మార్మోగిన ఓంకార నాదం
-
ఆదికుంభేశ్వరునికి అంగరంగ వైభవంగా మహాకుంభాభిషేకం l
-
సాగరతీరానికి పోటెత్తిన భక్తులు
కాకినాడ రూరల్ :
లోకకళ్యాణార్థం శివకేశవులకు నిర్వహించిన మహాకుంభాభిషేకం సందర్భంగా కాకినాడ సాగరతీరం మంగళవారం శివనామస్మరణతో మార్మోగింది. జిల్లా నలుమూలల నుంచీ పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో సాగరతీరం భక్తజనసంద్రంగా మారింది. పోర్టు ఏరియా వద్ద వేంచేసిన ఆదికుంభేశ్వరస్వామి ఆలయం వద్ద ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా కోటీ ఎనిమిది లక్షల శివలింగాలు ఏర్పాటు చేసి, ఉదయం నుంచి రాత్రి వరకూ వివిధ పూజా కార్యక్రమాలు చేపట్టారు. గోపూజతో ప్రారంభించిన మహాకుంభాభిషేకంలో భాగంగా రసలింగేశ్వరుడిని విబూదితో అభిషేకించారు. వేలాది మంది భక్తులు తరలిరాగా ఆ విబూదిని సముద్రంలో నిమజ్జనం చేశారు. పాదరస లింగేశ్వరుడిని కోటీ ఎనిమిది లక్షల శివలింగాల వద్దకు తీసుకువచ్చి, ఆదికుంభేశ్వరస్వామికి, వేంకటేశ్వరస్వామికి, ద్వాదశ లింగాలకు బిల్వార్చన నిర్వహించారు. లలితాదేవికి సహస్రనామాలతో కుంకుమార్చన చేశారు. మంగళాంబికా సమేత ఆదికుంభేశ్వరస్వామికి అంగరంగ వైభవంగా కల్యాణం నిర్వహించారు. ఉదయం 10 గంటలకు నారాయణం మురళి, నాగేశ్వరరావు, తోట పుండరీకాక్షులు దంపతులు.. పాదరస లింగానికి, కోటీ ఎనిమిది లక్షల శివలింగాలకు.. వివిధ రకాల పండ్లు, పువ్వులతో తీసిన రసాలను.. పంచలోహాలతో తయారు చేసిన శంఖంలో పోసి అభిషేకం చేశారు. పండ్ల రసాలతో శివలింగాలను అభిషేకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. ఆ సమయంలో కొద్దిసేపు తొక్కిసలాట జరిగి, ఉద్రిక్తత ఏర్పడింది. హోమం, పూర్ణాహుతి అనంతరం కోటీ ఎనిమిది లక్షల శివలింగాలకు అభిషేకించిన ద్రవ్యాలను సాయంసంధ్య వేళలో 108 మంది కన్యలతో సాగరంలో నిమజ్జనం చేశారు. కుంభేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోనే వేంకటేశ్వరస్వామికి మహాకుంభాభిషేకం నిర్వహించారు. రుద్రాక్షలతో ఏర్పాటు చేసిన శివలింగం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.