
బండి సంజయ్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి
రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
భువనగిరి, నల్లగొండ జిల్లాల్లో సన్నబియ్యం పంపిణీ ప్రారంభం
సాక్షి, యాదాద్రి, కనగల్: రేషన్ దుకాణాల్లో నరేంద్రమోదీ ఫొటో పెట్టాలని బండి సంజయ్ జోక్ చేస్తున్నాడని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కేంద్రం ఏం ఇస్తుందని ప్రధాని ఫొటో రేషన్ దుకాణాల్లో పెట్టాలని ఆయన ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో, నల్లగొండ జిల్లా కనగల్ మండలం జి.ఎడవల్లి గ్రామంలో మంగళవారం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, శంషాబాద్ ఎయిర్‌పోర్టు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిర్మించారని, అందులో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వాటా 13 శాతం ఉందన్నారు. మరి ఎయిర్‌పోర్టులో తెలంగాణ సీఎం ఫొటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. బండి సంజయ్ చిల్లర రాజకీయం మానుకోవాలని హితవుపలికారు. రాష్ట్రాల సముదాయమే కేంద్రమని, రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయంతోనే కేంద్రం నడుస్తుందన్నారు.
కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం రూపాయి ఇస్తే.. 42 పైసలే వాపస్ ఇస్తున్నారని అన్నారు. ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు రూపాయి ఇస్తే.. 7 రూపాయలు తిరిగి ఇస్తున్నారని.. బండి సంజయ్ ఇది తెలుసుకోవాలన్నారు.
సన్న బియ్యం పథకం చరిత్రలో నిలిచిపోతుంది..
సన్న బియ్యం పథకం నిరుపేదల ఆత్మగౌరవమని, ఇది చరిత్రలో నిలిచిపోయే పథకమని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, తమ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తోందని, 20 లక్షల మంది పేర్లు రేషన్ కార్డులలో చేర్పించామని చెప్పారు.
రూ.3 కోట్ల పది లక్షల మందికి సన్నబియ్యం ఇవ్వనున్నామని, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, భువనగిరి కలెక్టర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.