాసుల వేంకట సూర్యనారాయణ సుబ్రహ్మణ్య సోమయాజులు
1961 సెప్టెంబర్ 26న జన్మించారు. 1985లో న్యాయవాదిగా నమోదయ్యారు. పలు బ్యాంకులకు న్యాయ సలహాదారుగా ఉన్నారు. విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షునిగా చేశారు. ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, బీసీసీఐ లీగల్ కమిటీ సభ్యునిగా, ఆంధ్రా యూనివర్సిటీ సెనేట్ సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తించారు. పలు ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయ సలహాదారుగా ఉన్నారు. సతీమణి శ్రావణి సైకాలజిస్టు. సోమయాజులు తండ్రి డీవీ సుబ్బారావు కూడా న్యాయవాదే. ఆయన విశాఖ మేయర్‌గా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా పని చేశారు.
మంతోజ్ గంగారావు
అనంతపురం జిల్లా గుంతకల్‌లో జన్మించారు. హైదరాబాద్ పీజీ కాలేజీలో ఎంకామ్, ఉస్మానియాలో ఎల్‌ఎల్‌బీ చేశారు. 1988లో న్యాయవాదిగా నమోదయ్యారు. దివంగత న్యాయమూర్తి జస్టిస్ బీఎస్‌ఏ స్వామి వద్ద జూనియర్‌గా వృత్తి జీవితం ప్రారంభించారు. 1995–96 మధ్య, ఆ తర్వాత మరో రెండుసార్లు ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా చేశారు. 2006–2010 మధ్య ఏపీఎస్‌ఎఫ్‌సీ స్టాండింగ్ కౌన్సి ల్‌గా చేశారు. 2010లో ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు.
కొంగర విజయలక్ష్మి
1960 సెప్టెంబర్ 20న జన్మించారు. హైదరాబాద్‌లో సైఫాబాద్ హోలీ మేరీ హైస్కూల్‌లో టెన్త్, నాంపల్లి వనితా మహిళా కాలేజీలో ఇంటర్, ఆర్‌బీవీఆర్ రెడ్డి కాలేజీలో బీకాం చేశారు. ఏలూరు సీఆర్ రెడ్డి లా కాలేజీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి ఆంధ్రా వర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ పొందారు. ఉస్మానియాలో ఎల్‌ఎల్‌ఎం చేశారు. 1985లో న్యాయవాదిగా నమోదయ్యారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎస్.పర్వతరావు వద్ద జూనియర్‌గా వృత్తి జీవితం ప్రారంభించారు. 1991–95 మధ్య ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా పనిచేశారు. 1996లో ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు. సివిల్, క్రిమినల్, ట్యాక్స్ కేసుల్లో మంచి పేరు సంపాదించారు.
అభినంద్ కుమార్ షావిలి
1963 అక్టోబర్ 8న జన్మించారు. హైదరాబాద్ అబిడ్స్ సెయింట్ జాన్స్ హైస్కూల్‌లో టెన్త్, నృపతుంగ జూనియర్ కాలేజీలో ఇంటర్, నిజాం కాలేజీలో బీఎస్సీ చదివారు. ఉస్మానియా నుంచి ఎల్‌ఎల్‌బీ చేశారు. 1989లో న్యాయవాదిగా నమోదయ్యారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు వద్ద వృత్తి జీవితం ప్రారంభించారు. రాజ్యాంగ, సివిల్ కేసుల్లో మంచి పేరు సాధించారు. హైకోర్టుతో పాటు కేంద్ర, రాష్ట్ర పరిపాలన ట్రిబ్యునళ్లలో కేసులు వాదించారు.
పోట్లపల్లి కేశవరావు
వరంగల్ జిల్లాలో 1961 మార్చి 29న జన్మించారు. హన్మకొండ మర్కాజీ హైస్కూల్‌లో టెన్త్, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్, డిగ్రీ కాలేజీలో బీకాం చదివారు. యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లా నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 1986లో న్యాయవాదిగా నమోదయ్యారు. వరంగల్‌లో ప్రముఖ న్యాయవాది పి.సాంబశివరావు వద్ద వృత్తి జీవితం ప్రారంభించారు. హైదరాబాద్‌కు ప్రాక్టీస్ మార్చి ఎం.వి.రమణారెడ్డి వద్ద జూనియర్‌గా చేశారు. సివిల్, కంపెనీ, క్రిమినల్, ఎన్నికలు, సర్వీసు అంశాల్లో పట్టు సాధించారు. ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు. 2010 నుంచి 2016 వరకు సీబీఐ స్పెషల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా, జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్‌గా చేశారు.
తొడుపునూరి అమర్‌నాథ్‌గౌడ్
1965 మార్చి 1న హైదరాబాద్‌లో జన్మించారు. సికింద్రాబాద్ సెయింట్ ప్యాట్రిక్స్ హైస్కూల్‌లో టెన్త్, వెస్లీ జూనియర్ కాలేజీలో ఇంటర్, బేగంపేట ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ నుంచి బీఎస్సీ, మహారాష్ట్రలోని శివాజీ లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ చేశారు. 1990లో న్యాయవాదిగా నమోదయ్యారు. విశ్రాంత న్యాయ మూర్తి జస్టిస్ వంగా ఈశ్వరయ్య వద్ద వృత్తి జీవి తం ప్రారంభించారు. ఎక్సైజ్, కార్పొరేషన్, కార్మిక కేసులను పెద్ద సంఖ్యలో వాదించారు. నల్లగొండ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్‌కు స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు.