
న్యూఢిల్లీ: తప్పుడు అఫిడవిట్లు, చెల్లింపు వార్తలను ఎన్నికల నేరాలుగా పరిగణించడం సహా ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన పలు ప్రతిపాదనలను ఎన్నికల సంఘం కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది. ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ అరోరా, కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్ర మంగళవారం లెజిస్లేటివ్ సెక్రటరీ నారాయణరాజుతో భేటీ అయ్యారు. ఓటరు జాబితాతో ఆధార్ నెంబర్‌ను అనుసంధానించే విషయం భేటీలో చర్చకొచ్చింది. ఓటర్లుగా నమోదు చేసుకోవాలనుకునే వారు, ఇప్పటికే ఓటర్లుగా నమోదైనవారు తమ ఆధార్ నెంబర్‌ను అనుసంధానం చేసుకోవాలని కోరేందుకు వీలుగా ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలని కోరుతూ ఇటీవల ఎన్నికల సంఘం కేంద్ర న్యాయ శాఖకు లేఖ రాసింది. అందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన న్యాయశాఖ.. ఆధార్ డేటా భద్రత విషయంలో తమకు హామీ ఇవ్వాలని కోరింది. దీనిపై డేటా భద్రతకు తీసుకోనున్న చర్యలను వివరిస్తూ ఎన్నికల సంఘం సమాధానమిచ్చింది. ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన దాదాపు 40 ప్రతిపాదనలు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న విషయాన్ని న్యాయశాఖ దృష్టికి తీసుకువెళ్లామని ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. కాగా, 20 మంది చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు, పలువురు ఎన్నికల సంఘం అధికారులతో కూడిన 9 బృందాలు తాము రూపొందించిన సంస్కరణల ప్రతిపాదనలను మంగళవారం ఎన్నికల సంఘానికి సమర్పించాయి. ఇటీవలి లోక్‌సభ, ఇతర అసెంబ్లీ ఎన్నికల అనుభవాల ఆధారంగా ఈ సిఫారసులను రూపొందించారు.