యాదాద్రి భువనగిరి జిల్లా జమీలాపేట్‌లో తయారీ
క్రయోజనిక్‌లో వేడి నియంత్రించే ఫోం ప్యాడ్స్
మైనింగ్, రక్షణ, రైల్వేలకు సంస్థ ఉత్పత్తుల ఎగుమతి
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జమీలాపేట్ నుంచి ఎకో థెర్మ్ ఫినోలిక్ ఫోం ప్యాడ్‌లు ఇస్రోకు ఎగుమతి అయ్యాయి. జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగం సమయంలో క్రయోజెనిక్ సిస్టమ్స్‌లో ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు ఈ ప్యాడ్‌లు వాడుతున్నారు. ఇస్రో ఈనెలలో ప్రయోగించే జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌లో అమర్చే అగ్ని నిరోధక పదార్థం దేశంలో ఇక్కడే తయారవుతుంది.
ఈ ఫోం ప్యాడ్‌లు బీబీనగర్ మండలం జమీలాపేట్‌లో వీఎన్‌డీ సెల్‌ప్లాస్ట్ అనే కంపెనీ తయారు చేసి ఎగుమతి చేస్తోంది. సంస్థ తయారు చేసిన 365 ఫోం ప్యాడ్‌లను.. త్రివేండ్రంలోని విక్రమ్‌సారాభాయి స్పేస్ సెంటర్‌కు సంస్థ యాజమాన్యం ఎగుమతి చేసింది. విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్‌లో వీటిని పరిశీలించి నెల్లూరులో ఇస్రో సెంటర్‌కు అందజేస్తారు.
ఉష్ణాన్ని నియంత్రించే ఫోం ప్యాడ్స్
ఫినోలిక్ ఫోం ప్యాడ్‌లు జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను భూమి నుంచి నింగిలోకి ప్రయోగించే సమయంలో వాడతారు. ఉష్ణోగ్రత మారితే సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున ఈ ఫినోలిక్ ఫోం ప్యాడ్‌లు లేకుండా.. జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను ప్రయోగించలేరు. రాకెట్‌లో వేడిని నియంత్రించడానికి థీమ్ ప్యాడ్స్ అమరుస్తారు. బయటినుంచి వచ్చే వేడిని లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. లోపలినుంచి బయటికి వెళ్లి చల్లదనాన్ని అడ్డుకుంటుంది. ఉష్ణోగ్రతలు మారకుండా ఫోం ప్యాడ్‌లు అడ్డుకుంటాయి.
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలకు సరఫరా..
దేశంలో ప్రస్తుతం ఫినోలిక్ మిశ్రమాలను ఒక్క బీబీనగర్‌లోనే తయారు చేస్తున్నారు. మైనింగ్, రక్షణ సంçస్థలకు సరఫరా చేస్తున్నారు. ఇస్రోతో పాటు రైల్వేలు, డీఆర్‌డీవో, డీఆర్‌ఎల్, ఎయిర్‌ఫోర్స్, ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలకు వీటిని సరఫరా చేస్తున్నారు. ఎద్దుమైలారం సాయుధ ట్యాంకులలో ఆయిల్ ఉష్ణోగ్రత సమతుల్యత కోసం ఇన్సులేషన్‌కు ఫినోలిక్ ఫోం ప్యాడ్‌లను వినియోగిస్తున్నారు.
ఇస్రో నుంచి ఆర్డర్‌తో..
ఇస్రో నుంచి ఆర్డర్‌తో మాకు ఎంతో మేలు చేకూరుతుంది. జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌కు తొలిసారిగా సరఫరా చేస్తున్నాం. పది సంవత్సరాలుగా పలు ప్రాజెక్టులకు సరఫరా చేస్తున్నాం. 2003లో ఎన్.సుఖజీవన్‌రెడ్డితో కలిసి కంపెనీని ప్రారంభించాం. మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా మా కంపెనీ ఉత్పత్తులపై సెర్చింగ్ పెరిగింది.
థర్మల్ ఇన్సులిన్‌కు సంబంధించిన పదా«ర్థాలను తయారు చేస్తున్నాం. ఇస్రో డైరెక్టర్ ఉన్నికృష్ణన్ అయ్యర్ మా ఉత్పత్తుల రవాణాను వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.20 లక్షల విలువైన మెటీరియల్ పంపించాం. ఒక జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌కు 365 ఫినోలిక్ ఫోం ప్యాడ్స్ వాడతారు. ఇప్పటికే ఒక రాకెట్‌కు సరిపడా ఫోమ్స్ పంపించాం.
– డి.చంద్రశేఖర్‌రెడ్డి, డైరెక్టర్, వీఎన్‌డీ సెల్‌ప్లాస్ట్ సంస్థ