
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ధ్వజం
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వొద్దని ఆయన అధిష్టానానికి లేఖ రాశారు
20 ఏళ్లు మంత్రిగా ఉన్న జానాకు ఈ అంశం ఇప్పుడు గుర్తొచ్చిందా?
ఒకేఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఉంటే తప్పేంటి?
చౌటుప్పల్: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు మంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా కొందరు వ్యక్తులు దుర్మార్గంగా అడ్డుపడుతున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఆదివారం నిర్వహించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవంలో ఆయన మాట్లాడారు. మహాభారతంలో ధర్మరాజులా ఉండాల్సిన మాజీ మంత్రి జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని దుయ్యబట్టారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వకుండా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఇవ్వాలని అధిష్టానానికి జానా లేఖ రాశారని పేర్కొన్నారు. 20 ఏళ్లు మంత్రి పదవులు అనుభవించిన జానాకు ఈ అంశం ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అని ప్రశ్నించారు. ‘ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వొద్దని కొందరు మాట్లాడుతున్నారు. ఇద్దరికి ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర సాధనకు నా సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రి పదవినే త్యాగం చేశారు.
నేను సోనియాగాంధీని ఒప్పించి, తెగించి పార్లమెంట్‌లో పోరాడా. మా ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి? ఖమ్మం జిల్లాలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు 3 మంత్రి పదవులు ఇచ్చినప్పుడు నల్లగొండలో 11 మందికి 3 మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి?’ అని రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు.
మాట నిలుపుకోవాల్సింది ఎవరు?
గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో మంత్రు లు ఇన్‌చార్జీలుగా ఉన్న పార్లమెంట్ స్థానాలైన కరీంనగర్, మహబూబ్‌నగర్, మల్కాజ్‌గిరి, మెదక్, సికింద్రాబాద్, ఆదిలాబాద్ స్థానాల్లో పార్టీ ఓడిపోయిందని రాజగోపాల్‌రెడ్డి గుర్తుచేశారు. మరి ఇప్పుడు ఆ స్థానాల బాధ్యతలు తీసుకున్న మంత్రులు ఎక్కడికి పోయారని ఆయన నిలదీశారు. తన బలం ఏమిటో తెలిసినందునే ఎంపీ స్థానాన్ని గెలిపించుకొని వస్తానన్న నమ్మకంతో ఎమ్మెల్యే అయిన తనను భువనగిరి పార్లమెంట్ ఇన్‌చార్జిగా అధిష్టానం నియమించిందన్నారు.
పదవుల కోసం అడుక్కోను.. పాకులాడను..
తాను మంత్రి కావాలని జాలితోనో, పైరవీ చేసో అడగట్లేదని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. తనకు దమ్ము, ధైర్యం ఉందని.. మంత్రి పదవికి అర్హత, పదవిని సమర్థంగా చేపట్టగలనని నమ్మితేనే మంత్రి పదవి ఇవ్వాలన్నారు. తాను పదవుల కోసం పాకులాడనని, పదవులు కావాలని అడుక్కోనని స్పష్టం చేశారు. ఎవరి దయాదాక్షిణ్యాల కోసం ఎదురు చూడట్లేదని తేల్చిచెప్పారు. ప్రాణం పోయినా నియోజకవర్గ ప్రజలు తలదించుకొనేలా ప్రవర్తించబోనని భావోద్వేగానికి లోనయ్యారు.
కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా, చండూరు మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమంలోనూ పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. తన ఓపికను చేతగాని తనంగా చూడొద్దని.. తనకు ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 16 నెలలుగా మంత్రి పదవులను ఖాళీగా ఉంచడం సరికాదని అభిప్రాయపడ్డారు.