చర్చల ద్వారా పరిష్కరించుకోండి
పురోగతి లేకుంటే మాకు చెప్పండి
♦ అప్పుడు మేమే తగిన ఆదేశాలు జారీ చేస్తాం
♦ విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదంపై
♦ ఇరు రాష్ట్రాలకూ హైకోర్టు స్పష్టీకరణ
♦ తదుపరి విచారణ 9వ తేదీకి వాయిదా
సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగుల విభజన వ్యవహారంలో తలెత్తిన వివాదాన్ని చర్చలద్వారా పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రప్రభుత్వాలకు హైకోర్టు స్పష్టం చేసింది. రెండురాష్ట్రాల విద్యుత్ అధికారులు చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం కనుగొనాలని సూచించింది. చర్చల్లో పురోగతి లేకుంటే పూర్తిస్థాయి విచారణ అనంతరం తామే తగిన ఆదేశాలు జారీ చేస్తామంది. ఉద్యోగుల విభజన ప్రక్రియను కొలిక్కితెచ్చే బాధ్యతను షీలాభిడే కమిటీకి అప్పగించాలా? లేదా ఇరురాష్ట్రాల అంగీకారంతో కోర్టు పర్యవేక్షణలో కమిటీని ఏర్పాటు చేయాలా? అన్నదానిపై అభిప్రాయం చెప్పాలని ఉభయరాష్ట్రాల అడ్వొకేట్ జనరల్స్(ఏజీ)ను ఆదేశించింది.
వచ్చే విచారణ నాటికి ఏ విషయం చెబితే తదనుగుణంగా ఆదేశాలిస్తామంది. తదుపరి విచారణను ఈనెల 9కి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎ.శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఏపీ స్థానికత ఆధారంగా విద్యుత్ ఉద్యోగుల విభజన మార్గదర్శకాలకు తెలంగాణ విద్యుత్‌శాఖ ముఖ్య కార్యదర్శి ఆమోదముద్ర వేస్తూ జారీచేసిన ఉత్తర్వుల్ని, వాటికనుగుణంగా టీఎస్ ట్రాన్స్‌కో చైర్మన్ రూపొందించిన తుదిజాబితాను సవాలుచేస్తూ పలువురు ఉద్యోగులు పిటిషన్లు వేయడం తెలిసిందే. వీటిని జస్టిస్ సుభాష్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది.
చట్ట నిబంధనలమేరకే విభజన: తెలంగాణ ఏజీ
స్థానికత ఆధారంగా చేపట్టిన ఉద్యోగుల విభజన ప్రక్రియ పునర్విభజన చట్టం మేరకే జరిగిందని తెలంగాణ ఏజీ కె.రామకృష్ణారెడ్డి వాదించారు.
నిబంధనలకు అనుగుణంగా లేదు: ఏపీ ఏజీ
ఏపీ స్థానికత ఆధారంగా విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించిన మార్గదర్శకాలు, తదనుగుణంగా తెలంగాణ విద్యుత్‌శాఖ ముఖ్యకార్యదర్శి జారీచేసిన ఉత్తర్వులు, వాటికనుగుణంగా టీఎస్ ట్రాన్స్‌కో చైర్మన్ రూపొందించిన తుది జాబితా నిబంధనలకు అనుగుణంగా లేదని ఏపీ ఏజీ పి.వేణుగోపాల్ తెలిపారు. ఇదేసమయంలో గతవారం ధర్మాసనం జారీచేసిన ఆదేశాల మేరకు కేంద్రప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. పునర్విభజన చట్టంలోని సెక్షన్-82 ప్రకారం ఆ సంస్థలే ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తిచేయాలని తెలిపింది. వివాద పరిష్కార బాధ్యతను షీలాబిడే కమిటీకి అప్పగించే ఉద్దేశం తమకుందని, దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. వాదనలు విన్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.