
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం వెల్లడించింది. 70 అసెంబ్లీ స్థానాలకు జనవరి 14న నోటిఫికేషన్ విడుదల కానుందని సీఈసీ సునీల్ అరోరా తెలిపారు. అలాగే ఫిబ్రవరి 8న పోలింగ్, ఫిబ్రవరి 11న ఎన్నికల ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటించారు. ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి రానుందని అరోరా పేర్కొన్నారు. ఫిబ్రవరి 22తో ఢిల్లీ అసెంబ్లీ గడువు ముగియనున్న విషయం తెలిసిందే.
అధికార ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. సంక్షేమ పథకాలపై నమ్మకంతో మరోసారి అధికారంలోకి రావాలని ఆప్ ప్రయత్నిస్తుండగా, పూర్వ వైభవం కోసం బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా కృషిచేస్తున్నాయి. గత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 67 స్థానాలను దక్కించుకుని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ చరిత్ర సృష్టించింది. దేశ రాజధాని కావడంతో ఈ ఎన్నికల కోసం దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment