
ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా
సొంతంగా ప్రిపరేషన్
మిర్యాలగూడ: పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది నల్ల గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం బంగారుగడ్డ కాలనీకి చెందిన చిరువ్యాపారి ఎండీ మౌజంఅలీ, అమీనాబీ దంపతుల రెండో కుమార్తె జువేరియా. డిగ్రీ పూర్తికాగానే గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదలవ్వడంతో సొంతంగా ప్రిపేరై మొదటి ప్రయత్నంలోనే కొలువు విజయం సాధించి పలువురికి స్ఫూర్తిగా నిలిచింది. ఇటీవల ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో 465.5 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 162వ ర్యాంకు, మల్టీ జోన్–2లో 6వ ర్యాంకు సాధించింది. తక్కువ సమయంలోనే ఉన్నత ఉద్యోగం సాధించడానికి జువేరియా చేసిన కృషి ఆమె మాటల్లోనే..
మా అక్కనే స్ఫూర్తి..
నేను 1–7వ తరగతి వరకు మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డలో గల కైరళి స్కూల్‌లో, 8–10వ తరగతి వరకు చైతన్యనగర్‌లోని ఆదిత్య స్కూల్‌లో చదివాను. పదో తరగతిలో 10జీపీఏ సాధించడంతో పాటు మిర్యాలగూడలోనే కేఎల్‌ఎన్ కళాశాలలో ఇంటర్‌లో ఎంపీసీ విభాగంలో 989మార్కులు సాధించి టాప్ ర్యాంకర్‌గా నిలిచాను. దీంతో 2022–23లో కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.లక్ష చొప్పున మూడు సంవత్సరాల డిగ్రీకి రూ.3లక్షల స్కాలర్‌షిప్ అందించింది.
2023లో హైదరాబాద్ కోటి ఉమెన్స్ కళాశాలలో బీఎస్సీ మ్యాథ్స్ పూర్తిచేసి యూజీసీ చైర్మన్ జగదీష్ చేతుల మీదుగా గోల్డ్‌మెడల్ అందుకున్నాను. 2024లో గ్రూప్–1 నోటిఫికేషన్ పడగా దరఖాస్తు చేసుకోని సొంతంగా ప్రిపేరయ్యాను. మా అక్క సుమయ్య పర్వీన్ కూడా ఇంటర్మీడియట్ పూర్తికాగానే డీఎస్సీ రాసి ఉర్దూ మీడియంలో జిల్లా మొదటి ర్యాంకు సాధించి ప్రస్తుతం కోదాడ ఉర్దూ మీడియం పాఠశాలో ఎస్‌జీటీగా పనిచేస్తోంది. ఆమె నాకు ప్రభుత్వ ఉద్యోగం సాధించడంలో స్ఫూర్తిగా నిలిచింది.
సొంతంగానే చదివా..
గ్రూప్స్‌కు ప్రిపేరయ్యే వారు కోచింగ్ సెంటర్లలో సుదీర్ఘంగా కోచింగ్ తీసుకుంటారు. కానీ నేను ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే సొంతంగానే ప్రిపేరై గ్రూప్–1 ఉద్యోగాన్ని సాధించా. ప్రిపరేషన్‌కు అవసరమయ్యే మెటీరియల్‌ను హైదరాబాద్ నుంచి తెప్పించుకొని రోజుకు 12–14 గంటల పాటు చదివేదాన్ని. అంతేకాకుండా ఇంట్లో కూర్చొనే చోట, హాల్‌లో, బెడ్‌రూంలో, కిచెన్‌లో నాకు అవసరమైన మెటీరియల్‌ను చార్ట్ రూపంలో గోడలకు అంటించి నిత్యం చూస్తూ ఉండేదాన్ని. కూర్చొన్నా, నిల్చున్నా ఆ చార్ట్‌లను చూసుకొని అందులోని విషయాలను ఒకటికి రెండుసార్లు నెమరువేసుకునేదాన్ని. దీనికి తోడు యూట్యూబ్, ఇంటర్‌నెట్ ద్వారా అవసరమైన సమాచారాన్ని సేకరించుకోని ప్రిపేరయ్యాను.
కలెక్టర్ కావడమే లక్ష్యం..
గ్రూప్–1 ఉద్యోగం సాధించడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. డిగ్రీ పూర్తయ్యే వరకు గ్రూప్స్ రాస్తానని అనుకోలేదు. డిగ్రీ పూర్తికాగానే నోటిఫికేషన్ రాగానే దరఖాస్తు చేసుకున్నా. భవిష్యత్తులో సివిల్స్‌కు ప్రిపేరై కలెక్టర్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్నా. కలెక్టర్ అయ్యి పేద ప్రజలకు సేవలు అందిస్తా. నా విజయం వెనుక నా తల్లిండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది.