గుజరాత్ సీజేగా జస్టిస్ సుభాష్‌రెడ్డి | Gujarat CJ Justice subhash reddy | Sakshi
Sakshi News home page

గుజరాత్ సీజేగా జస్టిస్ సుభాష్‌రెడ్డి

Published Mon, Feb 1 2016 4:51 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

గుజరాత్ సీజేగా జస్టిస్ సుభాష్‌రెడ్డి - Sakshi

గుజరాత్ సీజేగా జస్టిస్ సుభాష్‌రెడ్డి

♦ సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదముద్ర
♦ ఈ వారంలో నోటిఫికేషన్ జారీ చేయనున్న కేంద్ర ప్రభుత్వం
♦ జస్టిస్ జయంత్ పటేల్ బదిలీ తరువాతే బాధ్యతల స్వీకరణ
 
 సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రామయ్యగారి సుభాష్‌రెడ్డి గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. గుజరాత్ హైకోర్టు సీజే పదవికి జస్టిస్ సుభాష్‌రెడ్డి పేరును సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఆ సిఫారసుకు ఆమోదముద్ర వేస్తూ సంబంధిత ఫైల్‌పై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శనివారం సాయంత్రం సంతకం చేశారు. అందుకు సంబంధించిన వారెంట్ సైతం సుభాష్‌రెడ్డికి అందింది.

గుజరాత్ హైకోర్టు సీజేగా జస్టిస్ సుభాష్‌రెడ్డి నియామకానికి సంబంధించి కేంద్ర న్యాయ శాఖ ఈ వారంలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం గుజరాత్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్ జయంత్ ఎం.పటేల్ కర్ణాటక హైకోర్టుకు బదిలీపై వెళ్లిన తరువాత జస్టిస్ సుభాష్‌రెడ్డి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడతారు. ఇందుకు పది, పదిహేను రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలిసింది. న్యాయమూర్తిగా జస్టిస్ సుభాష్‌రెడ్డి పలు కీలక తీర్పులు వెలువరించారు. సుభాష్‌రెడ్డి ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులో నంబర్ టూగా కొనసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర కోటాలో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం ఉంది.

 వ్యవసాయ కుటుంబం నుంచి సీజే వరకు
 వివాదరహితుడిగా పేరున్న జస్టిస్ రామయ్యగారి సుభాష్‌రెడ్డి 1957లో మెదక్ జిల్లా చినశంకరంపేట మండలం కామారం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. రామయ్యగారి జగన్నాథరెడ్డి, విశాలదేవి ఆయన తల్లిదండ్రులు. శంకరంపేటలో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. హైదరాబాద్‌లోని ఏవీ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తరువాత ఓయూ నుంచి లా డిగ్రీ పొందారు. 1980 అక్టోబర్ 30న ఏపీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి(హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, ప్రస్తుత లోకాయుక్త) వద్ద న్యాయవాద జీవితాన్ని ప్రారంభించారు.

సుభాష్‌రెడ్డి సోదరినే జస్టిస్ సుభాషణ్‌రెడ్డి వివాహం చేసుకున్నారు. జస్టిస్ సుభాషణ్‌రెడ్డి న్యాయమూర్తిగా నియమితులైన తరువాత తన సహచరులు రఘువీర్‌రెడ్డితో కలసి సుభాష్‌రెడ్డి సొంతంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. నిజామాబాద్‌లో ప్రముఖ న్యాయవాది అయిన బి.ఆర్.గంగారెడ్డి కుమార్తె రజితను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. మొదటి కుమారుడు ఆర్.అశ్విన్‌రెడ్డి ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా పనిచేస్తుంటే, రెండో కుమారుడు సుశాంత్‌రెడ్డి తండ్రి అడుగుజాడల్లో న్యాయవాద వృత్తిని కొనసాగిస్తున్నారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన అంశాల్లో జస్టిస్ సుభాష్‌రెడ్డికి పట్టు ఉంది. పలు  సంస్థలకు, వర్సిటీలకు ఆయన న్యాయవాదిగా పనిచేశారు. 2001-02లో హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2002, డిసెంబర్ 2న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2004 జూన్‌లో శాశ్వత న్యాయమూర్తి అయ్యా రు. న్యాయమూర్తిగా ఆయన హైకోర్టులో పలు కీలక కమిటీలకు నేతృత్వం వహించారు.
 
 ఎంత పెద్దోడైనా ఊరును మరవలే..
 జస్టిస్ సుభాష్‌రెడ్డి ఎంత పెద్దోడు అయినా సొంత ఊరును మరువలేదు. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారని తెలిసి ఎంతో సంబరపడ్డాం. గ్రామానికి ఎప్పుడు వచ్చినా యోగక్షేమాలు అడుగుతారు. గ్రామంలో ఎందరికో సహాయం చేశారు. ఊరు నుంచి ఎవరు వెళ్లినా ఇంట్లోకి పిలిచి భోజనం పెట్టనిదే వదలరు.
 - చిన్ననాటి గురువు తారక పోచయ్య, కామారం
 
 మా ఊరు చేసుకున్న అదృష్టం
 మా గ్రామానికి చెందిన సుభాష్‌రెడ్డి గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావడం మా ఊరు చేసుకున్న అదృష్టం. గ్రామంలో రోడ్ల అభివృద్ధి ఆయన చలవతోనే సాధ్యమైంది. ఆయన సొంత నిధులతో హనుమాన్ దేవాలయం ప్రహరీని నిర్మించారు. మా కష్టసుఖాల్లో పాలు పంచుకున్న ఆయనను మేము ఎప్పటికీ మరచిపోలేం.
 - హేమలత, కామారం సర్పంచ్
 
 పురిటిగడ్డలో హర్షాతిరేకాలు
 చిన్నశంకరంపేట: ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి సుభాష్‌రెడ్డి గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావడంపట్ల ఆయన పురిటిగడ్డ మెదక్ జిల్లా చినశంకరంపేట మండలం కామారం గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నా.. సాధారణ పౌరుడిలా గ్రామానికి వస్తూ అందరినీ పలకరిస్తూ యోగక్షేమాలను కనుక్కునేవారని స్థానికులు గుర్తుచేసుకున్నారు. గ్రామాభివృద్ధి కోసం తన వంతు సహకారం అందిస్తున్నారని తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం ఆయన కృషి వల్లే జరిగిందన్నారు. ఇటీవల గ్రామంలో తన సోదరుడి కుమారుడి పెళ్లికి వచ్చి పోచమ్మ గుడిలో మొక్కులు తీర్చుకున్నారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement