mahakumbhabhishekam
-
16 నుంచి శ్రీశైలంలో మహాకుంభాభిషేకం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో ఈ నెల 16–21 వరకు మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఈ క్రతువు జరిపించాలని ఆలయాధికారులు భావించినా పలు కారణాలతో ఐదేళ్లుగా వాయిదా పడుతూ వచ్చింది. గతేడాది కుంభాభిషేకంతో పాటు శివాజీ గోపురానికి కూడా కలశ ప్రతిష్టాపన నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కుంభాభిషేక పనులు కూడా సిద్ధం చేసినా అనుకోని విధంగా వాయిదా పడింది. ఆ తరువాత ఓ హిందూ ధార్మిక సంస్థ పేరుతో కుంభాభిషేక నిర్వహణపై హైకోర్టుకు వెళ్లారు. కుంభాభిషేకాన్ని ఈ నెల 16– 21 వరకు నిర్వహించాలని హైకోర్టు సూచించడంతో అధికారులు కుంభాభిషేకానికి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మల్లికార్జున స్వామి గర్భగుడి, ఆలయంలో ఉన్న 4 గోపురాలతో పాటు అమ్మవారి ఆలయం వద్దనున్న గోపురానికి, ఉపాలయాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. శిథిలావస్థకు చేరి కూలిపోయిన శివాజీ గోపురాన్ని దేవస్థానం పునఃనిర్మించింది. 2018లో ఈ నిర్మాణం పూర్తయినప్పటికీ ఇంతవరకు కలశ ప్రతిష్టాపన జరగలేదు. ఐదేళ్లుగా కలశ ప్రతిష్టాపనకు గోపురం నోచుకోలేదు. కుంభాభిషేకం నిర్వహణ సమయంలోనే కలశ ప్రతిష్టాపన, కుంభాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో డి.పెద్దిరాజు తెలిపారు. -
కాణిపాకం ఆలయానికి కొత్త మెరుగులు.. మహా కుంభాభిషేకానికి సర్వం సిద్ధం
సాక్షి, చిత్తూరు: వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన స్వయంభు శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి మహా కుంభాభిషేకానికి సర్వం సిద్ధమైంది. ఈనెల 21న ఆదివారం శాస్త్రోక్తంగా చతు ర్వేదహవన సహిత మహా కుంభాభిషేకం నిర్వహణకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వస్తి శ్రీ చంద్రమాన శుభ కృత్ నామ సంవత్సర శ్రావణ బహుళ దశమి మృగశిరా నక్షత్ర యుక్త శుభ కన్యా లగ్నము నందు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు వరకు విమాన గోపురం, ధ్వజస్తంభానికి మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు. ►మహా కుంభాభిషేకంలో భాగంగా ఉదయం 6 గంటల నుంచి చతుర్థ కాల హోమము, మహా పూర్ణాహుతి, కలశోద్వాసన ►ఉదయం 8 నుంచి 8.30 గంటలలోపు రాజ గోపురం, పశ్చిమ ద్వార గోపురం, స్వామి వారి విమాన గోపురం, నూతన ధ్వజ స్తంభములకు మహా కుంభాభిషేకం ►ఉ.8:30 నుంచి 9 గంటల పు స్వయం భు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి కుంభాభిషేకం, తీర్థ ప్రసాద వినియోగం, యజమానోత్సవం. ►మహా కుంభాభిషేకము అనంతరం మ.2 గంటల నుంచి స్వామి వారి మూల విరాట్ దర్శనం కల్పించనున్నారు. ►సా. 6 నుంచి శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి తిరు కళ్యాణం. అలాగే గ్రామోత్సవం నిర్వహించనున్నారు. ఈనెల 21 నుంచి మూల విరాట్ స్వయంభు వినాయక పునర్దర్శనం భక్తులకు అందుబాటులో రానున్నది. ఆలయ పునర్నిర్మాణానికి కృష్ణా జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐలు గాయత్రీ దేవి, ఐకా రవి దంపతులు.. గుత్తికొండ జానకి,శ్రీ గుత్తికొండ శ్రీనివాస్ దంపతులు రూ.10 కోట్ల విరాళం ఇచ్చారు. దేవస్థానంలో అభివృద్ధి పనులు ► రూ.5 కోట్లతో నూతన లడ్డు పోటు, పడి తరం స్టోరు నిర్మాణం ► సుమారు రూ. 12 కోట్లతో వినాయక సదన్ వసతి గదుల 2, 3 వ అంతస్తుల నిర్మాణం ► సుమారు రూ.9 కోట్లతో భక్తుల సౌక ర్యార్థం నూతన ఏసీ, నాన్ ఏసీ కళ్యాణ మండపంలో నిర్మాణానికి ప్రతిపాదనలు జరిగాయి. ► సుమారు రూ. 20 కోట్లతో నూతన క్యూ కాంప్లెక్స్ భవనానికి సంబంధించిన నిర్మాణానికి అంచనా ► సుమారు రూ. 14 కోట్లతో నూతన బస్టాండు మరియు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి అంచనా. ► సుమారు రూ. 4 కోట్లతో 100 అడుగుల రోడ్డు మరియు స్వాగతం ఆర్చి గేట్ నిర్మాణానికి చర్యలు.. -
ఆయనే నిజమైన కళాకారుడు – కైకాల సత్యనారాయణ
‘‘ఆ ఈశ్వరుడికి, కళకు సంబంధం ఉంది. కళలో ఈశ్వర శక్తి ఉంది. అందుకే కళలను ప్రేమిస్తాను. ఆరాధిస్తాను. కళాకారులపై అభిమానంతో, వారిని అభినందించి సత్కరిస్తాను. దీనికి రాజకీయంతో సంబంధం లేదు. కళలను ఆరాధిస్తూ అందర్నీ ప్రేమిస్తూ, అజాత శత్రువుగా ఉండాలన్నదే జీవితంలో నా కోరిక అన్నారు’’ కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి. మహా శివరాత్రి సందర్భంగా విశాఖ సముద్ర తీరాన టీయస్సార్ ఆధ్వర్యంలో కోటి శివలింగాల ప్రతిష్ట, మహా కుంభాభిషేకం కార్యక్రమం ఈ నెల 13న జరగనుంది. ఈ సందర్భంగా సీనియర్ నటులు కైకాల సత్యనారాయణకు ‘విశ్వనట సమ్రాట్ బిరుదు’ ప్రదానం చేయనున్నారు. అలాగే యశ్ చోప్రా స్మారక జాతీయ అవార్డును ప్రముఖ గాయని ఆశా భోంస్లేకు ప్రదానం చేయనున్నారు. ఈ వేడుకల వివరాలను హైదరాబాద్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో టి. సుబ్బరామిరెడ్డి వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ – ‘‘కోటి లింగాల ప్రతిష్ట, మహా కుంభాభిషేకం కార్యక్రమం ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తయింది. ఫిబ్రవరి 13న సిల్వర్ జూబ్లీ చేయనున్నాం. ఆ రోజు 7 గంటలకు ప్రారంభమయ్యే అభిషేకం మధ్యాహ్నం మూడు గంటల వరకు సాగుతుంది. అలాగే సాయంత్రం 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు శివజాగారం కొరకు భక్తి రస కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. దాదాపు వెయ్యి చిత్రాల్లో కైకాల సత్యనారాయణ నటించారు. ఎన్టీఆర్ వంటి గ్రేట్ ఆర్టిస్ట్తో వర్క్ చేశారు. ఆయనకు ‘విశ్వనట సమ్రాట్’ బిరుదును ప్రదానం చేయనున్నాం. స్వర్ణకంకణ ఘనసన్మానం కూడా జరుగుతుంది. యశ్ చోప్రాగారు దేశం గర్వించదగ్గ ఫిల్మ్మేకర్. ఆయనతో కలిసి ‘చాందినీ, లమ్హే’ లాంటి చిత్రాల నిర్మాణంలో పాలు పంచుకున్నందుకు ఆనందంగా ఉంది. ఆయన జ్ఞాపకార్థం 2014లో ప్రారంభించిన యశ్ చోప్రా స్మారక జాతీయ పురస్కారాన్ని ఈ ఏడాది గాయని ఆశా భోంస్లేకు అందజేయాలని జ్యూరీ కమిటీ నిర్ణయించింది. త్వరలో మహబూబ్నగర్లో కాకతీయ కళా వైభోత్సవాన్ని నిర్వహించాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘మహాశివరాత్రి రోజున ప్రజల సమక్షంలో విశ్వనట సమ్రాట్ బిరుదుతో నన్ను సత్కరించనుండటం ఆనందంగా ఉంది. కళాకారులు గౌరవాన్ని కోరుకుంటారు. ఏమీ ఆశించకుండా డబ్బును కళాసేవకు వినియోగిస్తున్నారు టి.సుబ్బరామిరెడ్డిగారు. ఆయనే నిజమైన కళాకారుడు. కళామతల్లి ముద్దుబిడ్డ అన్నది నా ఉద్దేశం. ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో చేయాలి. నాకు పద్మశ్రీ, పద్మ విభూషణ్ కంటే ఈ అవార్డు గొప్పదని నేను భావిస్తున్నాను’’ అన్నారు కైకాల సత్యనారాయణ. ఈ కార్యక్రమంలో మురళీమోహన్, పరుచూరి వెంకటేశ్వరరావు, పద్మినీ కొల్హాపురి, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మార్మోగిన ఓంకార నాదం
ఆదికుంభేశ్వరునికి అంగరంగ వైభవంగా మహాకుంభాభిషేకం l సాగరతీరానికి పోటెత్తిన భక్తులు కాకినాడ రూరల్ : లోకకళ్యాణార్థం శివకేశవులకు నిర్వహించిన మహాకుంభాభిషేకం సందర్భంగా కాకినాడ సాగరతీరం మంగళవారం శివనామస్మరణతో మార్మోగింది. జిల్లా నలుమూలల నుంచీ పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో సాగరతీరం భక్తజనసంద్రంగా మారింది. పోర్టు ఏరియా వద్ద వేంచేసిన ఆదికుంభేశ్వరస్వామి ఆలయం వద్ద ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా కోటీ ఎనిమిది లక్షల శివలింగాలు ఏర్పాటు చేసి, ఉదయం నుంచి రాత్రి వరకూ వివిధ పూజా కార్యక్రమాలు చేపట్టారు. గోపూజతో ప్రారంభించిన మహాకుంభాభిషేకంలో భాగంగా రసలింగేశ్వరుడిని విబూదితో అభిషేకించారు. వేలాది మంది భక్తులు తరలిరాగా ఆ విబూదిని సముద్రంలో నిమజ్జనం చేశారు. పాదరస లింగేశ్వరుడిని కోటీ ఎనిమిది లక్షల శివలింగాల వద్దకు తీసుకువచ్చి, ఆదికుంభేశ్వరస్వామికి, వేంకటేశ్వరస్వామికి, ద్వాదశ లింగాలకు బిల్వార్చన నిర్వహించారు. లలితాదేవికి సహస్రనామాలతో కుంకుమార్చన చేశారు. మంగళాంబికా సమేత ఆదికుంభేశ్వరస్వామికి అంగరంగ వైభవంగా కల్యాణం నిర్వహించారు. ఉదయం 10 గంటలకు నారాయణం మురళి, నాగేశ్వరరావు, తోట పుండరీకాక్షులు దంపతులు.. పాదరస లింగానికి, కోటీ ఎనిమిది లక్షల శివలింగాలకు.. వివిధ రకాల పండ్లు, పువ్వులతో తీసిన రసాలను.. పంచలోహాలతో తయారు చేసిన శంఖంలో పోసి అభిషేకం చేశారు. పండ్ల రసాలతో శివలింగాలను అభిషేకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. ఆ సమయంలో కొద్దిసేపు తొక్కిసలాట జరిగి, ఉద్రిక్తత ఏర్పడింది. హోమం, పూర్ణాహుతి అనంతరం కోటీ ఎనిమిది లక్షల శివలింగాలకు అభిషేకించిన ద్రవ్యాలను సాయంసంధ్య వేళలో 108 మంది కన్యలతో సాగరంలో నిమజ్జనం చేశారు. కుంభేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోనే వేంకటేశ్వరస్వామికి మహాకుంభాభిషేకం నిర్వహించారు. రుద్రాక్షలతో ఏర్పాటు చేసిన శివలింగం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.