సన్మానం అందుకున్న జస్టిస్ సుభాషణ్‌రెడ్డి దంపతులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీలకు లోకాయుక్తగా వ్యవహరిస్తున్న విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.సుభాషణ్ రెడ్డి బుధవారం పదవీ విరమణ చేశారు. లోకాయుక్త కార్యాలయ ప్రాంగణంలో ఆయనకు సన్మానం చేశారు. కార్యక్రమంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఎ.గోపాల్‌రెడ్డి, జస్టిస్ పి.స్వరూప్‌రెడ్డి, జస్టిస్ జి.చంద్రయ్య, ఉపలోకాయుక్త గంగిరెడ్డి పాల్గొన్నారు. మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పోస్టు ఎంత ఆత్మ సంతృప్తి కలిగించిందో.. లోకాయుక్త పోస్టు కూడా అంతే సంతృప్తి కలిగించిందని జస్టిస్ సుభాషణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ పోస్టుల ద్వారా అనేక మంది పేదలకు న్యాయం చేసే అవకాశం కలిగిందన్నారు. పెన్షన్‌లు, రేషన్ కార్డులు వంటివి అందక ఇబ్బందిపడే పేద ప్రజలకు న్యాయం జరిగేలా చూశానని, ఇది ఎంతో ఆనందం కలిగించిందని ఆయన చెప్పారు.
పేదలకు న్యాయం చేసేందుకు ఒక్కోసారి చట్ట పరిధి దాటి కూడా వ్యవహరించాల్సి వచ్చిందన్నారు. తన సిబ్బంది సహాయ సహకారాలు అందించారని, లోకాయుక్తలో భర్తీ చేసిన పోస్టుల విషయంలో ఎక్కడా పక్షపాతానికి తావివ్వలేదని పేర్కొన్నారు. ఏ వృత్తిలోనైనా కష్టపడితేనే ఫలితం దక్కుతుందని పేర్కొన్నారు. జస్టిస్ సుభాషణ్‌రెడ్డి గొప్ప మానవతావాదని ఉపలోకాయుక్త గంగిరెడ్డి కొనిడాయారు. విధి నిర్వహణలో సుభాషణ్‌రెడ్డి ఎంతో మందికి ఆదర్శప్రాయులని తెలిపారు. అనంతరం జస్టిస్ సుభాషణ్‌రెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు. లోకాయుక్తగా జస్టిస్ సుభాషణ్‌రెడ్డి పదవీ విరమణ చేసిన నేపథ్యంలో కొత్త లోకాయుక్త నియామకానికి ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. అప్పటి వరకు ఉప లోకాయుక్త గంగిరెడ్డి లోకాయుక్తగా బాధ్యతలు నిర్వర్తిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment